కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తరఫున ఇటీవలే ఎన్నికైన ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జమాఖండి నియోజకవర్గం నుంచి గెలుపొందిన సిద్దూ భీమప్ప న్యామగౌడ ప్రయాణిస్తోన్న కారు బాగల్‌కోట్ సమీపంలో ప్రమాదానికి గురైంది. గోవా నుంచి బాగల్‌కోటకు వస్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన న్యామగౌడను ఆయన అనుచరులు సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అక్కడే ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతోపాటు డ్రైవర్ కూడా మృతి చెందాడు. ఎదురుగా వచ్చిన ట్రక్కును తప్పించబోయిన డ్రైవర్, పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇటీవల జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో జమాఖండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ శుబ్రావుపై 2795 ఓట్లతో న్యామగౌడ గెలుపొందారు. కాంగ్రెస్- జేడీఎస్ కూటమి తరఫున కుమారస్వామి సీఎంగా ఎన్నికైన విషయం తెలిసిందే. సుమారు 15 రోజుల పాటు తోటి ఎమ్మెల్యేలతో రిసార్ట్స్‌లో గడిపిన న్యామగౌడ రెండు రోజుల కిందటే తన స్వస్థలానికి వచ్చారు. అంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.