YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాజిటివ్ టాక్ తో మంగళవారం

పాజిటివ్ టాక్ తో మంగళవారం

హైదరాబాద్, నవంబర్ 18,
ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి కలిగించిన సినిమా 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100' తర్వాత మరోసారి అజయ్ భూపతి ఆ స్థాయి విజయం అందుకుంటారని నమ్మకం కలిగించిన చిత్రమిది. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. మరి, సినిమా ఎలా ఉంది? ఏమిటి?మాహాలక్ష్మీపురంలో గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజు రెండేసి ప్రాణాలు పైలోకాలకు వెళతాయి. అదీ అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఆడ, మగ పేర్లు గోడపై రాయడం ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఊరంతా భావిస్తారు. ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మీనా (నందితా శ్వేత) మాత్రం ఎవరో హత్య చేశారని అనుమానిస్తోంది. జంట హత్యలు జరిగిన మొదటి సారి పోస్టుమార్టం చేయడానికి ఊరి జమీందారు ప్రకాశం బాబు (చైతన్య కృష్ణ) ఒప్పుకోడు. రెండో జంట విషయంలో ఓకే అంటాడు. నిజంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారా? లేదంటే ఎవరైనా హత్యలు చేశారా? ఈ వరుస మరణాలకు కొన్నాళ్ళ ముందు ఊరంతా వేలి వేసిన శైలు... శైలజ (పాయల్) కథ ఏమిటి?  ఊరిలో ఫోటోగ్రాఫర్ వాసు (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్), జమీందారు భార్య (దివ్యా పిళ్ళై) పాత్రలు ఏమిటి? శైలు చిన్ననాటి ప్రియుడు రవి ఎవరు? చివరకు ఏం తేలింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.  
మంగళవారం' జానర్ ఏంటి? థ్రిల్లర్, హారర్, మెసేజ్,రివేంజ్ డ్రామా... ఒక్క గాటిన సినిమాను కట్టలేం! ఒక్క జానర్‌కు పరిమితం చేయలేం! ఒక్క పాయింట్ నుంచి మొదలైన సినిమా రకరకాల జానర్స్ టచ్ చేస్తూ పతాక సన్నివేశాలకు చేరుకుంటుంది. సినిమా అంతా ఒక్క విషయాన్ని మాత్రం అజయ్ భూపతి మైంటైన్ చేశారు. సస్పెన్స్ కంటిన్యూ అయ్యింది.
'మంగళవారం' మిస్టీక్ థ్రిల్లర్. తెరపై నటీనటులు ఎందరు కనిపించినా సరే... తెర వెనుక హీరోలు మాత్రం ఇద్దరే! మొదటి హీరో సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాథ్! ప్రారంభం నుంచి ముగింపు వరకు కొత్త సౌండ్ వినిపించారు. ఒక్కోసారి సన్నివేశాలను ఆయన ఆర్‌ఆర్‌ డామినేట్‌ చేసింది. సినిమా విడుదలకు ముందు పాటలు హిట్ అయ్యాయి. పాటల కంటే ఎక్కువ నేపథ్య సంగీతం ఎక్కువ ఆకట్టుకుంటుంది. రెండో హీరో అజయ్ భూపతి... ప్రేక్షకుల ఊహకు అందని రీతిలో కథను ముందుకు నడిపించారు.
'మంగళవారం' కథ కంటే... పాయల్ క్యారెక్టర్ ద్వారా అజయ్ భూపతి డిస్కస్ చేసిన అంశం నిజంగా సమాజంలో మహిళలు ఎవరూ పైకి చెప్పలేనిది. ఆ ఎపిసోడ్ ఓ హాలీవుడ్ సినిమాను గుర్తు చేస్తుంది. అయితే, సినిమా అంతా అదొక్కటే ఉండదు. కానీ, ఆ పాయింట్ తీసుకుని నేటివ్ టచ్ ఇస్తూ అజయ్ భూపతి డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ తీశారు. ఇంటర్వెల్ ముందు వరకు కథ ముందుకు కదల్లేదు. కానీ, ఎంగేజ్ చేస్తుంది. ఊరి జనాల మధ్య ఫైట్ గందరగోళంగా ఉంటుంది. అవసరం లేదనిపించింది. కొందరికి ఏంటీ అక్రమ సంబంధాలు అనిపించే అవకాశం ఉంది. అయితే... ముగింపులో దర్శకుడు అందుకు సమాధానం ఇచ్చారు. ఇంటర్వెల్ తర్వాత కథలో స్పీడ్ తగ్గుతుంది. ఒక్కసారిగా సస్పెన్స్ పక్కకి వెళ్లి గ్లామర్ & ఎమోషన్ ఎక్కువ అవుతాయి. కానీ, పాయల్ పాత్రను చూస్తే కొందరికి అయినా జాలి కలుగుతుంది. ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ అవుతారు. ఆ సీన్లు ప్రేక్షకులు ఎలా చూస్తారనేది వాళ్ళ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. కామంతో చూస్తే ఒకలా... క్యారెక్టర్ పరంగా చూస్తే మరోలా ఉంటాయి. ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చే ఆర్టిస్ట్ విషయంలో అజయ్ భూపతి మరో ఛాయస్ ఆలోచిస్తే బావుండేదేమో!?సినిమాలో సమాజంలో పోకడలను పరోక్షంగా ఎత్తిచూపారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు తప్పులు చేసేవాళ్ళు ఇతరుల తప్పుల్ని ఎత్తి చూపుతూ తాము పతివ్రతలు అన్నట్లు బిల్డప్ ఇవ్వడాన్ని చక్కాగా చూపించారు. ఎటువంటి వల్గారిటీ లేకుండా అజయ్ భూపతి సినిమా తీశారు.టెక్నికల్ అంశాల పరంగా 'మంగళవారం' ఉన్నత స్థాయిలో ఉంది. మ్యూజిక్ టాప్ క్లాస్. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. నిర్మాణ పరంగా ఖర్చుకు వెనుకాడలేదని స్క్రీన్ మీద సన్నివేశాలు చూస్తే అర్థం అవుతోంది. రోలర్ కోస్టర్ రైడ్ తరహాలో జానర్స్ షిఫ్ట్ ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నటీనటులు ఎలా చేశారంటే: నటిగా పాయల్ ను ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసే చిత్రమిది. కేవలం గ్లామర్ గాళ్ అని కాకుండా నటిగా తన ప్రతిభ చూపించుకోవడానికే చక్కటి అవకాశం లభించింది. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఓ పాటలో పాయల్ గ్లామరస్‌గా కనిపించారు. ఆ తర్వాత నటిగా భావోద్వేగభరిత సన్నివేశాల్లో, బరస్ట్ అయ్యే సీన్లలో ఒదిగిపోయారు. పాయల్ స్క్రీన్ స్పేస్ తక్కువ. కానీ, ఇంపాక్ట్ చూపిస్తారు.
ఎస్సైగా నందితా శ్వేత ఓకే. క్యారెక్టర్‌కు అవసరమైన సీరియస్‌నెస్ చూపించారు. జమీందారు భార్యగా దివ్యా పిళ్ళై అందంగా కనిపించారు. చైతన్య కృష్ణ, శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి, రవీంద్ర విజయ్ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు చేశారు. పాయల్ తర్వాత ఆర్టిస్టులు అందరిలో అజయ్ ఘోష్, లక్ష్మణ్ కాంబోలో సీన్లు ఎక్కువ ఆకట్టుకుంటాయి. వాళ్ళిద్దరి మధ్య డైలాగులు నవ్విస్తాయి. ఇక... స్పాయిలర్స్ జోలికి వెళ్లకుండా పాయల్ చిన్ననాటి ప్రియుడు, మాస్క్ వెనుక మనిషి ఎవరనేది తెలుసుకోకుండా సినిమా చూడటం మంచిది.
చివరగా చెప్పేది ఏంటంటే... : 'మంగళవారం' ప్రారంభం నుంచి అజయ్ భూపతి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తూ వచ్చారు. ట్విస్టులతో ఎంగేజ్ చేస్తూ కథ, క్యారెక్టర్లను ముందుకు నడిపారు. ఎవరూ డిస్కస్ చేయని పాయింట్ తీసుకుని ఈ సినిమా చేసినందుకు ఆయనను అభినందించాలి. అజనీష్ మ్యూజిక్ మరోసారి మెస్మరైజ్ చేస్తుంది. బావుందీ సినిమా! డిఫరెంట్ & న్యూ ఏజ్ సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకులకు నచ్చుతుంది.

Related Posts