YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేవంత్.. ఒంటరి పోరాటం

రేవంత్.. ఒంటరి పోరాటం

హైదరాబాద్, నవంబర్ 23,
తెలంగాణ ఎన్నికల్లో  అందరూ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ గెలిచిందని దుష్ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ బహిరంగంగానే  చెబుతున్నారు. కాంగ్రెస్ గెలిచేది లేదని సచ్చేది లేదని కేసీఆర్ కూడా బహిరంగసభల్లో అంటున్నారు. అసలు కాంగ్రెస్ గెలుపు అనే మాట రెండు పోటీ పార్టీల నుంచి రావడం ఆసక్తికరమే. ఆరు నెలల కిందట రేసులో లేదనుకున్న కాంగ్రెస్ ఇలా మార్పు చెందడం అనూహ్యమే. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రెండు ఎన్నికల్లో ఓడిపోయింది.   కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణాలేమిటన్నదానిపై రకరకాల విశ్లేషణలు ఉన్నాయి.    తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని ప్రజలు నమ్మడమేనని ఎక్కువ మంది చెప్పుకుంటారు. కాంగ్రెస్ నేతలూ అదే ప్రచారం చేసుకుంటారు.  తెచ్చింది కేసీఆర్ అయితే.. ఇచ్చింది కాంగ్రెస్.  ఇచ్చిన కాంగ్రెస్ ను ప్రజలు ఎందుకు ఆదరించలేదు.  ఈ ప్రశ్నకు చాలా మందికి ఆన్సర్ తెలిసినా చెప్పరు.  తెలియని వాళ్లూ ఎక్కువగానే ఉంటారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించకపోవడానికి కారణం నాయకత్వ లోపం. అవతలి వైపు కేసీఆర్ బాహుబలిలా నిలబడ్డారు.  మరి కేసీఆర్ ను ఢీకొట్టే నేత ఎవరు ?. ఈ డైలమాలో ప్రజలు ఉండబట్టే  ప్రజలు చాన్సివ్వలేదు. అంటే..   అసలు కారణం నాయకత్వం.  గొప్ప టీమ్ ఉంటే సరిపోదు  అందర్నీ ఏకతాటిపై నడిపించే నాయకుడు ఉండాలి. ఆ నాయకుడికి ప్రజల్లో  పరపతి ఉండాలి.   ప్రత్యర్థికి ధీటైన నాయకుడు అనిపించాలి.   ప్రత్యామ్నాయం తానే అనిపించగలగాలి. అలాంటి నాయకుడు లేక.. బహునాయకత్వం వల్ల కాంగ్రెస్ ఓడిపోయింది. 2014లో  కానీ... 2018లో కానీ కాంగ్రెస్  తరపున ప్రచారాన్నిభుజాన వేసుకుని నడిపించిన నాయుకుడు లేకపోవడం వల్లనే ఓడిపోయింది.  కాంగ్రెస్ పార్టీకి అతడే ఒక సైన్యం అన్నట్లుగా మారారు రేవంత్ రెడ్డి. రోజుకు నాలుగైదు నియోజకవర్గాలు చుట్టబెడుతున్నారు. మధ్యలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు.  ఇతర కార్యక్రమాలకు వెళ్తున్నారు. పార్టీ అగ్రనేతలు వస్తే రిసీవ్ చేసుకుంటున్నారు. పార్టీలో చేరడానికి వచ్చే వాళ్లతో సమావేశం అవుతున్నారు. మీడియా ఇంటర్యూలు ఇస్తున్నారు. కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావులు  బీఆర్ఎస్ తరపున చేస్తున్న పనులన్నింటినీ .. కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ఒక్కరే చేస్తున్నారని అనుకోవచ్చు.   తెలంగాణలో సీనియర్ నాయకులు కొదువలేదు. కానీ వారు రేవంత్ లా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేయలేరు. జనాకర్షక శక్తి అంత గొప్పగా లేదు.  కేసీఆర్ ఢీకొట్టగలిగే నేతగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఫలితంగా రేవంత్ రెడ్డినే కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ఎదిగారు. రేవంత్ రెడ్డే  ప్రత్యేక వ్యూహంతో ప్రచారం చేస్తున్నారు.  రేవంత్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా మంచి జనాదరణ కనిపిస్తోంది.  కాంగ్రెస్ నాయకత్వం పట్ల ప్రజల్లో పెరిగిన ఆదరణకు ఈ జన నినాదం సాక్ష్యంగా కనిపిస్తోంది.  తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ గ్యారంటీ పై భరోసా కలిగేలా చేయడానికి రాహుల్, ప్రియాంక గాంధీలు ఎక్కవ రోజులు తెలంగాణలో ప్రచారం చేసేలా ఒప్పించగలిగారు. రేవంత్ రెడ్డి వ్యూహాలపై.. పార్టీపై ఉన్న నిబద్ధతపై హైకమాండ్‌కు ఎంతో నమ్మకం ఉంది. అందుకే కాంగ్రెస్ హైకమాండ్.. ప్రతీ విషయంలోనూ రేవంత్ కు సపోర్ట్ చేస్తూ వస్తోంది. రేవంత్  అందర్నీ కలుపుకుని వెళ్లేందుకు తాను ఓ మెట్టు దిగడానికి కూడా వెనుకాడనని చెప్పడమే కాదు చేసి చూపించారు. పార్టీని నష్టపరిచిన కొంత మంది క్షమాపణ చెప్పమన్నా చెప్పారు. పార్టీ  బలోపేతం కోసం రేవంత్ దేనికైనా సిద్ధపడటం హైకమాండ్‌ దగ్గర పలుకుబడి పెంచేలా చేసింది. కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేయడానికి రేవంత్ సరైన నాయకుడని  భావించడం కూడా ఆయన ప్రాధాన్యను హైకమాండ్ గుర్తించిందనడానికి ఓ కారణం అనకోవచ్చు. ఆటలో అయినా రాజకీయాల్లో అయినా గెలుపోటములు తేడా కొంతే ఉంటుంది.  తెలంగాణ ఎన్నికల్లో 60 సీట్లు తెచ్చుకుంటే గెలుపు.  59 దగ్గర ఆగినా పరాజయమే. ఆ ఒక్కటే విజయాన్ని నిర్దేశిస్తుంది. అలాంటి డిఫరెన్స్ వచ్చేది సమర్థమైన నాయకుడు ఉన్నప్పుడే. ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఇద్దరు సమర్థులైన నేతల మధ్య పోరాటం జరుగుతోంది.  ఎవరిది పైచేయి అనేది డిసెంబర్ మూడో తేదీన తేలుతుంది. ఇప్పటికైతే  రేవంత్ రెడ్డి ధీటైన నాయకుడిగా ఎదిగారు. కానీ కేసీఆర్ అంత కాదు. రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం అందిస్తే.. ఆయన ఖచ్చితంగా కేసీఆర్ కు సమఉజ్జీ అవుతారు. అందులో సందేహం ఉండదు.

Related Posts