YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఉద్రిక్త పరిస్థితుల నడుమ తెరపైకి పద్మావత్‌

ఉద్రిక్త పరిస్థితుల నడుమ  తెరపైకి పద్మావత్‌

- దేశవ్యాప్తంగా 4 వేల స్క్రీన్‌లలో విడుదల
- నాలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకు రాని చిత్రం

- 35 లక్షల మంది సినిమా చూశారని అంచనా..
- సుప్రీంకోర్టులో 'ధిక్కరణ' పిటిషన్లు

ఉద్రిక్త పరిస్థితుల నడుమ దేశవ్యాప్తంగా నాలుగు వేల స్క్రీన్‌లలో సినిమా గురువారం విడుదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పద్మావత్‌ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజే దాదాపు 35 లక్షల మంది సినిమాను వీక్షించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అంచనా వేసింది. సంజరు లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై కొంతకాలంగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. చరిత్రను వక్రీకరించి సినిమా తీశారంటూ రాజ్‌పుత్‌ కర్ణిసేన వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 1న విడుదల కావాల్సిన చిత్రం వాయిదా పడింది. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. పద్మావత్‌ను ప్రదర్శిస్తే థియేటర్లను తగులబెడతామని కర్ణిసేన కార్యకర్తలు ఇది వరకే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో థియేటర్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పలు ప్రాంతాల్లో కర్ణిసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. . బీహార్‌లో 28వ జాతీయ రహదారిని కర్ణిసేన కార్యకర్తలు దిగ్బంధించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ థియేటర్‌ వద్ద పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులో పద్మావత్‌కు వ్యతిరేకంగా శ్రీరామసేన కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. చెన్నైలోని సత్యం థియేటర్‌ వద్ద ఆందోళన చేస్తున్న శ్రీరామసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పద్మావత్‌ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే ముక్కు, చెవులు కోస్తే రూ.కోటి రివార్డు ఇస్తానంటూ క్షత్రియ మహాసభ అధ్యక్షుడు గజేంద్రసింగ్‌ బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. 


ధిక్కరణ పిటిషన్లపై సోమవారం విచారణ !
మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, గోవాలో సినిమా విడుదల కాలేదు. భద్రతపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో సినిమాను ప్రదర్శించవద్దని థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాజస్థాన్‌లోని ఉదరుపూర్‌లో కర్ణిసేన కార్యకర్తలు దుకాణాలపై దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిరసనకారులు.. ఓ కారును తగులబెట్టారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పద్మావత్‌కు వ్యతిరేకంగా గుజరాత్‌లోని ఖేడాలో అమ్రేలి-రాజుల-పిపావావ్‌ హైవేను నిరసనకారులు దిగ్బంధించారు. పద్మావత్‌ను విడుదల చేయాలని, థియేటర్ల వద్ద భద్రత కల్పించాలిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినాగానీ, నాలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించడం ధిక్కరణ కిందికే వస్తోందని, సినిమా విడుదలకు చర్యలు తీసుకోని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, గోవా ప్రభుత్వాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్‌ దాఖలైంది. అంతేకాక, కర్ణిసేన చీఫ్‌ లోకేంద్రసింగ్‌ కల్వి సహా ముగ్గురిపై కోర్టు ధిక్కరణ చర్య కింద మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ రెండు పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టనున్నట్టు చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా వెల్లడించారు. బుధవారం గుర్గావ్‌లో స్కూల్‌ బస్సుపై జరిగిన రాళ్ల దాడి ఘటనలో 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు.


గణతంత్ర వేడుకల్లో పద్మావత్‌ పాటలొద్దు
గుజరాత్‌లో స్కూళ్లకు ఆదేశాలు
శుక్రవారం జరిగే గణతంత్ర వేడుకల్లో పద్మావత్‌ సినిమా పాటలు, సీన్లను వినియోగించరాదని గుజరాత్‌లోని మహిసాగర్‌ జిల్లాలో స్కూళ్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే..ఎలాంటి వివాదాలకూ తావివ్వకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా ప్రాథమిక విద్యాశాఖ అధికారి కిశోర్‌ జానీ వెల్లడించారు. మరోవైపు.. స్కూళ్లకు జారీ అయిన ఆదేశాలపై దర్యాప్తు జరిపి, తదుపరి చర్యలు తీసుకుంటామని మహిసాగర్‌ జిల్లా కలెక్టర్‌ ఎండి మోదియా తెలిపారు.

 

Related Posts