YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

వేసవి వెళ్తే అంతే..

వేసవి వెళ్తే  అంతే..

మిషన్‌ కాకతీయ పధకం పనులు ఆగి.. సాగుతుండడంతో వరణుడు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. గత ఏడాదే ముందస్తుగా కురిసిన వర్షాలతో మూడో విడతలో చేపట్టిన పనులకు మోక్షం కలగలేదు. అక్కడక్కడ.. ఇప్పుడిప్పుడే మొదలవుతున్న నాలుగో విడత పనులు ఎప్పుడు పూర్తవుతాయోనన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. రాజపేట మండలం కుర్రారం గ్రామంలో మాదవులకుంట పనులు ఇటీవలే  ప్రారంభమయ్యాయి. ఇలా అనేక చోట పనులు ప్రారంభంలో జాప్యం జరుగుతుంది. పనుల వేగం పెంచితేనే ఫలితం చేకూరుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిషన్‌కాకతీయ నాలుగో విడతలో 220 చెరువులు ప్రతిపాదించారు. ఇందులో 149 పనులకు పరిపాలన ఆమోదం లభించగా 112 ప్రారంభించారు.

చెరువులను పునరుద్ధరించి భూగర్భ జలాల వృద్ధితోపాటు ఆయకట్టు స్థిరీకరణకు ఇప్పటి వరకు ప్రభుత్వం మూడు విడతల్లో పనులు చేపట్టింది. నాలుగో విడత పనులు ప్రారంభమయ్యాయి. కానీ అవి నత్తనడకన సాగుతున్నాయి. విడతల వారీగా ఎంపిక చేసిన చెరువులు, కుంటల్లో నిర్మాణాలకు గుత్తేదారుల నుంచి టెండర్లు ఆహ్వానించినప్పటికీ ముందస్తు ప్రణాళిక కొరవడటంతో నిర్ణీత సమయంలో పనులు పూర్తి కావడంలేదు. ఫలితంగా నాలుగు విడతలుగా సాగుతున్న పనులు పూర్తి స్థాయికి చేరుకోకపోవడం గమనార్హం. జిల్లాలోని 16 మండలాల్లో 1093 చెరువులున్నాయి. మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా నాలుగు విడతల్లో 932 చెరువుల్లో  పూడికతీత పనులు చేపట్టగా 632 మాత్రమే ఇప్పటివరకు పూర్తిచేశారు. మిగతా చెరువుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాలుగో విడతలో చేపట్టిన 149 పనుల్లో చిన్నకుంలే అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా మరి కొద్దిరోజుల్లో రోహిణీ కార్తె సమీపించనుంది. ఈ కార్తెలో ఎండలతోపాటు వర్షాలుకూడా పడే అవకాశం ఉంటుంది. చెరువులు, కుంటల్లోకి నీరు చేరితే పనులకు అడ్డంకిగా మారి గత తప్పిదాలే పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఆ విషయమై అధికారులు, గుత్తేదారులను పురమాయించాల్సిన అవసరం ఉంది. చెరువుల్లో తీసిన మట్టి పంటపొలాల్లో వేసుకోవడం ద్వారా భూసారం పెరుగుతుంది. దిగుబడులు ఎక్కువగా వస్తాయి. తూములు, అలుగులు, చెరువుల కట్టలు మరమ్మతులతో నీటి లీకేజీని అరికడుతున్నారు. ఆయకట్టు స్థిరీకరించే ఉద్దేశంతో చేపట్టిన పనులు నెమ్మదిగా సాగడం గమనార్హం. పనులు వేగంగా సాగేలా అధికారులు గుత్తేదారులపై ఒత్తిడి తేవాల్సి ఉంది.

రెండో విడత చెరువు పునరుద్ధరణ పనులు ఆలస్యంగా మొదలు పెట్టడంతో వర్షాలు కురిశాయి. దీంతో చెరువుల్లోకి నీరు చేరడంతో పనులకు అడ్డంకిగా మారింది. పూడికతీత పనులతోపాటు చెరువు అలుగు, తూములు, కట్టవెడల్పు పనులు నిలిపివేయాల్సి వచ్చింది. ముందస్తుగానే చెరువుల్లోకి నీళ్లు రావడంతో ఎంబీ రికార్డులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యతాప్రమాణాలు తనిఖీచేసే అవకాశం లేకుండా పోతోంది. మూడోవిడత పనుల నిలిపివేతకూ వర్షమే అడ్డు పడింది. ముందస్తు ప్రణాళికలు లేకుండా ఆలస్యంగా పనులు చేపట్టడంతోనే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని రైతన్నలంటున్నారు. నాలుగో విడతలోనైనా టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు నిర్ణీత సమయంలోగా నాణ్యతగా పనులను పూర్తిచేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. వర్షాకాలం సమీపించే తరుణం ఆసన్నమైనందున చేపడుతున్న పనుల్లో నాణ్యత కొరవడే అవకాశం ఉంది.ఈవిషయమై సంబంధిత శాఖ అధికారులు తరచూ తనిఖీలు చేపట్టి నిర్మాణాల్లో ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన అవసరం ఉంది.

Related Posts