బెంగళూరు, నవంబర్ 27,
దేశవ్యాప్తంగా సైబర్ మోసాల కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు ఎలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉన్నప్పటికీ, మోసగాళ్లు మోసం చేయడానికి కొత్త కొత్త మార్గాలను కనిపెడుతున్నారు. అలాంటి ఘటనే ఒకటి కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ఇక్కడ 43 ఏళ్ల మహిళ వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు సైబర్ నేరగాళ్ల చేతిలో పడి మోసానికి గురైంది. ఎలాంటి ఓటీపీ, లింక్ పంపకుండానే మహిళ డిజిటల్ వాలెట్ నుంచి రూ.లక్ష నగదును దుండగులు డ్రా చేశారు. సైబర్ దుండగుల ఈ కొత్త పద్ధతి తెలిసి ప్రజలు, పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, బుధవారం సాయంత్రం 4.45 నుండి 5 గంటల మధ్య దుండగుడు తన తండ్రి పేరును వాడుకుని రూ. 1 లక్ష రూపాయలు స్వాహా చేసాడు. అందుకు సంబంధిచిన ఆమె ఎలాంటి లింక్‌ను క్లిక్ చేయలేదని చెప్పింది. ఎటువంటి OTP కూడా తనకు రాలేదని, ఎవరితోనూ ఎలాంటి ఓటీపీ నెంబర్ తను షేర్ చేయలేదని చెప్పింది. కానీ, మోసగాడు తన తండ్రికి సన్నిహితుడని చెప్పాడని బాధిత మహిళ తెలిపింది. ఆ తర్వాత అతడు తనను డబ్బు పంపమని అడిగాడు. ఈ మేరకు ఆమె ఫోన్‌కు ఓ మెసేజ్ పంపాడు. అంతే.. తప్ప తాను ఎలాంటి ఓటీపీని షేర్ చేయలేదని, లింక్‌పై క్లిక్ చేయలేదని ఆ మహిళ చెప్పింది. ఇదిలావుండగా 15 నిమిషాల్లోనే ఆమె ఖాతా నుంచి లక్ష రూపాయలు డ్రా అయ్యాయని బాధిత మహిళ వాపోయింది. మహిళ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్‌లో ఇది కొత్త ట్రెండ్‌గా పోలీసులు అభివర్ణిస్తున్నారు. డబ్బు చోరీకి అనుమతించే కోడ్‌తో టెక్స్ట్ సందేశాలు ఎన్‌క్రిప్ట్ చేయబడతాయని సైబర్ క్రైమ్ నిపుణులు తెలిపారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.కానీ, ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యమే కారణమని మహిళ ఆరోపించింది. గవర్నర్, సీఎం భద్రతతో బిజీగా ఉన్నామని చెప్పి పోలీసులు ఫిర్యాదు నమోదు చేయలేదని అంటున్నారు. డబ్బు పోగొట్టుకున్న గంటలోపే పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని మహిళ చెప్పింది. మోసగాడి ఖాతాను స్తంభింపజేయాలని తాను పోలీసులను కోరానని చెప్పింది. కానీ, వారు ఆలస్యం చేశారని ఆమె ఆరోపించింది. పైగా పోలీసులకు హిందీ, ఇంగ్లీష్ తప్ప మరో భాష రాకపోవటంతో తాను చెప్పిన ఫిర్యాదును వారు అర్థం చేసుకోలేదని కూడా బాధిత మహిళ ఆరోపించింది. అంతేకాదు.. తాను పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు కూడా ఆ దుండగుడు తనకు ఫోన్ చేస్తూనే ఉన్నాడని, మరుసటి రోజు తనకు 22 సార్లు ఫోన్ చేశాడని మహిళ చెప్పింది. బేటా నా కాల్‌ని అటెండ్ చేయండి, మీ ఖాతా నుండి బదిలీ అయిన డబ్బును నేను పంపుతాను అనే మెసేజ్ కూడా వచ్చిందని బాధిత మహిళ చెప్పింది