ఏలూరు, నవంబర్ 9,
కొల్లేరు.. ఈ పేరు వినగానే ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు నిలయమైన స్వచ్ఛమైన సహజ సిద్ధ మంచినీటి సరస్సు మనకు గుర్తొస్తుంది. 901 చదరపు కి.మీ మేర విస్తరించి దేశంలోనే అత్యంత పెద్ద మంచి నీటి సరస్సుగా, జీవ వైవిధ్యానికి ఆలవాలంగా ఉన్న ఈ ప్రాంతం పర్యాటకంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో కొల్లేరు ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొల్లేరు అభయారణ్యంతో పాటు పరీవాహక ప్రాంతాల పరిరక్షణకై ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొల్లేరు ప్రాంతంలో ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు కానుంది.కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ కొన్ని కార్యకలాపాలను నియంత్రించడమే ఎకో సెన్సిటివ్ జోన్ సరిహద్దుల ప్రాథమిక లక్ష్యం. దీని ద్వారా కొల్లేరు ప్రాంతంలో పర్యావరణానికి హాని కలిగించే చర్యలను నియంత్రించనున్నారు. ఈ క్రమంలో వన్యప్రాణుల అభయారణ్యం, పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షించనుంది. కొల్లేరు ప్లస్ కాంటూర్ కి పైన 10 కి.మీ పరిధి వరకు ఎకో సెన్సిటివ్ జోన్ సరిహద్దులు నిర్దారణ చేయనున్నారు.కొల్లేరు ప్రాంతంలో ఎకో సెన్సిటివ్ జోన్ సరిహద్దుల నిర్ధారణ ప్రతిపాదనలకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని తాజాగా నిర్వహించారు. సరిహద్దుల నిర్ధారణ కోసం సమగ్రమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. ఎకో సెన్సిటివ్ జోన్ ప్రాంతాన్ని, నిర్థారణ పనులను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా, అటవీ, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, ట్రాన్స్ కో, రెవెన్యూ, పంచాయతీ, మత్స్య శాఖ, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, భూగర్భ జలాలు, మున్సిపల్, పర్యావరణ, పరిశ్రమలు, సర్వే, స్వచ్చంద సంస్థలతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎకో సెన్సిటివ్ జోన్ సరిహద్దులు నిర్దారణ క్రమంలో ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అలాగే కమిటీ ఆధ్వర్యంలో గ్రామాల్లో గ్రామసభల నిర్వహణకు సంబంధించి పూర్తి షెడ్యూల్ తయారు చేసి, సంబంధిత గ్రామాల ప్రజలకు దాని వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలియజేస్తారు.గ్రామ సభల్లో వచ్చే సూచనలు, అభ్యంతరాలను నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక అందిస్తుంది. అలాగే కొల్లేరు కాలుష్యానికి ముఖ్య కారణమైన విజయవాడ నుంచి వచ్చే బుడమేరు వ్యర్ధాలు కొల్లేరులో కలవకుండా, తగిన చర్యలు చేపట్టేందుకు అధికారులు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.ఏటా సైబీరియా, ఆస్ట్రేలియా, నైజీరియా వంటి దేశాల నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో వలస పక్షులు ఇక్కడకు వచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. గతంలో స్థానిక పక్షులు కలిపి 189 రకాలు కొల్లేరుపై ఆధారపడి జీవించేవని, ఇప్పుడు సుమారు 73 రకాల పక్షులున్నట్లు అధికారిక సమాచారం. కొల్లేరులో దాదాపు 140 రాకల చేప జాతులున్నట్లు అంచనా. అరుదైన నల్ల జాతి చేపలు ఇక్కడే పురుడు పోసుకున్నట్లు పేర్కొంటున్నారు. మార్పు, కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ, ఇసుక దొందులు వంటి ప్రత్యేక చేపలు ఇక్కడ పుట్టినవేనని చెబుతారు. కొల్లేటి ప్రాంతాన్ని పర్యాటకంగానూ అభివృద్ధి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.