న్యూఢిల్లీ, డిసెంబర్ 2,
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్ష ఫలితాలకు సంబంధించి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక ప్రకటన చేసింది. ఇకపై 10, 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో భాగంగా ఎటువంటి డివిజన్, డిస్టింక్షన్ ప్రకటించబోమని తెలిపింది. వీటితోపాటు మార్కుల శాతాన్ని కూడా వెల్లడించమని స్పష్టంచేసింది. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లో మార్కుల శాతాన్ని గణించే విధానం గురించి తెలియజేయాలంటూ కొందరు విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై సీబీఎస్‌ఈ ఈ విధంగా స్పందించింది. ఒకవేళ విద్యార్థి ఐదు కంటే ఎక్కువ సబ్జెక్టులను ప్రస్తావిస్తే.. వాటిలో 5 ఉత్తమ సబ్జెక్టులను గుర్తించడంపై సదరు ఇన్‌స్టిట్యూట్ లేదా నియామక సంస్థ నిర్ణయం తీసుకోవచ్చని సీబీఎస్‌ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యమ్ భరద్వాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్య కోెసం ఆ వివరాలు అవసరమని భావిస్తే.. ఆ విద్యార్థి చదివిన విద్యా సంస్థ ఆ మార్కులు, మార్కుల శాతం, డిస్టింక్షన్ తదితర వివరాలను అందిస్తుందని తెలిపింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు సీబీఎస్‌ఈ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసే విద్యార్థుల మార్కుల శాతాన్ని గణించే పద్ధతిని వివరించాలని సీబీఎస్ఈ కి పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. దాంతో, ఈ వివరాలను సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్ డాక్టర్ సన్యాం భరద్వాజ్ అధికారిక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. సీబీఎస్‌ఈ బైలాస్‌లో సబ్‌సెక్షన్ 40.1 చాప్టర్7 ప్రకారం విద్యార్థులకు డివిజన్, డిస్టింక్షన్ లేదా అగ్రిగేట్ ఇవ్వకూడదని నిర్దేశిస్తుంది. దీనిపై విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-22509256-59, 22041807-08 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. ఇదిలా ఉండగా.. వచ్చేఏడాది(2024) నిర్వహించనున్న సీబీఎస్‌ఈ 10, 12వ పరీక్షలకు సంబంధించిన డేటా షీట్(పరీక్షల షెడ్యూలు) విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే పరీక్షల షెడ్యూలులోపాటు, ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూలును కూడా ప్రకటించనున్నారు. విద్యార్థులు పరీక్షల వివరాలను తెలుసుకునేందుకు క్రమం తప్పకుండా వెబ్‌సైట్ చూడాలని అధికారులు సూచించారు.విద్యార్థుల మార్కులకు సంబంధించి డివిజన్లు, డిస్టింక్షన్లను ప్రకటించకూడదని సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయాన్ని విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయం నూతన విద్యా విధానం లో భాగంగా సీబీఎస్ఈ తీసుకుంది. ఈ నిర్ణయం విద్యార్థులపై విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించడంతో పాటు, వారిని సమగ్ర విద్యా సముపార్జన దిశగా ప్రోత్సహిస్తుంది. పరీక్షలు, మార్కుల ఒత్తిడి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావం గణనీయమైనదని, సీబీఎస్ఈ తీసుకున్న తాజా నిర్ణయంతో విద్యార్థులపై ఒత్తిడి చాలావరకు తగ్గుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు.మరోవైపు, ఈ నిర్ణయం విద్యార్థుల్లో పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థుల్లో పోటీతత్వం దెబ్బతినడం, అధిక మార్కులు సాధించాలన్న స్ఫూర్తి కొరవడడం, మంచి ఫలితాలు సాధించి గుర్తింపు పొందే అవకాశం లేకపోవడంతో ఆసక్తి తగ్గిపోవడం.. వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.2020 జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా.. సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదా కమిటీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రెండు టర్ముల్లో పరీక్షలను సీబీఎస్‌ఈ 12వ తరగతిలో నిర్వహించే విధానం మళ్లీ రానుంది. గత సంవత్సరం 10, 12 తరగతుల వార్షిక ఫలితాల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 11, 12 తరగతుల కోసం ప్రస్తుతం పాఠ్యాంశాలను సైన్స్, ఆర్ట్స్/హ్యుమానిటీస్, కామర్స్‌లుగా విభజిస్తున్న క్రమంలో.. ఈ విధానాన్ని తొలగించాలని కమిటీ ప్రతిపాదించింది. ఇలా బోర్డు పరీక్షలో తొలి సంస్కరణను 2005లో చేపట్టారు. మళ్లీ 2009లో పదో తరగతికి సీసీఈ (కంటిన్యువస్, కాంప్రెహెన్సివ్ ఎవల్యూషన్) విధానాన్ని ప్రవేశపెట్టారు. 2017లో మళ్లీ.. ఇలాంటి విధానాన్ని తొలగించి మళ్లీ పాత విధానాన్నే అమలు చేశారు. కరోనా సందర్భంగా.. 10, 12 తరగతుల వార్షిక పరీక్షలను ఏడాదికి రెండు విడతలుగా నిర్వహించారు. మళ్లీ గతేడాది నుంచి ఒకే పరీక్ష నిర్వహించేలా పాత పద్ధతిని అమలు చేశారు. గణితం అంటే విద్యార్థులకు భయం ఉంటుంది.