YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆనవాయితీకే ఓటేస్తారా... తిరిగి అధికారం అప్పగిస్తారా..

ఆనవాయితీకే ఓటేస్తారా... తిరిగి అధికారం అప్పగిస్తారా..

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల మధ్య హోరాహోరీ పోరుకు వేదికగా మారాయి. 2008 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల తీరును గమనిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండు సందర్భాల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చుతూ వస్తున్న ఆనవాయితీకి చెక్ పెడుతూ ఈసారి కూడా గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. గత రెండు దశాబ్దాల్లో 2013లో మినహా మిగతా అన్ని ఎన్నికల్లోనూ హోరాహోరీ పోటీ నెలకొన్న పరిస్థితుల్లో ఈసారి గెలుపు ఎవరిదన్నది తేల్చేది స్వల్పతేడాతో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తున్న న్యూట్రల్ ఓటర్లే. అందుకే ఈ సారి తటస్థ ఓటర్లు ఏ రకమైన తీర్పు ఇవ్వనున్నారన్నది అన్ని రాజకీయ పక్షాల్లోనూ ఉత్కంఠను రేపుతోంది.రాజస్థాన్ అసెంబ్లీలోని మొత్తం 200 స్థానాలకు ఒకే విడతలో నవంబరు 25న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాంగ్రెస్, బీజేపీల మధ్యే అక్కడ ప్రధాన పోటీ నెలకొంటోంది.స్వతంత్రులు, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎమ్మెల్యేల మద్దతులోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. బీజేపీ మాత్రం 2013లో తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల యుద్ధంలో ఈ రెండు పార్టీల్లో అభ్యర్థుల గెలుపోటముల మధ్య వ్యత్యాసం వెయ్యి నుంచి 5 వేల ఓట్ల లోపే ఉండడం గమనార్హం. ఇక 2008 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేసులో ఉన్న నేత సీపీ జోషి కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయి సీఎం పీఠం దక్కించుకోలేకపోయారు. లేదంటే అశోక్ గెహ్లాట్ స్థానంలో బహుశా పార్టీ ఆయనకే అవకాశం కల్పించి ఉండేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇంత హోరాహోరీ పోరుకు కారణమవుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత తేడాతో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ఓటమి చవిచూసిందో చూద్దాం.ఐదేళ్ల క్రితం రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 200 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటి ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపు ఓటముల మధ్య తేడా చాలా తక్కువ. చివరి రౌండ్ వరకు ఉత్కంఠ రేపుతూ ఫలితాలను తారుమారు చేసింది. కేవలం 5 వేల ఓట్ల తేడాతో ఈ 39 స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందారు. వీటిలో 16 స్థానాల్లో గెలుపోటముల మధ్య వ్యత్యాసం 2 వేల ఓట్ల లోపే ఉండగా.. 9 సీట్లలో ఈ వ్యత్యాసం వెయ్యి కంటే తక్కువేనని గణాంకాలు చెబుతున్నాయి. ఈ 39 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 20 స్థానాల్లో స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో ఈ స్వల్ప తేడాతో 17 సీట్లు గెలుచుకుంది. వెయ్యి లోపు ఓట్ల తేడాతో ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఈ 9 సీట్లలో 5 సీట్లలో బీజేపీ ఓడిపోగా.. హోరాహోరీగా పోరు జరిగిన మూడు స్థానాల్లో బీజేపీ 2 సీట్లు (154 ఓట్లతో అసింద్ సీటు, 278 ఓట్లతో పిలిబంగా సీటు) గెలుచుకుంది. మూడో సీటు మార్వార్ జంక్షన్‌లో బీజేపీ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి ఖుష్వీర్ సింగ్ 251 ఓట్ల తేడాతో గెలుపొందారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సాధించిన ఓట్ల శాతం 39.30% కాగా, బీజేపీ 38.08% ఓట్లు సాధించింది. అంటే రెండు పార్టీల మధ్య తేడా 2 శాతం లోపే అని స్పష్టమవుతోంది.2013 ఎన్నికలను పరిశీలిస్తే, ఈ ఎన్నికల్లో 26 స్థానాల్లో గెలుపోటముల మధ్య తేడా కేవలం 5 వేల లోపు ఓట్లే. అందులో 5 సీట్లలో వెయ్యి లోపు ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారయ్యాయి. ఈ 26 స్థానాల్లో బీజేపీ 10 స్థానాల్లో ఓడిపోగా, 15 స్థానాల్లో విజయం సాధించింది. 2013 ఎన్నికల్లో మొత్తం 200 సీట్లకు గాను బీజేపీ 163 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 21 సీట్లకు పడిపోయింది. ఈ ఎన్నికల్లో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీల అద్భుతమైన ప్రదర్శన కారణంగా కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. కాంగ్రెస్ 21 స్థానాలకే పరిమితం కాగా.. 148 స్థానాల్లో రెండో స్థానంలో ఉండగా, 23 స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది. 17 స్థానాల్లో కాంగ్రెస్‌‌కు సెక్యూరిటీ డిపాజిట్‌ కూడా దక్కలేదు.2008 అసెంబ్లీ ఎన్నికల్లో 2018 కంటే గట్టి పోటీ నెలకొంది. మొత్తం 200 సీట్లలో 66 సీట్లలో 5 వేల లోపు ఓట్ల మెజారిటీతో అభ్యర్థులు గెలుపొందారు. ఈ 66 స్థానాల్లో కాంగ్రెస్ 24 సీట్లు గెలుచుకుని అధికారానికి అతి చేరువైంది. ఆ తర్వాత స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు మొత్తం 96 సీట్లు రాగా, భారతీయ జనతా పార్టీకి 78 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి రేసులో ఉన్న సీపీ జోషి కేవలం 1 ఓటు తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ చౌహాన్ 62,216 ఓట్లు సాధించి సీపీ జోషిపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. పార్టీని విజయతీరాలకు చేర్చినప్పటికీ తన సీటు గెలవకపోవడంతో ముఖ్యమంత్రి పదవి ఆయనకు దక్కకుండా పోయింది.ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ గత తప్పిదాలను, పొరపాట్లను సరిదిద్దుకుంటూ ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తోంది.

Related Posts