YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మ్యానిఫెస్టోలకు ఓట్లు రాలతాయా...

మ్యానిఫెస్టోలకు ఓట్లు రాలతాయా...

హైదరాబాద్, నవంబర్ 18,
మంత్రాలకు చింతకాయలు రాలతాయా అనేది వెటకారం సామెత.. రాజకీయాల్లో మేనిఫెస్టోలకు ఓట్లు రాలయాతా అన్నది కూడా అంతే. అయితే రాజకీయ పార్టీలు మాత్రం మేనిఫెస్టోలు ప్రజాకర్షక పథకాలతో నింపేస్తున్నాయి. తెలంగాణలో కూడా అంతే. హోరాహోరీగా సాగుతున్న పోరులో  రెండు, మూడు శాతం ఓట్లనైనా తమ వైపు తిప్పుకునేలా చేయడానికి రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనాకర్షక పథకాల వరాలను గుప్పిస్తున్న ప్రధాన పార్టీలు సుదీర్ఘంగా కసరత్తు చేసి పోటాపోటీ హామీలతో మ్యానిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి. అందరికంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ తొలుత ఆరు గ్యారంటీలను ప్రకటించింది.  వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అదే మేనిపెస్టో ్ని చాలా మంది అనుకున్నారు. కానీ సామాజికవర్గాల వారీగా ప్రకటించిన డిక్లరేషన్లతో కలిపి మేనిఫెస్టోను ప్రకటించబోతున్నారు. ఆయన రెండు నెలలుగా సుదీర్ఘ కసరత్తు చేసి, వివిధ వర్గాల ప్రజలతో భేటీయై వారి అవసరాలు, ప్రాధాన్యాతలను అనుసరించి మ్యానిఫెస్టోకు మెరుగులద్దారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. ఆరు గ్యారంటీలకు అదనంగా మ్యానిఫెస్టోలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరిన్ని జనాకర్షక హామీలను పొందుపరిచింది. వాటిలో ప్రధానంగా ఆడపిల్లల పెళ్లికి పసుపు కుంకుమ పథకం కింద లక్ష ఆర్ధిక సహాయంతో పాటు తులం బంగారం, రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ, అమ్మహస్తం పేరుతో 9నిత్యావసర సరుకుల పంపిణీ, రేషన్ డీలర్లకు గౌరవ వేతనం, అభయ హస్తం పథకం పునరుద్దరణ, ఎంబీసీలకు ప్రత్యేక కార్పోరేషన్‌, విద్యార్థులకు ఉచిత ఇంటర్ నెట్‌, ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు, ఉద్యోగాల కల్పన, ఆటో వాళ్లకు ఆర్ధిక సహాయం, ఆర్‌ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు కార్డు, గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం, ధరణి స్థానంలో భూ భారతి పేరుతో సరికొత్త యాప్‌, సిటిజన్ చార్ట్‌కు చట్టబద్ధత, మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టులకు ఫ్రీ మెట్రో ప్రయాణ వసతి కల్పన, రైతులకు 2లక్షల రుణమాఫీ వంటి సరికొత్త హామీలున్నాయి. అంటే  దాదాపుగా ప్రతి వర్గాన్ని ఆకట్టుకు్నేలా హామీల్ని రూపొందించారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలకు సంబంధించి బీజేపీ రూపొందించిన మ్యానిఫెస్టోను శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా విడుదల చేయనుంది.    బీజేపీ మ్యానిఫెస్టోలో బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ, పంటల బీమా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, పెళ్లయిన మహిళలకు ఏడాదికి 12,000, , 500కే సిలిండర్, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 20000, టీఎస్పీఎస్సీ ద్వారా రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ వంటి పథకాలతో పాటు మరికొన్నివివిధ వర్గాల ప్రజలకు సంబంధించి సరికొత్త సంక్షేమ పథకాలను బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రకటించనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ పార్టీ మారిపోయారు. దీంతో ఆ పని ఆగిపోయింది. ఎలాగోలా పూర్తి చేసి.. పదిహేడో తేదీన అమిత్ షా చేతుల మీదుగా విడుదల చేయాలని డిసైడయ్యారు. ఇందులో పేర్ల మార్పు హామీ కీలకమంటూ.. బీజేపీ నేతలు మీడియాకు లీకులిచ్చారు. అలా అని ప్రజాకర్షక హామీలకు లోటేమి ఉండదు. మధ్యప్రదేశ్ లో గ్యాస్ సిలిండర్ రూ. 450కే ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ కూడా అలాంటి హామీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.ఎందుకంటే.. ఐదు వందలకు ఇస్తామని కాంగ్రెస్.. నాలుగు వందలకే ఇస్తామని బీఆర్ఎస్ పోటీ పడి హామీలు ఇచ్చాయి. మరి బీజేపీ కూడా జోక్యం చేసుకోవాలి కదా.. మధ్యంగా నాలుగు వందల యాభైకి ఫిక్సయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు పార్టీల హామీల్ని కాచివడబోసి. ప్రజాకర్షక పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే బీజేపీ సంప్రదాయ బీజేపీ వాదుల్ని ఆకట్టుకోవడానికి  పేర్ల మార్పు హామీని ఇవ్వబోతోంది.  బీజేపీని గెలిపించి చూడండి.. మీ ఊరు పేరు తెల్లారేసరికి మారిపోకపోతే అప్పుడు అడగండి పద్దతిలోమేనిఫెస్టోలో హామీని చేర్చబోతున్నారు. హైదరాబాద్ దగ్గర నుంచి తెలంగాణలో ముస్లింల పేర్లు స్ఫురించే ప్రతి ఊరి పేరును మార్చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇవ్వబోతున్నారని చెబుతున్నారు.  ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడే కేసీఆర్ భరోసా పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు.  తెల్లరేషన్‌కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్‌ బీమా,  తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ,  అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం,  పెన్షన్లను ఏటా రూ.500 చొప్పున రూ.5 వేలకు పెంపు,   దివ్యాంగుల పెన్షన్లు ఏటా రూ.300 చొప్పున రూ.6 వేలకు పెంపు,   అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవ భృతి,  అర్హులైనవారికి రూ.400కే గ్యాస్‌ సిలిండర్లు,  ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంపు,  రైతుబంధు మొత్తం దశలవారీగా రూ.16 వేలకు పెంపు వంటి పథకాలు ఉన్నాయి. అయితే పదేళ్లుగా అధికిారంలో ఉన్న  పార్టీ  కావడం వల్ల హామీలకు విస్తృత ప్రచారం రావడంలేదు. పైగా.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్ని పోలి ఉండటంతో  సమస్యగా మరింది. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు కళ్లు చెదిరే విధంగా ఉంటాయి. కానీ గెలిచిన తరవాత ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఎందుకంటే అంత బడ్జెట్ ఉండదు. ల్కషల కోట్లు కావాలి. అందుకే అర్హులైన వారికి అనే ట్యాగ్ లైన్ పెడతారు. అడ్డగోలు నిబంధనలు పెట్టి అతి తక్కువ మందికి ఇస్తారు. అందుకే ప్రజలు కూడా ఇలాంటి పథకాలపై ఆశలు పెట్టుకోవడం లేదు. కానీ.. ఓటర్లలో ఉండే సహజమైన ఆశే రాజకీయ పార్టీలకు పెద్ద వరంగా మారింది.

Related Posts