కాకినాడ, నవంబర్ 25
జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. ఇద్దరు ఎంపీపీలతో సహా నలుగురు వైసీపీకి రాజీనామాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. శనివారం వైఎస్సార్ పార్టీకి ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి), గంటిమళ్ళ రాజ్యలక్ష్మి, తూర్పు లక్ష్మీపురం సర్పంచ్ డాక్టర్ వీరంరెడ్డి సత్య నాగ భార్గవి, భద్రవరం ఎంపీటీసీ కొప్పుల బాబ్జీలు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తమ రాజీనామాలకు పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ అవలంబిస్తున్న తీరే కారణమని వారు చెప్పారు. శనివారం కాకినాడలో ఉన్న ఓ హోటల్లో వారు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా బుజ్జి, రాజ్యలక్ష్మి, నాగ భార్గవి, బాబ్జీలు మాట్లాడుతూ ఎన్నో ఆశలతో వైకాపా ప్రభుత్వాన్నితో పాటు నియోజవర్గ ఎమ్మెల్యేగా పర్వతను గెలిపించుకున్నామని చెప్పారు. తాము ఎన్నికైన సుమారు మూడున్నర సంవత్సరకాలం నుంచి ఎమ్మెల్యే పర్వత వల్ల ఎన్నో అవమానాలు, వేధింపులకు గురవుతున్నామన్నారు. అయినా ఓర్చుకొని ఈ విషయాన్ని రీజనల్ కోఆర్డినేటర్ పీవీ మిథున్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబులకు తెలియజేసిన ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం వైకాపా పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తున్నామని పదవులకు రాజీనామా చేసే విషయంలో తమ తమ అనుచరుల అభిప్రాయలు తీసుకొని నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.
పార్టీ నిర్వహించిన సామాజిక బస్సు యాత్రకు పిలుపు ఎమ్మెల్యే పర్వత, పార్టీ నుండి గాని రాలేదన్నారు. ఇలా తమను దూరం పెట్టడంతో మనస్థాపానికి గురై రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నట్లు బుజ్జి, రాజ్యలక్ష్మి, నాగ భార్గవి, బాబ్జిలు తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గం అంతా ఎమ్మెల్యే తీరు వల్ల పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు నష్టం వాటిల్లుతోందని అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భద్రత కరువైందన్నారు. పార్టీ మార్పు విషయంపై అడిగిన ప్రశ్న స్పందిస్తూ తాము సమావేశం ఏర్పాటు చేసుకొని నిర్ణయం ప్రకటిస్తామన్నారు. పోలీసుల ద్వారా ఎమ్మెల్యే పర్వత తమను బెదిరింపులతోను తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నట్లు బుజ్జి, రాజ్యలక్ష్మి, నాగ భార్గవి, బాబ్జీలు చెప్పారు.