YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మద్యం, ఇసుక, కరెంట్ ఇదే కామన్ అజెండా

మద్యం, ఇసుక, కరెంట్ ఇదే కామన్ అజెండా

గుంటూరు, నవంబర్ 25,
రానున్న ఎన్నికల్లో మద్యం, ఇసుక, కరెంటు చార్జీలే అజెండా అవుతాయా..? ప్రస్తుతం విపక్షాలన్నీ ఈ మూడు అంశాలపైనే దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తామని వైసీపీ హామీనిచ్చింది. అధికారానికి వచ్చాక ప్రభుత్వమే మద్యం వ్యాపారం మొదలు పెట్టింది. హామీని గాలికి వదిలేసింది. టీడీపీ హయాంలో ఉచితంగా లభించిన ఇసుక ఇప్పుడు మరింత ప్రియమైంది. భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఇక నిరంతరం పెరుగుతున్న కరెంటు చార్జీలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అందుకే ఈ మూడు అంశాలను ఎన్నికల్లో అజెండా చేసేందుకు ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. వీటిపై అధికార పార్టీ దీటుగా సమాధానం చెప్పగలదా! ఢిఫెన్స్‌లో పడుతుందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.నాడు ప్రజా సంకల్పయాత్రలో వైసీపీ అధినేత వైఎస్జగన్దశలవారీ మద్య నిషేధం అమలు చేస్తామని హామీనిచ్చారు. పేద కుటుంబాలు గుల్లవుతుంది మద్యంతోనే అని చెప్పుకొచ్చారు. మహిళల తాళిబొట్లు తెంచుతున్న మద్యం మహమ్మారి అంతు చూస్తామన్నారు. మద్యాన్ని కేవలం స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామన్నారు. అధికారానికి వచ్చాక ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెర లేపింది. ధరలు రెట్టింపు చేసింది. పేద, మధ్య తరగతి కుటుంబాలను మరింత ఛిద్రం చేసింది. ధరలు పెంచినా మద్యం తాగడం మానుకోరని ప్రభుత్వానికి తెలుసు. ప్రతి కుటుంబ ఖర్చులో మద్యం వాటా మరింతగా పెరిగింది. సగటు ప్రజల ఆదాయం పెరగకున్నా మద్యం ఖర్చు పెరగడంతో అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవల మద్యం వ్యాపారంపై అనేక ప్రశ్నలు లేవనెత్తారు. మద్యం తాగేవారి సంఖ్య జాతీయ సగటు 18 శాతమైతే రాష్ట్రంలో 24 శాతం ఉన్నట్లు వెల్లడించారు. ఏటా బడ్జెట్లో మద్యం రాబడి అంచనా సుమారు రూ.20 వేల కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. వాస్తవ లెక్కలు చూస్తే సుమారు రూ.50 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో సుమారు లక్ష కోట్లకు పైగా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరినట్లు పురందేశ్వరి లెక్కలేసి చెప్పారు. నాణ్యత లేని చీప్లిక్కర్తాగి వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని ఆమె కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా చేశారు.ఇసుకలోనూ ప్రభుత్వం ప్రజల జేబులు కొట్టేస్తున్నట్లు అన్ని ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి. దొడ్డిదారిన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ట్రాక్టరు ఇసుక సుమారు రూ. 6 వేల ధర పలుకుతోంది. అంత ఖర్చుతో నిర్మాణాలు చేపట్టలేక భవన నిర్మాణ రంగం కుప్పకూలింది. పనుల్లేక కార్మికులు వలసబాట పట్టాల్సి వస్తోంది. ఇసుక తవ్వకాలను నిలిపేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదంటూ విపక్షాల నేతలు ప్రభుత్వాన్ని దునుమాడుతున్నారు.ఇవిచాలవన్నట్లు కరెంటు చార్జీలు ప్రతి నెలా మోతెక్కిస్తున్నాయి. తాము అధికారానికి వస్తే కరెంటు చార్జీలు తగ్గిస్తామన్న వైసీపీ హామీని అటకెక్కించింది. తగ్గించకపోగా భారీగా పెంచుకుంటూ వెళ్తోంది. ఈ మూడు అంశాలు ఎన్నికల్లో విపక్షాల అజెండా అయితే వైసీపీ ఎలా సమర్థించుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వీటిపై ప్రజలు దృష్టి పెట్టకుండా దారి మళ్లిస్తారా..? మరేం చేస్తారనే దానిపై విశ్లేషకులు సైతం కుస్తీ పడుతున్నారు.

Related Posts