YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏ జిల్లా... ఎవరి ఖిల్లా...

ఏ జిల్లా... ఎవరి ఖిల్లా...

హైదరాబాద్, నవంబర్ 27,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల రణక్షేత్రంలో విజేతలెవరో పరాజితులెవరో ఈనెల 30న ఓటర్లు తమ నిర్ణయాన్ని తెలుపనున్నారు. దీంతో మూడు ప్రధాన పార్టీల్లో టెన్షన్‌ నెలకొంది. అయితే ఎన్నికల యుద్ధంపై రాష్ట్రం ఏమంటోంది? మారే లెక్కలు జరిగే పరిణామాలు.. సరికొత్త సమీకరణలు ఈ ఎన్నికల్లో ఏ ట్రెండ్‌ను సెట్‌ చేయబోతున్నాయి? ఉద్యమంతో ఉరుముతున్న ఉత్తర తెలంగాణ ఈసారి ఎటువైపు మొగ్గుతుంది.. ఐదు జిల్లాల రాజకీయం ఏం చెబుతోంది? అని మూడుపార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఉత్తర తెలంగాణలో ఉన్న వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈసారి పట్టు దక్కేదెవరికి? పటుత్వం కోల్పోతున్నదెవో అనేది మరో పది రోజుల్లో తేలిపోనుంది.ఉద్యమాలతో ఉరిమి. పోరాటాలతో మెరుపులు మెరిపించిన ప్రాంతం ఉత్తర తెలంగాణలో పరిపుష్టమైన రాజకీయ చైతన్యం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో పట్టు నిలుపుకునేందుకు, ఉనికి కాపాడుకునేందుకు పార్టీలన్నీ చెమటొడుస్తున్నాయి. ఇంతకముందు కంటే వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని భావిస్తున్నాయి. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక ఖమ్మం మినహా మిగతా నాలుగు జిల్లాల్లో పట్టు నిలిపుకుంది. ఖమ్మంలో కేవలం ఒక్క సీటుతోనే సరిపుచ్చుకుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద వరంగల్‌లో 90 శాతం సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇక కాంగ్రెస్‌ 2014లో 8 స్థానాల్లో, 2018లో 12 స్థానాలతోనే సరిపుచ్చుకుంది. బీజేపీ 2014, 2018లో ఖాతా తెరువలేదు, 2021 ఉప ఎన్నికల్లో హుజూరాబాద్‌లో గెలిచింది. దీంతో ఇప్పుడు పట్టు కొనసాగించాలని బీఆర్‌ఎస్, పట్టు సాధించాలని కాంగ్రెస్, 5 నుంచి 8 స్థానాల్లో నెగ్గాలని బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఈమేరకు మూడు పార్టీలూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి.
ఉమ్మడి వరంగల్‌..
ఈ జిల్లా తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరిలూదిన నేల. బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌)కు కంచుకోటగా ఉన్న కాకతీయుల కోటలో మళ్లీ గులాబీ జెండా రెపరెపలాడించాలని కారు పార్టీ నేతలు కదంతొక్కుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో ఈసారి హోరాహోరీ పోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నా సర్వేల సారాంశంతో పార్టీలన్నీ గేమ్‌ప్లాన్‌ మార్చేశాయి. ప్రజలతో మమేకమవుతూ ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్, సంక్షేమ ఫలాల అమలును బీఆర్‌ఎస్‌… రెండు పార్టీల వ్యతిరేక పవనాలను కమలం… దృష్టిపెట్టాయి. 12 నియోజకవర్గాల్లో మూడు చోటల బహుముఖ పోటీ కనిపిస్తుంది. మిగిలిన చోట్ల ముఖాముఖి పోటీలున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా..
ఈ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పరిస్థితి అమీతుమీ అన్నట్టుగానే కనిపిస్తుంది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారైనా ఎక్కువ సీట్లు సాధించాలని బీఆర్‌ఎస్, పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్, ఖాతా తెరవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ముఖాముఖి పోటీనే ఉండే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వొద్దన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ పనిచేస్తోంది. మరి ఖమ్మం ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.
నిజామాబాద్‌ జిల్లా..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 9 నియోజకవర్గాల్లో ఢీ అంటే ఢీ అంటున్నాయి పార్టీలు. గత ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లాను క్లీన్ స్వీప్‌ చేసిన అధికార పార్టీ… మళ్లీ అవే ఫలితాలను తీసుకురావాలన్న వ్యూహంతో ఉంది. జిల్లాలో కారు స్పీడ్‌కు బ్రేక్‌ వేయాలన్నది హస్తం పార్టీ ఎత్తుగడ. ఇక పసుపు బోర్డు ప్రకటించిన నేపథ్యంలో ఈసారి 5 స్థానాల్లో పాగా వేస్తామని బీజేపీ నమ్మకంతో ఉంఇ. జిల్లావ్యాప్తంగా బీజేపీ పుంజుకుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఈ జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గంవైపు రాష్ట్రం మొత్తం చూస్తోంది. ఇక్కడి నుంచి సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో బీజేపీ చీల్చే ఓట్ల ప్రభావం ప్రధాన పార్టీలపైన పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పట్టు నిలుపుకోవడం బీఆర్‌ఎస్‌కు చాలా ముఖ్యం. ఈసారి పట్టు సడలితే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ కవిత ఎన్నికపై ప్రభావం చూపడం ఖాయం.
కరీంనగర్‌ జిల్లా..
ఇక మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన గడ్డ కరీంనగర్‌. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌లపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ మినహా, మిగతా 12 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో గెలుపుపై ధీమా లేదు. కరీంనగర్, హుజూరాబాద్, కోరుట్ల, చొప్పదండిలో బీజేపీ పట్టు నిలుపుకునే అవకాశం ఉంది. మంథని, ధర్మపురి, రామగుండం, పెద్దపల్లి, హుస్నాబాద్, మానకొండూర్, వేములవాడలో కాంగ్రెస్‌ బలం పెరిగింది. జగిత్యాల, సిరిసిల్లలో మాత్రమే బీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది.
ఆదిలాబాద్‌ జిల్లా..
ఉత్తర తెలంగాణలో చివరి జిల్లా… అడవుల ఖిల్లా ఆదిలాబాద్‌ జిల్లా. ఇక్కడి 10 నియోజకవర్గాల్లో అన్ని పార్టీలకు అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి. నిర్మల్, ముధోల్, బోథ్‌పై బీజేపీ పట్టు బిగించింది. ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌లో కాంగ్రెస్‌ విజయం దాదాపు ఖాయమన్న అభిప్రాయం ఉంది. సిర్పూర్‌లో బీఎస్పీ, బీఆర్‌ఎస్‌ మధ్య పోటీ నెలకొంది. ఇక ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి.మొత్తంగా ఈసారి ఉత్తర తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పట్టు సడలుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీపై వ్యతిరేకత కన్నా.. అభ్యర్థులపై వ్యతిరేకత ఆ పార్టీ ఓటమిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్‌కు ఈసారి ఉత్తర తెలంగాణ పట్టం కట్టే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ కూడా మంచి స్థానాలు సాధించే అవకాశం ఉంది.

Related Posts