YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వారసత్వ రాజకీయాలకు కమలం చెక్...

వారసత్వ రాజకీయాలకు కమలం చెక్...

హైదరాబాద్, నవంబర్ 9,
బీజేపీలో వారసత్వ, ఆధిపత్య రాజకీయాలకు చాన్స్ లేదని అధిష్టానం స్పష్టం చేసింది. టికెట్ల కేటాయింపు ద్వారా దీన్ని నిరూపించింది. తన కొడుకు వికాస్ రావుకు వేములవాడ టికెట్ కేటాయించాలని మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తన కూతురు విజయలక్ష్మికి ముషీరాబాద్ స్థానాన్ని కేటాయించాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం కోరారు. అయితే పార్టీ వారికి టికెట్ కేటాయించలేదు. వేములవాడ స్థానాన్ని బీసీ నేత తుల ఉమకు, ముషీరాబాద్ స్థానాన్ని లక్ష్మణ్ అనుచరుడు పూస రాజుకు కేటాయించారు.దీంతో ఒక గవర్నర్, ఒక మాజీ గవర్నర్ తమ వారసులను రాజకీయాల్లోకి దింపాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇదిలా ఉండగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డికి పాలమూరు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించింది. అయితే దీని వెనక క్యాలిక్యులేషన్స్ వేరే ఉన్నాయనే చర్చ జరుగుతున్నది. ఇటీవల జితేందర్ రెడ్డి తన కొడుకు భవిష్యత్తు కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధమేననే స్టేట్ మెంట్ ఇచ్చారు. అసెంబ్లీ స్థానాన్ని మిథున్ రెడ్డికి కేటాయించిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో జితేందర్ రెడ్డికి కేటాయిస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.పార్టీలో కొద్ది నెలలుగా నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. ప్రధానంగా బండి సంజయ్, ఈటల మధ్య పోరు తారాస్థాయికి చేరినట్లు చర్చ జరుగుతున్నది. తమ అనుచరులకే టికెట్ ఇవ్వాలంటూ బండి, ఈటల పట్టుబట్టారు. వేములవాడ, హుస్నాబాద్ స్థానంపైనా ఈ ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. ఇది గమనించిన పార్టీ సమన్యాయం చేసింది. వేములవాడ స్థానాన్ని ఈటల రాజేందర్ అనుచరురాలు తుల ఉమకు కేటాయించింది.ఈ సెగ్మెంట్ వికాస్ రావుకు కేటాయించాలని, లేకుంటే తనకు పోటీ చేసే అవకాశమివ్వాలని బండి సంజయ్ పార్టీపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కానీ తీరా టికెట్ తుల ఉమకు దక్కింది. అలాగే హుస్నాబాద్ విషయంలోనూ ఈటల రాజేందర్ తన అనుచరుడు సురేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరగా, పార్టీ మొండిచేయి చూపించింది. ఆ స్థానాన్ని బండి సంజయ్ అనుచరుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి కేటాయించింది. దీంతో ఎవరినీ నొప్పించకుండా ఈటల, బండి పెట్టిన ప్రతిపాదనలను పార్టీ సున్నితంగా హ్యాండిల్ చేసింది. ఇరువురికి సమన్యాయం చేసిందనే చర్చ పార్టీలో జరుగుతున్నది.

Related Posts