ట్విట్టర్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ సోషల్ మీడియా వింగ్ మధ్య కౌంటర్లు, ఎన్‌కౌంటర్లు నడుస్తున్నాయి. తల్లి సోనియాగాంధీతో కలిసి రాహుల్ విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే కదా. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోనియా మెడికల్ చెకప్ కోసం విదేశాలకు వెళ్తున్నానని చెబుతూనే బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. మీరు మరీ ఎక్కువగా పనిచేయకండి.. త్వరలోనే తిరిగొస్తా అని ట్వీట్ చేశారు.దీనికి బీజేపీకి కూడా గట్టి కౌంటరే ఇచ్చింది. సోనియా ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం. అయితే మీరు వెళ్లే ముందే ఆ కర్ణాటక కేబినెట్ పనేదో చూసేస్తే వాళ్ల ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు అక్కడి నుంచి కూడా మాకు ఎప్పటిలాగే వినోదం పంచుతారని ఆశిస్తున్నామంటూ బీజేపీ ట్వీట్ చేసింది.సోనియాతో వెళ్తున్న రాహుల్ వారం తర్వాత తిరిగి ఇండియా వచ్చేయనుండా.. ఆమె మాత్రం మరికొంతకాలం విదేశాల్లోనే ఉండనున్నారు. అంతవరకు కర్ణాటకలో కేబినెట్ ఏర్పాటుతోపాటు ఎలాంటి కీలక నిర్ణయాలను తీసుకోకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనినే బీజేపీ ప్రశ్నించింది. ప్రభుత్వం ఏర్పాటై ఇన్నాళ్లయినా కేబినెట్ ఏర్పాటు కాకపోవడాన్ని బీజేపీ తప్పుబడుతున్నది. రాహుల్ వెళ్లే ముందు కేబినెట్‌పై సీనియర్ నేతలతో చర్చించినా.. అది అసంపూర్తిగా మిగిలిపోయింది. అయితే రాహుల్ ఎప్పుడూ ఫోన్లో అందుబాటులో ఉంటారని, ఆయన వచ్చే వరకు నిర్ణయాన్ని వాయిదా వేయబోమని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టంచేశారు.