YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

లక్ష్యం నేరవేరని హరితహారం

లక్ష్యం నేరవేరని హరితహారం

హరితహారం కార్యక్రమంలో భాగంగా మూడు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పెద్దఎత్తున మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. గత సంవత్సరం ఉమ్మడి జిల్లాలో లక్ష్యాన్ని మించి మొక్కలను నాటారు. ఇదే విధంగా ఈ ఏడాది వానాకాలంలో ప్రారంభించనున్న నాలుగోవిడతలో సైతం లక్ష్యాన్ని మించి మొక్కలను నాటాలనే సంకల్పంతో నర్సరీలను ఏర్పాటు చేశారు. కానీ వాటి నిర్వహణలో అధికారుల వైఫల్యం కనపడుతోంది. రోజురోజుకు ఎండతీవ్రత పెరుగుతుండడంతో నర్సరీలలోని మొక్కలు వాడిపోతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయ  కార్యాచరణను రూపొందించకపోవడం గమనార్హం. దీనికి తోడు నర్సరీలలో మొక్కలకు నీటిని పంపింగ్‌చేసే కూలీలకు నాలుగు నెలల నుంచి వేతనాలు నిలిచిపోయాయి. దీంతో మొక్కల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా యంత్రాంగం అంతా రైతుబంధు పథకంలో నిమగ్నం కావడంతో నర్సరీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఈ ఏడాది వర్షాలు ముందుగా కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ముందుగా వర్షాలు కురిస్తే మొక్కలు నాటాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా మొక్కలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలోని నర్సరీలలో ఇపుడిపుడే విత్తనాలు విత్తుతున్నారు. దీంతో ఈ ఏడాది మొక్కల పెంపకం లక్ష్యానికి అనుగుణంగా సాగేలా కనిపించడంలేదు.

చెట్లను నరికివేయడంతో అడవుల విస్తీర్ణం తగ్గింది. అడవుల్లో ఉండాల్సిన కోతులు జనావాసాల్లోకి ప్రవేశించాయి. దీంతో పల్లె, పట్టణం అనే తేడాలేకుండా వానర సైన్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంటపొలాలను నాశనం చేయడమే కాకుండా గృహాల్లోకి ప్రవేశించి నానా హంగామా సృష్టిస్తున్నాయి. కోతులు వాపస్‌ పోవాలి వానలు వాపస్‌ రావాలి అంటే రాష్ట్రంలో విరివిగా మొక్కల పెంపకం చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది ప్రధానంగా టేకుమొక్కలతో పాటు పూలు, పండ్ల మొక్కలను పెద్ద ఎత్తున పంపిణీచేసేందుకు నర్సరీలలో మొక్కలను పెంచుతున్నారు. ఉమ్మడిజిల్లాలో గ్రామీణాభివృద్థి సంస్థతో పాటు అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేశారు. ఈ రెండింటిలో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టి కూలీలకు వేతనాలను చెల్లిస్తున్నారు.

గతంలో స్థానికంగా దొరికే విత్తనాలను తీసుకుని మొక్కలను పెంపకం చేపట్టేవారు. దీనికి భిన్నంగా ఉద్యాన క్షేత్రాలు, పరిశోధన క్షేత్రాల నుంచి పంపిణీ చేసిన నాణ్యమైన విత్తనాలతో మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా నర్సరీలకు విత్తనాలను సరఫరా చేశారు. దీంతో పాటు నర్సరీ నిర్వహణ చేపట్టే అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది ప్రధానంగా సేంద్రియ ఎరువులను వినియోగించి మొక్కల పెంపకం చేపట్టాలని నిర్దేశించారు. ఇందుకు గాను ప్రతి నర్సరీకి ప్రత్యేకంగా నిధులను విడుదల చేశారు. ప్రధానంగా నాణ్యమైన మట్టిని సంచులలో నింపి అందులో మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. దీనికోసం వినియోగించే మట్టిని భూసార పరీక్షలు నిర్వహించి నాణ్యమైనదైనదేనని తేలితేనే వినియోగించాలన్నారు. దీనితో పాటు ప్రతి నర్సరీలో మొక్కలకు నీటిని పంపింగ్‌ చేసేందుకు సరిపడా సిబ్బందిని నియమించాలి. వారితో పాటు మొక్కలలో కలుపు నివారణకు ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసి వెనువెంటనే తొలగించాలి. మొక్క నాణ్యంగా ఉంటేనే తొందరంగా నాటుకోవడంతో పాటు ఏపుగా పెరుగుతుంది. దీంతో ప్రభుత్వలక్ష్యం నెరవేరుతుంది.

ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నర్సరీలలో మొక్కల పెంపకం జరగడం లేదు. ఈ ఏడాది సైతం స్థానికంగా లభించే విత్తనాలనే మొక్కల పెంపకానికి వినియోగిస్తున్నారు. దీనికి తోడు భూసార పరీక్షలు చేయకుండానే అందుబాటులోని ఎర్రమట్టిని వినియోగించి మొక్కల పెంపకం చేపడుతున్నారు. సేంద్రియ ఎరువు అంటే కేవలం పశువుల పేడను మాత్రమే వినియోగిస్తున్నారు. నిబంధనలకు రెండు దఫాలుగా మొక్కలకు నీటిని పంపింగ్‌ చేయాల్సి ఉండగా కూలీల కొరతతో నీటిని ఒకే దఫా చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని చిన్నమల్లారెడ్డిలో అటవీశాఖ ఏర్పాటు చేసిన నర్సరీలో కూలీల కొరతతో కొన్ని మొక్కలకు నీటిని పంపింగ్‌ చేయకుండా వదిలేస్తుండడంతో ఎండపోయే దశకు చేరుకున్నాయి. ఈ నర్సరీపై ఉన్నతాధికారుల పర్యవేక్షణకు తోడు స్థానిక అధికారుల పర్యవేక్షణ కరవవయింది.

మొక్కల పెంపకం కేంద్రాల్లో పనిచేస్తున్న ఉపాధికూలీలకు గత నాలుగు నెలల నుంచి వేతనాలు అందడంలేదు. దీంతో వారు వేతనాలు వస్తాయో రావో అనే మీమాంసతోనే విధులు నిర్వహిస్తున్నారు. వేతనాల పంపిణీ సక్రమంగా లేకపోవడంతో మొక్కల చుట్టూ ఉన్న కలుపు మొక్కలను తొలగించడంలేదు. రోజరోజుకు ఎండలు మండుతుండడంతో నర్సరీల్లో మొక్కలు వాడిపోతున్నాయి. మొక్కలను సూర్యరశ్మినుంచి కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా అటవీశాఖ అధికారులు ప్రత్యామ్నాయంగా గ్రీన్‌నెట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కానీ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేసి మమ అనిపించారు. నర్సరీలపై ప్రత్యేకంగా అధికారుల పర్యవేక్షణ కరవవడంతో సిబ్బందికి తోచినతీరుగా చేస్తున్నారు.

Related Posts