YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఇలా... మరి తెలంగాణలో..

 ఏపీలో ఇలా... మరి తెలంగాణలో..

విజయవాడ, నవంబర్ 10,
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కమలం పార్టీ ఇరికించిందనే చెప్పాలి. తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు అధికారికంగా ఖరారయింది. సీట్ల పంపకం కూడా దాదాపు పూర్తయింది. నేడో, రేపో ఉమ్మడి జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ పోటీ చేయడానికి ప్రత్యేక కారణమంటూ లేదు. తెలంగాణ పార్టీ నేతలతోనే ఆయన తలొగ్గాల్సి వచ్చింది. మనసులో పోటీకి సుముఖత లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేస్తున్నారన్నది వాస్తవం. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగా ఉన్నాయి. బీజేపీ పెద్ద ఫామ్ లో లేదు. అయినా జనసేనానిని పొత్తులోకి లాగడంలో కమలనాధులు సక్సెస్ అయ్యారు.అయితే తెలంగాణ ఎఫెక్ట్ ఏపీలో ఎలా ఉంటుందన్న దానిపై చర్చ జరుగుతుంది. తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోనూ జరగబోయే ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు తెలంగాణ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. అందుకు కారణాలు తమ పార్టీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడానికేనన్న అనుమానం కమలనాధుల్లో బయలుదేరింది. అందుకే టీడీపీ తాను పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించగానే పవన్ తో వేగంగా చర్చలు ప్రారంభించి ఖరారు చేసుకున్నారు. ఎనిమిది సీట్ల విషయంలో క్లారిటీ వచ్చింది. మరికొన్ని సీట్లను జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయి. ఏపీలో కూడా... అదే సమయంలో ఏపీలో టీడీపీతో జనసేన పొత్తు అధికారికంగా పెట్టుకుంది. బీజేపీ మాత్రం ఈ కూటమిలో చేరతామని ఇంతవరకూ స్పష్టం చేయలేదు. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏపీలోనూ ఖచ్చితంగా కమలం పార్టీ కలసి వస్తుందన్న ధీమాతో పవన్ ఈ పొత్తును కుదుర్చుకున్నారన్నది వాస్తవం. కానీ బీజేపీ ఆలోచన మరోలా ఉంది. తెలంగాణలో పొత్తు కుదుర్చుకుని, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన ఏపీ ఎన్నికల్లోనూ తాము చెప్పినట్లుగానే వ్యవహరిస్తుందన్న నమ్మకంతో కేంద్ర నాయకత్వం ఉందంటున్నారు. అందుకే తెలంగాణ సీట్ల సర్దుబాటు విషయంలో కేంద్ర నాయకత్వం పెద్దగా జోక్యం కూడా చేసుకోలేదు. కమలం ఆలోచన... తెలంగాణలో తమను దెబ్బకొట్టడానికి టీడీపీ చేసిన ప్రయత్నం.. త్యాగం పై కమలనాధులు గుర్రుమంటున్నారు. అందుకే జనసేనకు ఏరికోరి ఖమ్మం సీటు ఇచ్చారంటున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు ఓట్లు పడకుండా చీల్చేందుకే జనసేనకు ఆ టిక్కెట్ ను కేటాయించారన్న వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఏపీలోనూ టీడీపీతో ఉన్న కూటమిలో కలిసేందుకు కమలం పార్టీ కలసి వచ్చే అవకాశాలు లేవు. అప్పుడు జనసేన ఏం చేస్తున్నది తెలియాలి. అక్కడ అధికారికంగా పొత్తు ప్రకటించిన జనసేనాని బీజేపీ అంగీకరించకపోతే ఆ పార్టీని వదిలేసి వస్తారా? లేదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాణ్ కు తెలంగాణ కన్నా ఏపీ ముఖ్యం కావడంతో ఆయన తీసుకునే స్టెప్ పై ఇప్పుడు ఏం జరగబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది.

Related Posts