నెల్లూరు, నవంబర్ 21,
తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరి జలాల విషయంలో నిత్యం వివాదాలు, ఘర్షణలు చూస్తూనే ఉన్నాం. అలాగే ఆంద్రప్రదేశ్, తమిళనాడు మధ్య పులికాట్ సరస్సు (ప్రళయ కావేరి) వేదికగా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. పులికాట్ మొత్తం విస్తీర్ణం 640 చదరపు కిలోమీటర్లు. అందులో 84 శాతం ఆంద్రప్రదేశ్ లోనే ఉండగా మిగిలిన 16 శాతం తమిళనాడులో ఉంటుంది. అది ఇప్పుడు 240 కిలోమీటర్లకు కుంచించుకు పోయింది. భూభాగం ఏపీలో ఎక్కువగా ఉన్నా నీటి శాతం తమిళనాడులో ఎక్కువగా ఉంది. ఎంత అంటే తమిళనాడు భూభాగంలో సరస్సులో నీటి శాతం 80 శాతం ఉంటే కేవలం 20 శాతం మాత్రమే ఆంద్రప్రదేశ్ భూభాగంలో ఉంది. అందుకు కారణం సముద్రాన్ని అనుకుని ఉన్న పులికాట్ ఉప్పునీటి సరస్సుకు జీవమైన నీరు వచ్చేది సముద్రం నుంచే. గతంలో సహజ సిద్ధంగా ఉండే ముఖ ద్వారాల నుంచే అవి కాస్త పూడికతో నిండిపోవడంతో సరస్సులో నీటి శాతం తగ్గిపోయింది. ఒకప్పుడు నిత్యం నీటీతో నిండిపోయి ఉండే ఈ సరస్సు ఏపీలో ఏడారిలా మారిపోయింది. నీరు పుష్కలంగా ఉంటే మత్స్య సంపద విరివిగా ఉంటుంది. పులికాట్ సరస్సుపై ఆధారపడి లక్షలాది మంది జాలర్లు జీవిస్తున్నారు. ప్రస్తుతం వీరందరికి ఉపాధి లేకుండా పోయింది.
తమిళనాడు తీరంలో ఉండే ముఖద్వారాలను మాత్రం ఏటా అక్కడి ప్రభుత్వం పూడిక తీయిస్తోంది. దీంతో అక్కడ నీటి సామర్ధ్యం ఉంటోంది. ఏపీలో మాత్రం పూడిక తీత జరగడం లేదు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇదొక ఎన్నికల ప్రచారాస్త్రంగా మారుతోందే తప్ప పరిష్కారం మాత్రం లేదు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వం వస్తే పూడిక తీత చేపడతామని హామీ ఇచ్చారు. అది ఇప్పుడు ఆచరణలోకి రాబోతోంది. మత్స్యకారుల కుటుంబాల ఏళ్లనాటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తూ పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీత శంఖస్థాపన చేయనున్నారు.. ఇందుకోసం 122 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. అలాగే సూళ్లూరుపేట లోని కాలంగి నది పై 35 కోట్ల రూపాయల నిధులు తో నూతన బ్రిడ్జి నిర్మాణం కు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.ప్రతియేటా నైజీరియా, బర్మా, కజకిస్తాన్, పాకిస్తాన్ నుంచి డిసెంబర్ నెలలో విదేశీ పక్షులు ఇక్కడకు వలస వస్తాయి. సమీపంలోని పక్షుల విడిది కేంద్రం నెలపట్టుకు వచ్చే విదేశీ పక్షులు పులికాట్ లో ఆహారం కోసం వస్తాయి. కొన్ని నెలల పాటు సంతానోత్పత్తి చేసుకుని మళ్లీ తిరిగి వెళతాయి. గత కొన్నేళ్లుగా పులికాట్ లో నీటి జాడ లేని కారణంగా పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ముఖ ద్వారాల పూడిక తీత పూర్తయితే ఏపీలోని పులికాట్ భూభాగంలో నీరు పుష్కలంగా ఉంటుంది. మత్స్య సంపద పెరిగి మత్స్యకార కుటుంబాలకు ఉపాధి పెరగడమే కాకుండా పక్షులకు కూడా ఆహారం దొరుకుతుంది.భారత దేశం అంతరిక్ష ప్రయోగాల కోసం రాకెట్లను ప్రయోగించే శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉండేది పులికాట్ లేక్ లోనే. పులికాట్ మధ్యలో అనేక దీవులు ఉన్నాయి. అందులో ఉన్న ఒక దీవి శ్రీహరికోట. గురుత్వాకర్షణ తక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో 1979 లో ఇక్కడ అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.