YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్

ఈ విదేశీయుడే లేకుంటే మహాపండితులు రచించిన మహా కావ్యాలు తాటాకు కట్టల్లో చెదలు పట్టేసి మట్టికొట్టుకుపోయి ఉండేవి..వాటిని తొలిసారి పుస్తకరూపంలో తీసుకొచ్చిన ఘనత ఈయనదే...

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్
(నవంబర్ 10, 1798 - డిసెంబర్ 12, 1884) తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు. వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు.
సి. పి. బ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు. ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో సీపీ బ్రౌన్ గ్రీక్, లాటిన్, పారశీ, సంస్కృత భాషల్లో ఆరితేరాడు, బ్రౌను అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. తరువాత 1817 ఆగష్టు 4 న మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించాడు. వేమన, సుమతి శతకాలతోపాటుగా పల్నాటి యుద్ధం లాంటి చారిత్రిక కావ్యాలను నన్నయ్య, తిక్కన, గౌరన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, రామరాజ భూషణుల కృతుల పరిష్కరణ - ప్రచురణల ముద్రింపచేసాడు.
1820 ఆగస్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడం లోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవాడు.
కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. 1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి 1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు. బ్రౌను మానవతావాది. 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పందొమ్మిదో శతాబ్ది తొలిపాదం చివర్లో తాను తెలుగు సాహిత్యంలో కృషి మొదలుపెట్టేనాటికి నెలకొని వుండిన స్థితిగతులను గురించి బ్రౌన్ స్ఫుటమయిన మాటల్లో అభివర్ణించాడు. ‘అప్పటికి తెలుగు సాహిత్యం కొనప్రాణంతో కొట్టుకులాడుతోంది. 1825 నాటికి ప్రమిదలో దీపం కొడిగట్టిపోతోంది. తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండడం నా కళ్లబడింది. నేను 30 ఏళ్లు కృషి చేసి, దాన్ని పునఃప్రతిష్ట చేశాన’న్నాడు బ్రౌన్. నిరలంకారంగా మాట్లాడ్డం బ్రౌన్ శైలి. ఈ మాటల్లో కూడా అందుకే అతిశయోక్తులు కనిపించవు. 1827 నాటికే, బ్రౌన్ ‘ఆంధ్ర గీర్వాణ ఛందము’ అనే పుస్తకం రాసినప్పటికీ, ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన పుస్తకం 1829 నాటి ‘వేమన శతకం’. అప్పటికి బ్రౌన్ అయిదేళ్లుగా వేమన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు ఏడొందల పద్యాలకి ఆంగ్లానువాదాలతోపాటు విస్తృతమయిన పదకోశం కూడా సమకూర్చారు. మరో పదేళ్ల తర్వాత, 1164 పద్యాల మేరకి విస్తరింపచేసి, తిరిగి ‘వేమన శతకం’ అచ్చువేశారు. పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12 న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్ లో అవివాహితునిగానే మరణించాడు.
తెలుగు భాషకు చేసిన సేవ
******************
   *వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించాడు. 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించాడు.
   *1841లో "నలచరిత్ర"ను ప్రచురించాడు.
   *"ఆంధ్రమహాభారతము", "శ్రీమద్భాగవతము" లను ప్రచురించాడు.
  *తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసాడు. 1840లో వ్యాకరణాన్ని ప్రచురించాడు.
   *లండన్‌లోని "ఇండియాహౌస్ లైబ్రరీ"లో పడి ఉన్న 2106 దక్షిణభారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించాడు.
   *"హరిశ్చంద్రుని కష్టాలు" గౌరన మంత్రిచే వ్యాఖ్యానం వ్రాయించి 1842లో ప్రచురించాడు.
   *1844లో "వసుచరిత్"', 1851లో "మనుచరిత్ర" ప్రచురించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు.
   *1852లో "పలనాటి వీరచరిత్ర" ప్రచురించాడు.
రచనలు
*****
    *ఆంధ్ర గీర్వాణ చందము కాలేజి ప్రెస్సు, మద్రాసు -1827.
    *లోకం చేత వ్రాయబడిన శుభ వర్తమానము, బైబిల్ కథల తెలుగు అనువాదం
    *రాజుల యుద్దములు, అనంతపురం ప్రాంత చరిత్ర.
    *తెలుగు-ఇంగ్లీషు (1852), ఇంగ్లీషు-తెలుగు (1854), మిశ్రభాషా నిఘంటువు, జిల్లా నిఘంటువు, లిటిల్ లెక్సికన్ (తెలుగు వాచకాలకు అనుబంధమైన నిఘంటువు)
    *తెలుగు వ్యాకరణము - 1840లో ప్రచురణ
    *వేమన పద్యాలకు ఆంగ్ల అనువాదం

Related Posts