
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగినా మన మంచి కే అనుకోవాలని అంటారు సీనియర్లు. ఇప్పుడు కాకలు తీరిన రాజకీయ యోదుడు, ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన కరణం బలరాం పరిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. మరో ఏడాదిలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కరణం పరిస్థితి పులుసు కారిపోయేలా ఉందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తన వారసుడు కరణం వెంకటేష్‌ను రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు వద్ద కూడా వివరించారు. అయితే, దీనిపై ఎలాంటి హామీ లభించలేదు. పైగా ఇక్కడే గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చంద్రబాబు పెద్దపీట వేశారు. ఈ పరిణామంతో కరణం హతాశులయ్యారు. వాస్తవానికి ఈ రెండు కుటుంబాల మధ్య తీరని రగడ నడుస్తోంది. ఈ క్రమంలోనే గొట్టిపాటిని కరణం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.టీడీపీలో గడిచిన 35 ఏళ్లుగా ఆయన రాజకీయాలు చేస్తున్నారు. పలుమార్లు చట్టసభలకు కూడా ప్రాతినిధ్యం వహించారు.టీడీపీలో బలమైన నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే, తన నోటి దురద, వర్గం పోరు వంటివి ఆయనను పార్టీలో బలహీనం చేశాయి. నియోజకవర్గంలో తనను ఎదిరించే మొనగాడు ఎవరూ ఉండకూడదనే స్థాయిలో కరణం వ్యవహరిస్తున్న తీరు పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయనను ఎప్పటికప్పుడు దూరం చేస్తూనే ఉంది. తాజాగా మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. ప్రస్తుతం కరణం ఎమ్మెల్సీగా ఉన్నారు. సర్దుకు పోవాలని చంద్రబాబు ఎప్పటికప్పుడు కరణం, గొట్టిపాటిల మధ్య సయోధ్య చేస్తూనే ఉన్నారు. అయినా కూడా కరణం బలరాం మాత్రం.. రెచ్చిపోతూనే ఉన్నారు. మరోపక్క, మరో ఏడాదిలోనే ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి టికెట్‌ను ఆశిస్తున్న కరణం.. ఇటీవల తన మనసులో కోరికను చంద్రబాబుకు వర్తమానం పంపారట. అయితే, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ఉండి ఉంటే.. తప్పకుండా ఇచ్చేవారని బాబు అన్నారట.
నియోజకవర్గాల పెంపు అంశం ఇప్పుడు తెరమరుగైన నేపథ్యంలో కరణం కుమారుడి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వైసీపీ నుంచి వచ్చిన గొట్టిపాటికి సీఎం చంద్రబాబు అద్దంకి టికెట్‌ను రిజర్వ్ చేశారు. దీంతో ఇప్పుడు కరణం కుమారుడి పరిస్థితి ఏంటనే చర్చసాగుతోంది. ఇదిలావుంటే, మరోవైపు.. గొట్టిపాటి ఎలాగూ తమకు హ్యాండిచ్చాడు కాబట్టి.. కరణం వంటి బలమైన నాయకుడిని తమ పార్టీలో చేర్చుకుంటే బాగుంటుందని జగన్ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే కరణం పార్టీ మారితే.. ఆయన కోరినట్టు ఆయన కుమారుడికి చీరాల, లేదా అద్దంకి టికెట్‌లలో ఏదో ఒక్టి ఇచ్చేందుకు అభ్యంతరం లేదని వైసీపీ అధినేత జగన్ వర్తమానం పంపినట్టు ప్రచారం జరుగుతోంది. కరణం గుంభనంగా ఉన్నారని సమాచారం. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండడం, చంద్రబాబు నుంచి ఏ విషయం స్పష్టం కాకపోవడంతో కరణం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. అయితే, వాస్తవానికి.. కరణం కన్నా.. గొట్టిపాటికే ఈ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని, కరణం పార్టీ మారితేనే ఆయన కుమారుడికి టికెట్ దక్కుతుందని ఆయన అనుచరులు అంటుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి