న్యూ డిల్లీ
ఖలిస్థాన్ తీవ్రవాది సిఖ్ ఫర్ జస్టిస్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ, పంజాబ్ ఎయిర్‌పోర్టుల్లో సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు విధించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, పంజాబ్‌లోని అన్ని ఎయిర్ పోర్టుల్లో సందర్శకులకు ఎంట్రీ పాస్‌లు జారీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. నవంబర్ 30వ తేదీ వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ స్పష్టం చేసినట్లు సదరు వర్గాలు తెలిపాయి. అయితే, ఈ ఎంట్రీ పాస్‌లకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నాయి.ఈ నెల 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని ఖలిస్థాన్ తీవ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని మేము సిక్కులను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ దిగ్బంధం ఉంటుం ది. మీ ప్రాణాలకు ప్రమాదం’ అని గుర్‌పత్వంత్ ఒక వీడియోలో హెచ్చరించారు. అదేవిధంగా నవంబర్ 19న ఢిల్లీ విమానాశ్రయాన్ని మూసేయనున్నట్టు.. దాని పేరును మార్చనున్నట్టు గుర్‌పత్వంత్ చెప్పారు. అదే రోజు క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుండటాన్ని గుర్తుచేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం నుంచి మోదీ పాఠాలు నేర్చుకోకపోతే అలాంటి ప్రతిస్పందనే భారత్‌లో ఎదుర్కోవాల్సి ఉంటుందని గత నెల 10న గుర్‌పత్వంత్ ప్రధాని మోదీకి హెచ్చరికలు చేశారు.