Highlights
గతవారంలో విడుదల అయిన ‘నేల టికెట్’ సినిమా నిరాశ పరచడం ‘మహానటి’కి ప్లస్ పాయింట్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద పోటీ లేకుండా పోవడంతో మహానటికి నిన్నటి వీకెండ్‌లో కూడా మంచి వసూళ్లే దక్కాయని ట్రేడ్ రిపోర్ట్ చెబుతోంది. ప్రత్యేకించి మల్టీప్లెక్స్ ఆడియన్స్ మధ్యనా, ఓవర్సీస్‌లో ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం కొనసాగుతూ ఉంది. నిన్నటి వీకెండ్ వసూళ్లతో అమెరికాలో మహానటి అక్కడ వసూళ్లలో కొత్త హైట్స్‌కు రీచ్ అయ్యింది. యూఎస్‌లో భారీ వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఆరో స్థానానికి ఎగబాకింది ఈ సినిమా. బాహుబలి-2 నంబర్ వన్ పొజిషన్లో ఉన్న ఈ జాబితాలో మహానటి ఆరో స్థానంలో నిలుస్తోంది. 24,50,000 డాలర్ల వసూళ్లతో ఈ సినిమా యూఎస్ వసూళ్లలో ఆరో స్థానంలో నిలుస్తోంది. ఈ సినిమా అక్కడ మరిన్ని వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఫిదా (రెండు మిలియన్ డాలర్లు),ఖైదీ 150(2.44 మిలియన్ డాలర్లు), అఆ(2.44 మిలియన్ డాలర్లు) సినిమాల వసూళ్ల మార్కును దాటేసింది మహానటి. 2.45 మిలియన్ డాలర్ల వసూళ్లతో తన పరుగును కొనసాగిస్తోంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, రంగస్థలం తదితర సినిమాల తర్వాతి స్థానంలో ఉంది ‘మహానటి’.అయితే ఆ భారీ సినిమాల బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్‌లతో పోలిస్తే మహానటి కాస్త తక్కువ స్థాయి సినిమానే. కానీ..సావిత్రి బయోపిక్ క్లాసిక్‌గా ప్రశంసలు అందుకొంటూ ఈ సినిమా భారీ వసూళ్లతో సాగుతోంది.