YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

షా వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు

షా వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు

ఏపీ, అమరావతిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు చంద్రబాబు. మహానాడు వేదికగా ఆయనపై నిప్పులు చెరిగారు. రాజధాని పనులపై షా చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు టీడీపీ అధినేత. అమరావతిలో అసలు పనులు ప్రారంభంకాలేదని ఆయన ఎలా చెబుతారని ప్రశ్నించారు. 'రాజధాని నిర్మాణానికి ఇచ్చింది రూ.2,500కోట్లు.. ఏదో మొత్తం ఇచ్చేసినట్లు బుకాయింపులు. ఇక యూసీలు విషయానికొస్తే.. ఓ పార్టీ అధ్యక్షుడికి వాటి గురించి ఎందుకు.. అవి ఇచ్చామో లేదో ప్రధాని చెప్పాలి కాని షాకు ఎందుకు. పాలనా అంశాల్లో జోక్యం చేసుకోవడానికి ఆయనెవరు అని ప్రశ్నించారు బాబు. 

కేంద్రానికి యూసీలు పంపిస్తే నిజమైనవి కావని ఆరోపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 'పోలవరం, అమరావతి నిర్మాణాలకు నిధులు ఇవ్వకుండా మొండికేసి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదాకు, లోటు బడ్జెట్‌కు ఎలాంటి యూసీలు కావాలో అమిత్‌ షా చెప్పాలి. దేశంలోని ప్రజల సొమ్మును గుజరాత్‌కు ఎలా తరలిస్తారు. అమిత్‌ షా ఇప్పటికైనా దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలి. కేంద్రానికి రాష్ట్రాలు బానిసలు కావని ఎన్టీఆర్ అప్పట్లోనే చెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. దాన్ని ఇవ్వకుంటే కేంద్రానికి గుణపాఠం తప్పదు' అని హెచ్చరించారు టీడీపీ అధినేత. రాష్ట్రానికి న్యాయం చేయాలని అడిగితే పవన్‌కల్యాణ్‌ వంటి వాళ్లతో ప్రభుత్వంపై దాడి చేయిస్తున్నారని ఆరోపించారు బాబు. ' బెదిరింపు రాజకీయాలు, దుర్మార్గపు ఆలోచనలు సరికాదు. రాష్ట్రంలో బీజేపీ పోటీ చేస్తే ఒక్క సీటు రాదు. నమ్మక ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెప్పేందుకు వచ్చే ఎన్నికల్లో టీడీపీని 175సీట్లలో గెలిపించాలి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పార్టీ కార్యకర్తలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఓ రాష్ట్రంతో, జాతితో అనవసరంగా పెట్టుకోవద్దు' అంటూ చంద్రబాబు హెచ్చరించారు. యూసీలను సమర్పించడంలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఎప్పటికప్పుడు యూసీలను అందిస్తున్న ఏపీని పట్టుకుని... యూసీలను ఇవ్వడంలేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించడం దారుణమని మండిపడ్డారు. ఏమాత్రం అవగాహన లేకుండా అమిత్ షా మాట్లాడుతున్నారని అన్నారు. నిధులను ఎగ్గొట్టేందుకు కొత్త నాటకానికి తెరదీస్తున్నారని ఆరోపించారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక... ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని మండిపడ్డారు. కావాలనే ఏపీకి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరైంది కాదని అన్నారు. కేంద్రం తీరు ఏపీ అభివృద్ధిని అడ్డుకునేలా ఉందని చెప్పారు.

Related Posts