YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉల్లి రైతు కంట కన్నీరే...

ఉల్లి రైతు కంట కన్నీరే...

కర్నూలు, నవంబర్ 17,
అత్యధికంగా ఉల్లిని పండించే కర్నూలు జిల్లా రైతులు మార్కెట్‌ మాయాజాలంలో విలవిలలాడుతున్నారు. దళారులు రైతుల నుంచి కిలో ఉల్లిని తక్కువ ధరకు కొనుగోలు చేసి రిటైల్‌ మార్కెట్లో అధిక ధరకు అమ్ముతున్నారు. వ్యాపారులు ఇటు రైతులను, అటు వినియోగదారులను దోచుకుంటున్నారు. ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో ఉల్లి సాధారణ సాగు 38,707 ఎకరాలు కాగా, గతేడాది 59,160 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది 42,162 ఎకరాలకే సాగు పరిమితమైంది. సాగు తగ్గినా రైతులకు గిట్టుబాటు లభించడం లేదు. సాధారణంగా ఆగస్టు నుంచి ఉల్లి పంట మార్కెట్‌కు వస్తుంది. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా పడకపోవడంతో సాగు ఆలస్యమైంది. సెప్టెంబర్‌ నుంచి పంట మార్కెట్‌కు వస్తోంది.పంట ఆలస్యంగా రావడం, మార్కెట్‌కు వచ్చే పంట తగ్గడంతో కర్నూలు ఉల్లి మార్కెట్‌లో ధర కొంచెం మెరుగ్గానే పలుకుతోంది. రైతు దగ్గర వ్యాపారులు కిలో రూ.30లోపు కొంటున్నారు. రిటైల్‌ మార్కెట్‌లో రూ.70కు విక్రయిస్తున్నారు. ఉల్లి సీజనైన అక్టోబర్‌, నవంబర్‌లో గతంలో మార్కెట్‌కు రోజుకు దాదాపు ఆరు వేల క్వింటాళ్లు వచ్చేది. ప్రస్తుతం 2 వేల నుంచి 3 వేల క్వింటాళ్ల మధ్యే వస్తోంది. ప్రస్తుతం కనిష్టంగా రూ.1,201, గరిష్టంగా రూ.4,010, మధ్యస్థంగా రూ.3,231 ధర పలుకుతోంది. ఎక్కువమందికి క్వింటాలుకు రూ.3 వేలు చొప్పున ధర లభిస్తోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో 220 మంది లైసెన్స్‌డ్‌ వ్యాపారులు ఉన్నారు. వారిలో 30 మంది ఉల్లి క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. వ్యాపారులు సిండికేటై తమకు ఎక్కువ ధర రానీయకుండా అడ్డుకుంటున్నారని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావం వల్ల ఈ ఏడాది మహారాష్ట్రలోనూ ఉల్లి దిగుబడులు తగ్గాయి. సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌ల్లో మొత్తం 2,22,815 క్వింటాళ్ల ఉల్లి కర్నూలు మార్కెట్‌కు రాగా, ఈ ఏడాది నవంబర్‌ 14 నాటికి 1,23,444 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఉల్లి ఉత్పత్తులు అంతోఇంతో మార్కెట్‌కు వస్తున్న ఈ సీజన్‌లో రూ.70కుపైగా ధర పలుకుతుంటే, అన్‌ సీజన్‌ అయిన జనవరి తర్వాత కిలో రూ.100కుపైగా చేరుకొనే ప్రమాదం ఉందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, తమకు అందుబాటు ధరకు ఉల్లిని అందించాలని వినియోగదారులు కోరుతున్నారు.ఈ ఏడాది ఆరు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. ఎకరాకు రూ.80 వేల చొప్పున మొత్తం రూ.4.80 లక్షలు ఖర్చయింది. 180 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాలుకు రూ.2,500 చొప్పున మాత్రమే ధర పలికింది. మొత్తం రూ.4.50 లక్షలే వచ్చింది. ఏటా రైతులు నష్టపోతున్నారు. వ్యాపారులు మాత్రమే లాభపడుతున్నారు.ఉల్లి ధర రోజురోజుకూ పెరుగుతూ కన్నీళ్లు తెప్పిస్తోంది. పది రోజుల క్రితం కిలో రూ.50 ఉంటే, ఇప్పుడు రూ.70 అయింది. వీటితోపాటు మిగతా కూరగాయల ధరలూ పెరిగిపోయాయి. ధరలు అదుపులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

Related Posts