YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కుఓటమి భయం పట్టుకుంది

 జగన్ కుఓటమి భయం పట్టుకుంది

విజయవాడ, నవంబర్ 11,
రాష్ట్రంలో ఫ్యాక్షన్ పాలన నడుస్తోందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భీమవరంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మునిరత్నం పై వైసీపీ నేత చెవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు హత్యాయత్నం చేయడం దారుణమని మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు ఓటమి భయంతోనే టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బాధితుడు మునిరత్నం పరిస్థితి విషమంగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఆయనకు పార్టీ అండగా ఉంటుంది. వైసీపీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.' అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.టీడీపీ నేత మునిరత్నంపై వైసీపీ నేతల దాడిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. 'మద్యం, గంజాయి మత్తులో చెవిరెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. చెవిరెడ్డి తన చెంచాలను అదుపులో పెట్టుకోవాలి. సీఎం జగన్ గాల్లో తిరుగుతూ శాంతి భద్రతలను గాలికొదిలేశారు. వైసీపీ నేతలు ఎన్ని దాడులు చేసినా టీడీపీ వెనుకడుగు వేయదు. ఈ విషయాన్ని వైసీపీ గూండాలు గుర్తుంచుకోవాలి.' అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వైసీపీ నేతలపై ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో భీమవరం టీడీపీ గ్రామ కమిటీ సభ్యుడిగా మునిరత్నం వ్యవహరిస్తున్నారు. కాగా, మూలపల్లెకు చెందిన ఈశ్వరి, ఆమె మామ అన్నారెడ్డిల మధ్య పొలం విషయంలో వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించారు. ఇది సివిల్ వివాదం కాబట్టి గ్రామపెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించుకుని సమస్య పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో పంచాయతీ నిర్వహించగా, ఈశ్వరి తరఫున మునిరత్నం, అన్నారెడ్డికి మద్దతుగా చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగి మునిరత్నంపై చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు బండరాళ్లతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడి అనంతరం వారు పరారయ్యారు. బాధితున్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో చంద్రగిరిలో ఉద్రిక్తత నెలకొంది. దాడిని ఖండించిన టీడీపీ నేతలు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts