YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జమిలి ఎన్నికలు దేశప్రయోజనాలతో ముడిపడిన అంశం

జమిలి ఎన్నికలు దేశప్రయోజనాలతో ముడిపడిన అంశం

లక్నో నవంబర్ 21
జమిలి ఎన్నికల పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు దేశప్రయోజనాలతో ముడిపడిన అంశమని అన్నారు. జమిలితో దేశప్రజలకే ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న కోవింద్‌ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఒకే దేశం – ఒకే ఎన్నికకు మద్దతు తెలిపారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జమిలి ఎన్నికల ఆలోచనకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను రామ్‌నాథ్ కోవింద్ కోరారు. ప్రజలు దీని నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారని అన్నారు. పార్టీతో సంబంధం లేకుండా కేంద్రంలో ఉన్నవారికి కూడా మేలు జరుగుతుందని వివరించారు.‘దేశంలో జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి నన్ను చైర్మన్‌గా నియమించింది. ఈ కమిటీ అధ్యయనం చేసి జమిలి ఎన్నికలు అమలు చేయడంపై ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంది. ఇప్పటికే దేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను తీసుకున్నాం. అన్ని పార్టీలూ ఏదో ఒక సమయంలో జమిలి ఎన్నికలకు మద్దతు ఇచ్చాయి. ఒకే దేశం – ఒకే ఎన్నికలు అమలు చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ‌కే మేలు జరుగుతుంది. అది బీజేపీ కావొచ్చు.. కాంగ్రెస్ కావొచ్చు. లేదా మరే ఇతర రాజకీయ పార్టీ అయినా కావొచ్చు. అందులో ఎటువంటి వివక్షా లేదు. ముఖ్యంగా ప్రజలే దీని నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒకేసారి ఎన్నికల ద్వారా డబ్బు ఆదా అవుతుంది. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశ అభివృద్ధికి ఉపయోగించవచ్చు. ఇది జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విషయం. ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాలతో ముడిపడింది కాదు. అందుకే దేశానికి మేలు జరిగేలా నిర్మాణాత్మకంగా సహకరించాలని అన్ని పార్టీలను అభ్యర్థిస్తున్నాం’ అని అన్నారు.కాగా, దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై గత కొంతకాలంగా చర్చ జరుగుతూ వస్తున్నది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు జమిలి ఎన్నికలతో ప్రయోజనాలు ఉన్నాయంటే, ఇంకొందరేమో జమిలి ఎన్నికలతో ఒరిగేదేమీ లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల నిర్వహణపై ఓ క్లారిటీ కోసం కేంద్రం కమిటీని నియమించింది. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వం వహిస్తున్నారు.

Related Posts