YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స్కిల్ స్కామ్ ...క్వాష్ పిటీషన్ ఏమైంది

స్కిల్ స్కామ్ ...క్వాష్ పిటీషన్ ఏమైంది

విజయవాడ, నవంబర్ 27,
స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. సుదీర్ఘకాలం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపారు. ఎట్టకేలకు ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించింది. అంతవరకు పరవాలేదు కానీ.. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు ఏమైంది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలు కోర్టు ఎందుకు జాప్యం చేస్తోంది? తీర్పు ఎందుకు వెల్లడించడం లేదు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెర వెనుక ఏం జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. అసలు చంద్రబాబును అరెస్టు చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఒకవేళ చేసినా రిమాండ్ విధిస్తారని భావించలేదు. కానీ అరెస్టుతో పాటు రిమాండ్ జరిగిపోయింది. సుదీర్ఘకాలం జైల్లో ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఈ కేసులో చంద్రబాబు ఎక్కడ బెయిల్ కు ప్రయత్నించలేదు. తనపై కేసుల నమోదు విషయంలో నిబంధనలు పాటించలేదని.. గవర్నర్ అనుమతి తీసుకోలేదని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని.. చట్ట విరుద్ధమని.. అసలు సాక్షాధారాలే లేవని.. అందుకే ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఏసిబి, తర్వాత హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టులో కేసులు కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ తో పాటు హైకోర్టులో ఈ పిటిషన్ డిస్మిస్ అయ్యింది. సుప్రీంకోర్టులో మాత్రం విచారణకు వచ్చింది. కానీ సుదీర్ఘకాలం అవుతున్న తీర్పు మాత్రం వెల్లడి కాలేదు.అక్టోబర్ 17న కేసులో వాదనలు ముగిశాయి. అక్టోబర్ 20 కి వాయిదా పడింది. ఆరోజు కూడా తీర్పు వెల్లడించలేదు. అనంతరం దసరా సెలవులు అంటూ వాయిదాలు కొనసాగాయి. అదిగో తీర్పు.. ఇదిగో తీర్పు అంటూ కాలయాపన కొనసాగింది. తీర్పు మాత్రం వెల్లడించలేదు. ఇంతలో అనారోగ్య కారణాలు చూపుతూ చంద్రబాబు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీంతో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 28 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇంతలో రెగ్యులర్ బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. అటు ఫైబర్ నెట్ కేసు విషయంలో సైతం.. స్కిల్ స్కాంలో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ కు జత చేశారు.. దీనిపై ఎప్పుడు తీర్పు వస్తుందో చూడాలి. క్వాష్ పై హడావిడి చేసిన టిడిపి శ్రేణులు.. ఇప్పుడు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో కనీసం పట్టించుకోవడం లేదు. అసలు ఏమైందని ఆరా తీసే పని కూడా చేయడం లేదు.

Related Posts