విశాఖపట్టణం, నవంబర్ 27,
మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జనసేనలో చేరనున్నారా? అందుకే పవన్ కళ్యాణ్ ను కలిశారా? పార్టీలో చేరతానని తన మనసులో ఉన్న మాటను చెప్పారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బిజెపిలో ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యే తరచు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పొగుడుతుంటారు. వైసీపీ పై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకోవడం శ్రేయస్కరమని సూచిస్తుంటారు. ఆయన తీరును చూసి సొంత పార్టీ శ్రేణులే విస్మయం వ్యక్తం చేస్తుంటాయి. రాష్ట్రంలో బిజెపి ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే పర్వాలేదు కానీ.. లేకుంటే తన దారిన తాను చూసుకోవడం తప్పదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో విశాఖ వచ్చిన పవన్ ను ప్రత్యేకంగా విష్ణుకుమార్ రాజు కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.2014లో బిజెపి తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్ రాజు శాసనసభాపక్ష నేతగా కూడా వ్యవహరించారు. చంద్రబాబు నాయకత్వాన్ని పొగడడంలో ముందుండేవారు. 2018లో ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వచ్చినా.. తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా గడిపిన బిజెపి నాయకుల్లో విష్ణుకుమార్ రాజు ఒకరు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి తర్వాత కూడా చాలా సందర్భాల్లో బాహాటంగా మద్దతు తెలిపారు. ముఖ్యంగా వైసిపి పై విమర్శలు చేయడంలో విష్ణుకుమార్ రాజు ముందుంటారు. దీంతో విష్ణుకుమార్ టిడిపిలో చేరతారని ప్రచారం జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ టిడిపి గూటికి చేరే సమయంలో విష్ణుకుమార్ రాజు పేరు బలంగా వినిపించింది. కానీ ఆయన టిడిపిలో చేరలేదు.విశాఖపట్నం పర్యటనకు వచ్చిన పవన్ ను విష్ణు కుమార్ రాజు కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మర్యాదపూర్వకంగానే కలిశారని విష్ణుకుమార్ అనుచరులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. తెలంగాణ ఫలితాల తర్వాత ఏపీపై బీజేపీ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ బిజెపి పొత్తుకు ఒప్పుకుంటే విష్ణుకుమార్ రాజు ఆ పార్టీలోనే కొనసాగుతారు. లేకుంటే మాత్రం జనసేనలో చేరి పొత్తులో భాగంగా విశాఖ నగరం నుంచి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ ను కలిశారని విశాఖ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతోంది.విష్ణు కుమార్ రాజు విషయంలో చంద్రబాబు సానుకూలంగా ఉన్నారు. అయితే పొత్తుల్లో భాగంగా జనసేనకు సీట్లు కేటాయించే అవకాశం ఉంది. అక్కడ బలమైన అభ్యర్థులను బరిలో దించాలని యోచనలో అటు చంద్రబాబు.. ఇటు పవన్ ఉన్నారు. అందులో భాగంగానే విష్ణుకుమార్ రాజు పవన్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఒకవేళ బిజెపి ఈ రెండు పార్టీలతో కలిస్తే ఒకలా.. కలవకపోతే నేరుగా జనసేనలో చేరి పోటీ చేయాలని విష్ణు కుమార్ రాజు భావిస్తున్నారు. మొత్తానికైతే తాజా పరిస్థితులు విష్ణుకుమార్ రాజు జనసేన గూటికి తప్పకుండా చేరుతారని తేటతెల్లం చేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.