సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు ఎన్టీఆర్ అని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం విజయవాడ జలవనరుల శాఖ విడిది కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం దత్తత గ్రామమైన గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వృధ్దులకు పండ్లు పంపిణీ చేసారు. అనంతరం మంత్రి ఉమా మాట్లాడుతూ, ఎన్టీఆర్ చరిత్ర సృష్టించిన యుగపురుషుడని, ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సినిమాల ద్వారా విభిన్న పాత్రలకు ఎన్టీఆర్ ప్రాణం పోశారని మంత్రి పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీకన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో సంచలనం సృష్టించారని తెలిపారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించిన ఘనత ఎన్టీఆర్దే అని కొనియాడారు. సంక్షేమపథకాలు, పాలనా సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. మహిళా అభ్యున్నతికి ఎన్టీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని, రాయలసీమలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించారని మంత్రి ఉమా పేర్కొన్నారు. తదుపరి సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలసి పటమటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. అనంతరం మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, ఇతర నేతలు ఎన్టీఆర్కు నివాళులర్పించారు.