విజయవాడ, నవంబర్ 21,
రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల పొత్తుల్లో భాగంగా టీడీపీ -జనసేన సీట్ల కసరత్తు కొనసాగుతోంది. అందులో భాగంగా రెండు పార్టీల నుంచి పోటీ ఉన్న నియోజకవర్గాల పైన ముందుగా ఫోకస్ చేసారు. సమీకరణాలు..నేతల బలాబాలు అధారంగా సీట్లు కేటాయిస్తున్నారు. జనసేన నుంచి టీడీపీకి తమ పార్టీకి కేటాయించే సీట్ల పైన ప్రతిపాదనలు అందాయి. దీంతో, ఇప్పుడు టీడీపీ ఈ సీట్ల కేటాయింపు పైన కీలక నిర్ణయాలకు సిద్దమైంది.ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుతో సీట్ల వ్యవహారం ఆసక్తి కరంగా మారుతోంది. రెండు పార్టీల కీలక నేతలు ఒకే నియోజకవర్గంలో ఉన్నచోట ఏం జరుగుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పుడే సీట్లు ఎవరికనేది బయటకు చెప్పటం ద్వారా సమస్యలు వస్తాయని భావిస్తున్న రెండు పార్టీల అధినేతలు..అంతర్గతంగా మాత్రం కసరత్తు కొనసాగిస్తున్నారు. పై స్థాయిలో గుంభనంగా ఉంటున్నా కింది స్థాయిలో సీట్లపై అంతర్గతంగా తర్జనభర్జనలు నడుస్తున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు గతంలో ప్రకటించారు. జనసేన కీలక నేత కందుల దుర్గేశ్ కూడా అదే నియోజకవర్గాన్ని ఆశిస్తున్నారు. దుర్గేశ్‌కు జనసేన నాయకత్వం ప్రాధాన్యం ఇస్తూ ఆయనకు సీటు ఇవ్వాలని భావిస్తోంది. దుర్గేశ్ కు ఈ సీటు ఖాయం అయిందనే ప్రచారం జరుగుతోంది. దుర్గేశ్‌కు రాజమండ్రి రూరల్ తప్పనిసరిగా ఇవ్వాలని జనసేన గట్టిగా పట్టుబడితే బుచ్చయ్యను రాజమండ్రి అర్బన్ లేదా రాజానగరం సీట్లలో ఒక చోటకు మార్చాల్సి వస్తుంది. ఆయన్ను మార్చలేమని టీడీపీ నాయకత్వం తేల్చిచెబితే.. దుర్గేశ్‌కు రాజానగరం కేటాయించాల్సి వస్తుంది. ఆ సీటుకు ప్రస్తుతం బొడ్డు వెంకటరమణ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. సర్దుబాట్లలో ఈ సీటు మరొకరికి ఇవ్వాల్సి వస్తే బాధపడవద్దని ఆయనకు నాయకత్వం ముందుగానే చెప్పింది. రాజమండ్రి ఎంపీ సీటుకు ఆయన పేరు కూడా ప్రతిపాదనల్లో ఉంది. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ తన పని తాను చేసుకుంటున్నారు. అక్కడ జనసేన సీటు ఖాయమని తెలుస్తోంది. భీమవరం, కాకినాడ, అమలాపురం, రాజోలు, అమలాపురం, గాజువాక, పీ గన్నవరం,కైకలూరు, గిద్దలూరు, ఆళ్లగడ్డ సీట్లు ఇప్పటి వరకు జనసేనకు కేటాయించటం ఖాయమనే చర్చ సాగుతోంది. గోదావరి జిల్లాల్లోనే జనసేనకు కేటాయించే సీట్ల పైన టీడీపీ సీనియర్లలో టెన్షన్ మొదలైంది. సర్దుబాటు చేస్తారా:గుంటూరు జిల్లా తెనాలి స్థానంలో కూడా ఇటువంటి పరిస్థితే నెలకొంది. జనసేన పీఏసీ చైర్మన్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గతంలో ఈ సీటుకు ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయనే టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మనోహర్ పోటీ చేయాలనుకుంటే తెనాలి నుంచే చేస్తారన్నది సుస్పష్టం. అవసరమైతే మరో చోటకు మారడానికి సిద్ధపడాలని రాజాకు చంద్రబాబు ఇప్పటికే సూచించారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజాకు ప్రత్యామ్నాయంగా గుంటూరు ఎంపీ స్థానానికి ఆయన పేరు పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు. గుంటూరు సిటింగ్ ఎంపీ గల్లా జయదేవ్ ఈసారి పోటీ పైన స్పష్టత రావాల్సి ఉంది. అయితే, రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ సులభంగా తేలే అవకాశం మాత్రం కనిపించటం లేదు. దీంతో..రెండు పార్టీల్లోని ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.