విజయవాడ
బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను కోస్తాంధ్రపై పడగ విప్పనుంది. రాయలసీమలోనూ పెను ప్రభావం చూపనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం శుక్రవారం రాత్రి నెల్లూరుకు ఆగ్నేయంగా 790, బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 860, మచిలీపట్నానికి దక్షిణ
ఆగ్నేయంగా 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ శనివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తుపానుగా బలపడుతుంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 4వ తేదీకి దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుకుంటుంది. అనంతరం ఉత్తర దిశగా కదులుతూ ఐదో తేదీ ఉదయం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.