YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ధర్మానకు తీవ్రమవుతున్న ఇంటిపోరు

ధర్మానకు తీవ్రమవుతున్న ఇంటిపోరు

శ్రీకాకుళం, నవంబర్ 16,
2024 ఎన్నికల ఫలితం ఏమిటన్నది వైసీపీ నేతలకు ఎప్పుడో  క్లియర్ కట్ గా అర్ధమైపోయింది. ప్రజలలో స్పందన కావచ్చు.. ఇప్పటికే వచ్చిన సర్వేల ఫలితాలు కావచ్చు.. ఇక తాము కుర్చీ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైందని ఫిక్సయిపోయారు. ఎలాగూ పోతున్నాం కదా చివరిగా బెదిరించి ఓట్లు వేయించుకోవాలని అనుకుంటున్నారో ఏమో కానీ ప్రజలను బహిరంగంగానే బెదిరిస్తున్నారు. కుదిరితే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ లేకపోతే  నేరుగా బెదిరింపులకు దిగుతున్నారు. ఈసారి జగన్ మోహన్ రెడ్డికి ఓట్లేయకపోతే దేవుడు మిమ్మల్ని క్షమించడంటూ శాపనార్ధాలు కూడా పెడుతున్నారు. సాక్షాత్తు మంత్రులే ఈ తరహా వ్యాఖ్యలకు దిగుతున్నారంటే వైసీపీ నేతలలో ఓటమి భయం ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఉత్తరాంధ్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు గురించి రాజకీయాలపై అవగాహన ఉన్న అందరికీ తెలిసిందే. గతంలో అమరావతి రైతుల మీద కూడా నోరు పారేసుకున్న ఈ మంత్రి గారి బూతు పురాణం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బట్టబయలౌతోంది.  మంత్రి ధర్మాన ఇప్పుడు ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తూ వైసీపీ ఓట్లేయాలని కోరుతున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో బస్సు యాత్రలో పాల్గొన్న ధర్మాన ఓ గ్రామానికి వెళ్లారు. మంత్రి వచ్చారన్న కనీస స్పందన కూడా ప్రజలలో లేకపోవడంతో ధర్మాన ప్రజలను ఉద్దేశించి మిమ్మల్ని ఓట్లు అడగను.. నా పని తీరు నచ్చితే ఓట్లు వేయండి అంటూ వ్యాఖ్యానించారు. మీ వరకు మీకు మంత్రిగా ఉంటా.. ఏ పనైనా చేయిస్తా. కాకపోతే మళ్ళీ నేను మళ్ళీ రావాలన్నా.. మంత్రి కావాలన్నా ఓటు వేయండి. అలాకాకుండా టీడీపీకి ఓటు వేస్తే మాత్రం మీ ఇంటి వద్దకు వాలంటీర్ రాడు.. పింఛన్ ఉండదు. చంద్రబాబు వస్తే పథకాలన్నీ ఆపేస్తారు అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు అధికార పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా అభివృద్ధి అనేది మచ్చుకైనా కనిపించకపోవడంతో  అర్బన్ ఓటర్లు బహిరంగంగానే ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. దీంతో ధర్మాన ఇలా హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలకు దిగుతున్నారు.  అదే సమయంలో వాలంటీర్లను ఉద్దేశించి మీరు వైసీపీ కార్యకర్తలేనని..  వైసీపీని మరోమారు అధికారంలోకి తీసుకుని రావాల్సిన బాధ్యత మీదేనని పరోక్షంగా  ఏమిటి ప్రత్యక్షంగానే బెదిరిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారు.  వైసీపీ ప్రతిష్టను ధర్మాన బ్లాక్ మెయిల్ వ్యాఖ్యలతో  మరింత  దిగజార్చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇదే ధర్మాన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలూ చేస్తున్నారు. పార్వతీపురంలో జరిగిన బస్సు యాత్రలో పాల్గొన్న ధర్మాన మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెరిగాయన్నది వాస్తవమని అంగీకరించేశారు. విద్యుత్ వినియోగం రాష్ట్రంలో బాగా పెరగడంతో ప్రభుత్వం అనివార్య పరిస్థితుల్లో ప్రైవేట్ సంస్థల నుంచి కొనడంతో అదనపు భారం పడుతున్నదని,  అలాగే మూడు రాజధానుల అంశాన్ని కూడా గుర్తు చేసిన ధర్మాన.. జగన్ సర్కార్ విశాఖ పరిపాలనా రాజధానిగా, కర్నూల్ న్యాయ రాజధానిగా చేస్తుందని, అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని ప్రభుత్వం ప్రతిపాదించిందని.. అయితే పేరుకు మూడు రాజధానులని అంటున్నా అసలైన రాజధాని మాత్రం విశాఖ మాత్రమేనని  సెలవిచ్చారు. ఇప్పుడు ఈ రెండు వ్యాఖ్యలూ  ప్రతిపక్షాలకు ఆయుధంగా మారాయి.రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల పెంపుపై ప్రతిపక్షాలు ఎప్పటి నుండో తీవ్రంగా విమర్శలకు దిగుతున్నాయి. విద్యుత్ బిల్లుల మోతతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. అయితే విద్యుత్ చార్జీల పెంపు  వాస్తవమేనని..  ప్రజలు భరించితీరాల్సిదేననీ చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు.  గతంలో వైసీపీ నేతలు బాదుడే బాదుడు అంటూ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయగా ఇప్పుడు వైసీపీ అంతకు మించి బాదేస్తున్న విషయాన్ని స్వయంగా మంత్రి ధర్మానే  ఒప్పేసుకున్నారు. అసలే మూడు రాజధానుల అంశం మాటలకే తప్ప ఆచరణలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల లోపు అది న్యాయస్థానాలలో తేలేలా కనిపించడం లేదు. కానీ, ధర్మాన మాత్రం అసలు రాజధాని నకిలీ రాజధానులు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజలలో కంపరం పుట్టిస్తుంటే..  ప్రతిపక్షాలకు లడ్డు చేతికి ఇచ్చినట్లుగా మారింది. కర్నూల్ రాజధాని ఊసే ప్రభుత్వం వద్ద లేకపోగా ధర్మాన దాన్ని కెలికి మరీ  సీమలో పార్టీకి దాదాపు పాతర వేసేశారని వైసీపీ వర్గాలే అంటున్నాయి.  ఒకవైపు ప్రజలకు బెదిరింపులు, మరొక వైపు ఇలా ప్రభుత్వానికి తిప్పలు తెచ్చే వ్యాఖ్యలతో ధర్మాన బస్సు యాత్రను వైసీపీని ఓటమికి  మరింత దగ్గర చేసేలా మార్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Related Posts