కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మరోసారి కాంగ్రెస్ పార్టీపైనే తాను ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. ఆ పార్టీ అనుమతి లేకుండా ఏదీ చేయనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 'దయ' వల్లే తాను సీఎం అయినట్టు కుమారస్వామి సోమవారంనాడు పునరుద్ఘాటించారు. రాష్ట్రం పట్ల తనకున్న బాధ్యతకు కట్టుబడి ఉంటానని, ముఖ్యమంత్రిగా తన బాధ్యత తాను చేస్తానని చెప్పారు.ఆదివారం సైతం కుమారస్వామి కాంగ్రెస్ పట్ల తనకున్న కమిట్‌మెంట్‌ను చాటుకున్నారు. స్పష్టమైన తీర్పు ఇవ్వాల్సిందిగా తాను ప్రజలను కోరనని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలకు రుణపడి ఉన్నానని అన్నారు. 'ఇది నా స్వతంత్ర (ఇండిపెండెంట్) ప్రభుత్వం కాదు. స్పష్టమైన తీర్పు ఇమ్మని ప్రజలను కోరారు. అయితే కాంగ్రెస్ వల్లే నేను ఇవాళ సీఎం పదవిలో ఉన్నాను. 6 కోట్ల రాష్ట్ర ప్రజల తీర్పు వల్ల కాదు. అందుకు కాంగ్రెస్ పార్టీ నేతలకు రుణపడి ఉన్నాను' అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం కన్నడనాట సంచలనం సృష్టిస్తున్నాయి.సీఎంగా బాధ్యతలు చేపట్టిన కుమారస్వామి తనదైన శైలిలో పరిపాలన సాగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓ వైపు సంకీర్ణంలో భాగస్వామియైున కాంగ్రెస్ పార్టీతో చర్చలు, ప్రముఖులతో భేటీ, మఠాధిపతుల ఆశీర్వాదం, ఆలయాల సందర్శనలో బిజీగా గడుపుతూనే అధికారుల బదిలీలకు కసరత్తు చేపట్టారు. ఉద్యోగుల బదిలీలలో భారీ సర్జరీ తప్పదనిపిస్తోంది. 2006లో సీఎంగా వ్యవహరించిన కుమారస్వామికి పాలన తిరుగులేనిదనే పేరు ఉంది.12 ఏళ్ళపాటు ప్రతిపక్షంలో కొనసాగి అధికారుల వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలలో పాల్గొనే ఉద్యోగులను గమనించారు. వీరిపై దృష్టి పెట్టిన ఆయన భారీగా బదిలీలు చేయదలిచారు. ఐఏఎస్, ఐపీఎ్‌సలే కాకుండా తాలూకా స్థాయిలో తిష్టవేసుకున్న వారి జాబితాను కోరినట్లు తెలుస్తోంది. పోలీసు, ప్రజాపనులు, ఆర్థిక , విద్యుత్, రెవిన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులను తొలి విడతలోనే బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏళ్ళ తరబడి ఒకేచోట ఉండేవారిపై మరో వారం పదిరోజులలో వేటుపడే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక సీఎం పేషీలోనూ భారీ మార్పులు ఉంటాయని తెలుస్తోంది.