YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎప్పటికి పూర్తయ్యేనో..!

ఎప్పటికి పూర్తయ్యేనో..!

విజయవాడలో నిర్మిస్తున్న ప్రభుత్వ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ఎప్పటికి అందుబాటులోనికి వస్తుందనేది అయోమయంగా మారింది. గత మూడు నెలలుగా పనులు మరింత మందగించాయి. 2016 జూన్‌ 2న రాష్ట్ర నవ నిర్మాణ దీక్ష రోజున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా శంకుస్థాపన జరిగిన సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం 2017 జూన్‌ 2 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. పనులు అనుకున్నంత వేగంగా సాగకపోవడంతో 2018 ప్రారంభానికి పూర్తవుతాయని చెప్పారు. 2018 జూన్‌ 2న జరిగే నవ నిర్మాణ దీక్ష నాటికైనా పూర్తయ్యే అవకాశం కన్పించడం లేదు. ఇప్పటికే విజయవాడ ప్రభుత్వాసుపత్రిపై ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోయింది. పేద రోగులకు నాణ్యమైన సేవలు అందించలేని పరిస్థితి నెలకొంటోంది. విజయవాడ సూపర్‌స్పెషాలిటీని అత్యవసరంగా అందుబాటులోనికి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు, రాష్ట్రం రూ.20 కోట్లు కలిపి రూ.150 కోట్ల వ్యయంతో దీనిని అత్యాధునిక సేవలు అందించేందుకు నిర్మాణం చేపడుతున్నారు. ఐదు అంతస్తుల్లో 296 మంచాల సామర్థ్యం, పది ఆపరేషన్‌ థియేటర్లతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నిత్యం రెండు వేల మందికి పైగా రోగులు ఆసుపత్రికి వస్తున్నారు. ఓపీ రోజున ఆసుపత్రి ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. అడుగుతీసి అడుగు వెయ్యడానికీ అవకాశం ఉండడం లేదు. ఆసుపత్రిలో అత్యవసర సేవలు అందించే విభాగానిదీ తరచూ ఇదే పరిస్థితి. వచ్చే కేసుల్లో తీవ్రమైన వాటిని ఇక్కడ సూపర్‌స్పెషాలిటీ సేవలు లేవంటూ.. గుంటూరు సర్వజనాసుపత్రికే చాలావరకూ తరలిస్తున్నారు. దీంతో అక్కడా విపరీతమైన తాకిడి పెరిగిపోయింది. వాళ్లు సైతం తిప్పి పంపే పరిస్థితి నెలకొంటోంది. అటూఇటూ తిరుగుతూ పేద రోగులు సరైన సేవలు అందక విలవిలలాడే పరిస్థితి నెలకొంటోంది.

కామినేని శ్రీనివాసరావు మంత్రిగా ఉన్న సమయంలో తరచూ వచ్చి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తుండేవారు. ఏపనిపై ఇటు వచ్చినా కచ్చితంగా సందర్శించేవాళ్లు. పనుల పురోగతిపై సమీక్షిస్తూ ఉండేవారు. ప్రస్తుతం పనులను పర్యవేక్షించే పరిస్థితి కూడా లేక.. గత కొద్ది నెలలుగా పూర్తిగా మందగించాయి. ప్రస్తుతం భవన నిర్మాణం ఐదంతస్థులు పూర్తయింది. భవనం లోపలి పనులు సాగుతున్నాయి. సీలింగ్‌, ఏసీలు వంటివి బిగిస్తున్నారు. ఇవి పూర్తవ్వడానికే కనీసం రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. కిటికీలు, తలుపులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. బయటవైపు ఇంకా ఫినిషింగ్‌, అద్దాలు బిగించడం వంటివి చేపట్టాల్సి ఉంది. భవనం లోపల ఇప్పటికే చేపట్టిన కొన్ని గదులు, నిర్మాణాలను.. తొలగించి మళ్లీ కడుతున్నారు. కొందరు వైద్య సిబ్బంది సూచనల మేరకు.. తమకు గదులు విశాలంగా ఉండాలని, బాత్రూంలు వంటివి అదనంగా కావాలని కోరడంతో.. వాటిని మళ్లీ కడుతున్నారు. ఇవన్నీ పూర్తయ్యాక.. ఆసుపత్రికి సంబంధించిన పరికరాలు, ఇంటీరియర్‌ వంటివి మరో నాలుగైదు నెలలు పట్టే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికిప్పుడు అత్యవసరంగా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టినా.. కనీసం ఆరేడు నెలలు  పడుతుందని.. సిబ్బందే పేర్కొంటున్నారు. అంటే.. 2018 చివరి నాటికైనా సూపర్‌స్పెషాలిటీ సేవలు అందుబాటులోనికి వస్తాయనేది అనుమానమే.

సూపర్‌స్పెషాలిటీతో ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో ఉన్న విభాగాలతో పాటూ అత్యాధునిక వైద్య సేవలు పేద రోగులకు అందుబాటులోనికి రానున్నాయి. పిడియాట్రిక్‌ సర్జరీ, ఎమర్జన్సీ మెడిసిన్‌, కార్డియాలజీ, కార్డియో థొరాసిస్‌ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ సహా అన్ని రకాల వైద్య సదుపాయాలూ అందుబాటులో ఉంటాయి. గత రెండేళ్లలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిపై విపరీతమైన తాకిడి పెరిగిపోయింది. గతంలో హైదరాబాద్‌ వెళ్లేవాళ్లంతా ప్రస్తుతం విజయవాడకు వచ్చే పరిస్థితి ఉంది. సూపర్‌స్పెషాలిటీ వస్తే.. హైదరాబాద్‌ నిమ్స్‌ తరహాలో ఇక్కడా సేవలు అందించేందుకు వీలుంటుంది. ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సైతం సిద్ధంగా ఉన్నాయి. భవన నిర్మాణం పూర్తయితే.. వెంటనే మంజూరు చేస్తారు. ఇప్పటికైనా దీనిపై సరైన పర్యవేక్షణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

Related Posts