YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీడీపీ ఓటు... ఎవరికి...

టీడీపీ ఓటు... ఎవరికి...

హైదరాబాద్, నవంబర్ 17,
తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. పోటీ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ చంద్రబాబునాయుడు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నిజానికి తెలంగాణలో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. బలమైన బీసీ వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ను అధ్యక్షుడ్ని  చేశారు. ఖమ్మం, సికింద్రాబాద్ లో భారీ బహిరంగసభలు నిర్వహించారు. ఇక పోటీనే మిగిలింది అనుకుంటున్న సమయంలో చంద్రబాబును స్కిల్ ప్రాజెక్ట్ కేసులో నిందితుడు అంటూ అరెస్టు చేయడం ఆయన బయటకు రావడానికి దాదాపుగా రెండు నెలల సమయం పట్టడంతో మొత్తం సీన్ మారిపోయింది. పోటీ నుంచి విరమించుకునే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఖచ్చితంగా రాజకీయ కుట్రే అని అందరూ నమ్ముతున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలూ అదే చెప్పారు. అయితేఈ సెంటిమెంట్ ఒక్క ఏపీలో కాకుండా.. తెలంగాణలోనూ పెరిగింది. ఏపీతో పాటు తెలంగాణలోనూ చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఇది ఎంతగా అంటే.. ఎన్నికల సమయంలో టీడీపీ సానుభూతిపరులందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చినట్లయింది. ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్ వంటి చోట్ల కూడా చంద్రబాబుకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అదే సమయంలో అన్ని పార్టీల నేతలు ఖండించారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యల వివాదమయ్యాయి. పోలీసుల కట్టడి కూడా టీడీపీ సానుభూతిపరుల్లో బీఆర్ఎస్ పై వ్యతిరేకతకు కారణం అయిందన్న ప్రచారం జరుగింది. దీన్ని తగ్గించేందుకు కేటీఆర్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ పోటీలో లేకపోయినా ఆ పార్టీని ఎవరూ తక్కువగా తీసుకోవడం లేదు. ఆ పార్టీ సానుభూతిపరుల మద్దతు కోసం దాదాపుగా అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో బీఆర్ఎస్ ఉంది..  బీజేపీ-జనసేన కూటమి ఉంది.. కాంగ్రెస్ కూడా ఉంది. ఎవరికి వారు టీడీపీకి..చంద్రబాబుకు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. వారు అంటే తమకు ఎంతో గౌరవం ఉందని చెబుతున్నారు. వీరి ప్రయత్నాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. టీడీపీకి ఇంత బలం ఉందా అని ఎక్కువ మంది ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణలో టీడీపీ సానుభూతిపరులు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్ల ప్రాధాన్యతను కేటీఆర్ గుర్తించారు. గతంలో ఆయన చేసిన దురుసు వ్యాఖ్యలు, ఇతర పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు మీడియాకు వరుసగా ఇంటర్యూలు ఇస్తున్నారు.   కేటీఆర్ ఏపీకి సంబంధించిన అంశాలపైన వివరణ ఇచ్చేందుకు టీడీపీ సానుభూతిపరుల్లో తమపై ఉన్న ఆగ్రహాన్ని తగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్టు చేసినప్పుడే.. ఏపీ కి చెందిన ఓ పెద్ద మనిషి ఓటుకు నోటు తీయమని అడిగారని.. తాము తీయలేదన్నారు.  అలాగే రామోజీరావు అరెస్టును కూడా అడ్డుకున్నామన్నట్లుగా కేటీఆర్ చెప్పారు.  అమరరాజా ఫ్యాక్టరీని  తాము లాక్కోలేదని .. వారే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటూంటే... తెలంగాణకే రావొచ్చని ఆహ్వానించానన్నారు. ఇలా.. తమ పార్టీపై ఏపీకి సంబంధిచిన ఓటర్లు...  టీడీపీ సానుభూతిపరుల్లో ఉన్న అన్ని సందేహాలను నివృతి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా  టీడీపీ సానుభూతిపరుల్లో తమపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని రాజకీయవర్గాలంటున్నయి. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా నేరుగా ప్రయత్నిస్తోంది. ఆంధ్రా సరిహద్దు నియోజకవర్గం అయిన మథిర నుంచి పోటీ చేస్తున్న మల్లు భట్టి విక్రమార్క తన ప్రచారంలో టీడీపీ జెండాలను కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి టీడీపీ సానుభూతిపరుల్ని  కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు వ్యూహాత్మక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఎప్పుడూ టీడీపీని, చంద్రబాబును విమర్శించరు. ఇటీవల ఓ జాతీయ మీడియా చర్చా కార్యక్రమంలో అమరావతిని  పొగిడారు. ప్రస్తానలేకపోయినా చంద్రబాబు మంచి నాయకుడు అన్నారు. ఇదే మాట కేటీఆర్ కూడా అన్నారు. చంద్రబాబు అంటే అభివృద్ధి గుర్తుకు వస్తుందన్నారు. రేవంత్ పై టీడీపీ సానుభూతిపరుల్లో కాస్త సాఫ్ట్ కార్నర్ ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ గెలిస్తే ఏపీలో టీడీపీకి ఇబ్బంది అవుతుందన్న ప్రచారం అంతర్గతంగా సాగుతోంది. ఖమ్మం వంటి చోట్ల.. అభ్యర్థులు తాము గెలిస్తే చంద్రబాబు గెలిచినట్లేనని బహిరంగంగా చెబుతున్నారు. ఇవన్నీ కలగలపి ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తమకేనని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంటోంది. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థులు ... ఏపీలో టీడీపీతో పొత్తు ఉన్న కారణంగా..  తెలంగాణలోనూ ఆ పార్టీ జెండాలు ఉపయోగించుకుటున్నారు. కోదాడ అభ్యర్థి సతీష్ రెడ్డి తన వాహనానికి టీడీపీ జెండాలు పెట్టుకుని టీడీపీ పాటలు పెట్టుకుని ఊళ్లలో ప్రచారం చేస్తున్నారు. కూకట్ పల్లి అభ్యర్థి  కూడా అంతర్గతంగా టీడీపీ మద్దతుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ పార్టీ సానుభూతిపరుల్ని ఆకట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. ఎవరికీ అనుకూలంగా మాట్లాడటం లేదు. అసలు తెలంగాణ ఎన్నికల గురించి ప్రస్తావించడం లేదు. కానీ ఆ పార్టీ మద్దుత కోసం ఇతర పార్టీల నుంచి ఒత్తిడి వస్తూనే ఉంది. దీంతో చంద్రబాబు ఎన్నికలకు ముందు తమ పార్టీ సానుభూతిపరులకు ఏమైనా సందేశం ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. జనసేనకు మద్దతు ప్రకటించవచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.  

Related Posts