YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మళ్లీ తెరపైకి తెలంగాణం..

మళ్లీ తెరపైకి తెలంగాణం..

హైదరాబాద్, నవంబర్ 21,
" కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయి " ఇటీవలి ఎన్నికల ప్రచార సభల్లో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చేస్తున్న, చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి ఇవి. మొదట్లో ఆయన జాతీయ రాజకీయ ప్రస్తావన తీసుకు రాలేదు. కానీ రెండో విడత ప్రచారంలో కేంద్రం వచ్చే ప్రభుత్వం గురించి చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీల హవా గురించి చెబుతున్నారు. కేసీఆర్ ప్రాంతీయ పార్టీల గురించి చెప్పినప్పుడల్లా ఎక్కువ మందికి ఒకటే డౌట్ వస్తోంది.  ఇప్పుడు భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీనా... రాష్ట్ర పార్టీనా అనే. తెలంగాణలో సాధించాల్సింది అయిపోయిందని.. ఇక దేశంలో గుణాత్మక మార్పు తీసుకు రావాలన్న లక్ష్యంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి.. జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తెలంగాణ సెంటిమెంట్  ను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి కాదు.. మనది తెలంగాణ రాష్ట్ర సమితినే అన్నట్లుగానే బీఆర్ఎస్ ప్రచార వ్యూహం ఉంది. ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు.. బీఆర్ఎస్ ముఖ్య నేతలందరిదీ అదే మాట. ఖానాపూర్ లో కేటీఆర్ ఢిల్లీ నేతలొస్తారు.. వాళ్లని తరిమికొడతదాం అని పిలుపునిచ్చారు. అంటే పూర్తి స్థాయిలో  తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్‌ మీదనే ఆధారపడుతున్నారు. ఢిల్లీ జాతీయ పార్టీలను నమ్మొద్దని వారే చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన బీఆరెస్‌నే గెలిపించాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ ను జాతీయ  పార్టీగా మార్చారనే సంగతినే మర్చిపోయినట్లుగా వీరంతా ప్రచారం చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.  ఉద్దేశపూర్వకంగానే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రాంతీయ సెంటిమెంట్‌ను ఉపయోగిస్తున్నారని భావిస్తున్నారు. టీఆరెస్‌ బీఆరెస్‌గా మారిన క్రమంలో పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించారు. పంజాబ్‌, ఢిల్లీ, బీహార్‌, మహారాష్ట్ర, బెంగాల్‌, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లారు. అక్కడి అధికారంలో ఉన్న నేతలను, ప్రతిపక్ష నేతలను కలిశారు. జాతీయ స్థాయిలో చేయాల్సిన పనులపై చర్చించారు. రైతు ఉద్యమంలో చనిపోయిన పంజాబ్ రైతులకు, గల్వాన్ పోరులోని అమరుల కుటుంబాలకు చెక్కులు ఇచ్చారు. పార్టీ పేరు మార్చిన తర్వాత  ఒడిషా, ఏపీలకు అధ్యక్షుల్ని ప్రకటించారు.   మహారాష్ట్రపై కేంద్రీకరించిన కేసీఆర్‌.. కొందరు నేతలను హైదరాబాద్‌కు పిలిపించి.. గులాబీ కండువాలు కప్పారు. మహారాష్ట్రలో దున్నేస్తామని కూడా కేసీఆర్ గట్టిగా ప్రచారం చేశారు. కానీ హఠాత్తుగా అసలు ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ గురించి  మాట్లాడటం లేదు. ఒడిషా బీఆర్ఎస్ చీఫ్ మళ్లీ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఏపీ బీఆర్ఎస్ చీఫ్ న తెలంగాణలో కనిపించకుండా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు పూర్తిగా తెలంగాణ వాదంతోనే ఎన్నికలకు వెళ్తున్నారు.జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తామని చెబుతూ టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీగా తెలంగాణ ఆత్మను బీఆరెస్‌గా మార్చడంతో చంపుకొన్నారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. వాటిని బీఆరెస్‌ నాయకత్వం కొట్టిపారేసింది. కానీ.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అధినేతగానే మాట్లాడుతుండటంతో ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఏర్పడటమే కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి.  ఎన్నికల ప్రచారసభల్లో మాట్లాడుతున్న కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ ఇతర నాయకులు కాంగ్రెస్‌, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. అవి ఢిల్లీ పార్టీలని, ఆ పార్టీలకు ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నవారు ఢిల్లీకి గులాములని మండిపడుతున్నారు. మళ్లీ తెలంగాణ.. వారికి గులాములుగా ఉండాలా? సీల్డ్‌ కవర్‌ సీఎంలు కావాలా? టూరిస్టులు కావాలా? అని ప్రశ్నలు గుప్పిస్తుండటాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ‘బీఆరెస్‌ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని అంటున్నారు. మరి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసమే బీఆరెస్‌గా మార్చుతున్నామని చెప్పారు కదా అనే డౌట్ ను మాత్రం ఇక్కడ రానీయడం లేదు . తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు పూర్తిగా రాష్ట్ర సాధన లక్ష్యంతో చేశారు. ఆ పార్టీకి కుల, మతాలకు అతీతమైన ఓటు బ్యాంక్ కేవలం తెలంగాణ వాదం మీదనే ఉంది. అవే ఆ పార్టీకి కవచ కుండలాలు. వాటిని తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా కాపాడుకుంటూ వస్తున్నారు.  టీఆర్ఎస్ విజయాల్లో తెలంగాణ వాదానిదే అగ్రస్థానం. ఆ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు . కేసీఆర్ తప్పు చేస్తున్నారని అనుకున్నారు. కానీ  కేసీఆర్ ముందుకే వెళ్లారు. ఇప్పుడు ఎన్నికల్లో ఉన్న పరిస్థితుల్ని చూసినా . తర్వాత తన బలాన్ని తాను మళ్లీ తెచ్చుకోవాలని డిసైడయ్యి.. వ్యూహం మార్చినట్లుగా భావిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో... మరోసారి విజయం సాధిస్తే.. ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్  ఆయా రాష్ట్రాలకు మేలు చేస్తామని చెప్పి రాజకీయాలు చేయగలరా అన్న సందేహం వస్తుంది. కానీ.. కేసీఆర్ అంటేనే.. తెలంగాణ అనే బ్రాండ్ ఉందని.. ఇతర రాష్ట్రాలు కూడా యాక్సెప్ట్ చేస్తాయని బీఆర్ఎస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. మహారాష్ట్రలో భారీగా జరిగిన చేరికలే  సాక్ష్యమంటున్నారు. మూడో సారి కేసీఆర్ గెలిస్తే ఎలా గెలిచారన్న సంగతిని మర్చిపోతారని.. దేశవ్యాప్తంగా ఆయనకు క్రేజ్ వస్తుందని.. నమ్ముతున్నారు. అదే జాతీయ పార్టీ విస్తరణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Related Posts