విశాఖపట్టణం, నవంబర్ 9,
ఎందుకో తెలియదు కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి వైసీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం. ఆ వెనువెంటనే అదే తరహా కేసు గత ప్రభుత్వంపై సీఐడీ కేసులు నమోదు చేయడం విశేషం. ముందుగా కేసులు పెడుతున్నారన్న విషయం పురంద్రీశ్వరికి తెలుస్తుందా? లేక ఆమె చేసిన ఆరోపణలను తిప్పి కొడుతూ చంద్రబాబును ఇరుకున పెట్టేవిధంగా సీఐడీ కేసులు నమోదు చేస్తుందా? అన్నది అర్థం కావడం లేదు. ఇదే రకమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. పురంద్రీశ్వరి మాట్లాడకుంటే బెటర్ అని టీడీపీ అభిమానులు భావిస్తున్నారంటే అలాంటి కేసులు నమోదవుతున్నాయని చెప్పక తప్పదు.భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా పురంద్రీశ్వరి నియామకం జరిగిన తర్వాత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతుంది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వద్దకు వెళ్లి మరీ పురంద్రీశ్వరి వినతిపత్రాన్ని ఇచ్చి వచ్చారు. ఇక సీబీఐ దర్యాప్తు చేయాలని కూడా అమిత్ షాను కోరడం కొంతకాలం క్రితం చర్చనీయాంశమైంది. అయితే మద్యం అమ్మకాలపై పురంద్రీశ్వరి మొన్నటి వరకూ ఆరోపణలు చేశారు. మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, తెలియని బ్రాండ్లకు డిస్టలరీస్ కు అనుమతిచ్చారంటూ చిన్నమ్మ వైసీపీ పై చాలా రోజుల పాటు ఆరోపణలు చేస్తూ వచ్చారు. మద్యం విక్రయాలు, కొనుగోళ్లలో పారదర్శకత లేదని, పెద్ద కుంభకోణమే ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరపాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.ఆమె డిమాండ్ చేసిన వెంటనే చంద్రబాబుపై మద్యం అనుమతులపై చంద్రబాబుపై కేసు నమోదయింది. ఏ3 నిందితుడిగా చంద్రబాబును చేర్చారు. చంద్రబాబు నిర్ణయం కారణంగా పదమూడు వందల కోట్లు ఏపీ ఖజానాకు నష్టం వాటిల్లిందని సీఐడీ నమోదు చేసిన కేసులో పేర్కొంది. దీంతో మరో కొత్త కేసుకు సంబంధించి చంద్రబాబు తన న్యాయవాదులతో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత మద్యం విషయాన్ని పక్కన పెట్టిన పురంద్రేశ్వరి ఇసుక కుంభకోణం గురించి ఇటీవల మాట్లాడుతున్నారు. పదే పదే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, దీనివల్ల పెద్దయెత్తున ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని ఆమె ఆరోపణలు చేస్తున్నారు. ఆమె ఆరోపణలు చేస్తుండటానే చంద్రబాబుపై ఇసుక కేసు కూడా నమోదయింది. చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక అంటూ మోసం చేశారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు పది వేల కోట్ల గండి పడిందంటూ సీఐడీ ఈ కేసులో పేర్కొంది. ఇందులో ఏ2గా చంద్రబాబును సీఐడీ చేర్చింది. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. ఏ1 గా మాజీ మంత్రి పీతల సుజాత, ఏ3గా చింతమనేని ప్రభాకర్ పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇలా పురంద్రీశ్వరి లేవనెత్తిన ఆరోపణలపై సీఐడీ కేసులు నమోదు చేస్తుండటం చూసి టీడీపీ నేతలు " అమ్మా నువ్వు గమ్మునుండు. నువ్వు అనడం.. వాళ్లు కేసులు నమోదు చేయడం హేమిటో" అంటూ నిట్టూరుస్తున్నారు. ఇది నిజంగా జరుగుతుందో... కాకతాళీయమో తెలియదు కాని చిన్నమ్మ వైసీపీ చేసిన ఆరోపణలన్నీ చంద్రబాబుపై కేసులుగా మారుతున్నాయి.