YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రతిపక్ష నేత ఎవరు..?

ప్రతిపక్ష నేత ఎవరు..?

హైదరాబాద్, డిసెంబర్ 5,
తెలంగాణ ఎన్నికలు మగిశాయి. పదేళ్ల తర్వాత కారు జోరుకు తెలంగాణ ప్రజలు బ్రేకు వేశారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా  బీఆర్ఎస్ పదేళ్లపాటు హవా చూపించగా... ఈ ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను గుర్తించి ప్రజలు పట్టం కట్టారు. ఇక తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా  రేవంత్ రెడ్డి ఉండగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లతో అధికార పీఠం దక్కించుకోగా, బీఆర్ఎస్  39 సీట్లకు పరిమితమై ప్రతిపక్షహోదా దక్కించుకుంది. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎవరికి బీఆర్ఎస్ పట్టం కట్టనుందన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో పోటీ చేసి గజ్వేల్ నుంచి గెలుపొందగా, కామారెడ్డిలో ఓడిపోయారు. గజ్వేల్ లో కేసీఆర్ 45,031 ఓట్ల మెజార్టీతో విజయ సాధించారు. ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నుంచి పోటీ చేసి 29,687 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు సిద్దిపేట నుంచి 82,808  ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ క్రమంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారన్న అంశం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది.గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004లో టీఆర్ఎస్ పార్టీ 26 స్థానాలు గెల్చుకుంది. కేసీఆర్ మాత్రం ఆ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. దీంతో  పార్టీ శాసనసభా పక్ష నేతగా జి.విజయరామారావు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ పది స్థానాలల్లో గెలిచింది. అప్పుడు పార్టీ ఎల్పీ లీడర్ గా ఈటల రాజేందర్ ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయంసాధించి అధికార పీఠం దక్కించుకుంది. శాసన సభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నికై, ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు పాలన సాగించారు. అయితే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉండేందుకు అంగీకరిస్తారా..?లేదా.. పార్టీలో మిగతా సీనియర్లకు  ఆ బాధ్యతలు అప్పగిస్తారా అన్న విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాల అనంతరం డీలా పడ్డ బీఆర్ఎస్ నేతలంతా గప్ చుప్ గా ఉన్నారు.  ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, కవిత మాత్రం ప్రజా తీర్పుకు అనుగుణంగా పని చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ ప్రగతి భవన్ ను ఖాళీ చేసి తన ఫాం హౌస్ కు వెళ్లిపోయారు. అయితే ఇవాళ  గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో, పోటీ చేసిన అభ్యర్థులతో కేటీర్ సమావేశమయి ఓటమిపై విశ్లేషణ, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అయితే పార్టీ ఎల్పీ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది. ఎల్పీ  లీడర్ ఎన్నికపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే రేవంత్ రెడ్డి సీఎంగా, అసెంబ్లీ శాసన సభాపక్షనేతగా ఉండగా, పదేళ్ల పాటు సీఎంగా పని చేసిన కేసీఆర్ ఎల్పీ లీడర్ గా ఉండే అవకాశం లేదని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం, మాట్లాడనివ్వకుండా అడ్డుపడటం వంటి సంఘటనల దృష్ట్యా అసెంబ్లీలో పలుచన కాకుండా ఉండాలంటే కేసీఆర్ వంటి సీనియర్ రాజకీయ నేత ఆ బాధ్యతలు చేపట్టకపోవడమే మంచిదన్న అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో రేవంత్ ప్రతీకార చర్యలు చేపడితే తమ పార్టీ అధినేత అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆ దిశగా పార్టీ అధినేత నిర్ణయాలు ఉండవని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కే శాసన సభా పక్ష నేత బాధ్యతలు అప్పగించవచ్చన్న ఉహాగానాలు గులాబీ పార్టీలో మొదలయ్యాయి. ఎన్నికల్లో పార్టీ నేతల అభ్యర్థుల కోసం 70 రోడ్ షోలు, 30 బహిరంగ సభల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేలను నడిపిండే బాధ్యతను కేసీఆర్ కేటీఆర్ కే అప్పగిస్తారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో పార్టీ పటిష్టం చేయడంతో పాటు, పార్టీలో తన వారసుడిగా కేటీఆర్ స్థానం మరింత బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా కేసీఆర్ నిర్ణయం ఉండవచ్చని, అందులో భాగంగా బీఆర్ఎస్ ఎల్పీ బాధ్యతలు కట్టబెట్టవచ్చని చెబుతున్నారు. అయితే  కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గాను, శాసన సభలో ఫ్లోర్ లీడర్ వంటి రెండు కీలక బాధ్యతలు అప్పగిస్తే, ఒకే వ్యక్తికి రెండు పదవులు ఇవ్వడం విమర్శలకు తావిస్తుందేమోనన్న చర్చ జరుగుతోంది. అయితే ప్రాంతీయ పార్టీల్లో ఇదంతా సర్వసాధారణమేనని కేటీఆర్ కు ఎల్పీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో వ్యవహరించే తీరుతో కేటీఆర్ మరింత గట్టి నాయకుడిగా ఎదుగుతాడని చెబుతున్నారు.పార్టీలో సీనియర్ గా, ట్రబుల్ షూటర్ గా, సీనియర్ మంత్రిగా, అసెంబ్లీలో పలు మార్లు అధికార పక్షంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా   ఆయా పార్టీలను ఇరుకనపెట్టగల నేతగా హరీష్ రావుకు పేరుంది.కేసీఆర్ తర్వాత పార్టీలో సీనియర్ లీడర్ గా ఆయనకు గౌరవం ఉంది.  ఈ ఎన్నికల్లో హరీశ్ రావు 59 పైగా నియోజకవర్గాల్లో 80 వరకు ప్రచార సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రచారం నిర్వహించారు. వర్కింగ్ ప్రసిడెంట్ గా కేటీఆర్ ఉన్నందున, ఎల్పీ పదవి హరీశ్ రావుకు దక్కే అవకాశాలను కొట్టిపారేయలేమని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీలో దీటుగా రేవంత్ రెడ్డిని ఎదుర్కోగల శక్తి హరీశ్ రావుకుందని, కేసీఆర్ ఛాయిస్ హరీశ్ రావు కావచ్చని చెబుతున్నారు. అయితే ఇప్పటికే  ఈ  ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు రావడంతో అటు వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కు, శాసన సభలో ఎల్పీ లీడర్ గా హరీశ్ రావు కు అప్పగిస్తే.. పార్టీలో ఇతరులెవరికీ కీలక పదవులు ఇవ్వరా అన్న విమర్శలు తప్పవన్న చర్చ ఉంది.  ఇదే అంశంపై అధికార కాంగ్రెస్ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని కారు పార్టీ నేతలు చెబుతున్నారు. రెండు కీలక పదవులు తన కుటుంబంలో వ్యక్తులకే కట్టబెట్టరన్న అపప్రదను బీఆర్ఎస్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే హరీశ్ రావు లాంటి దూకుడైన వ్యక్తే ప్రతిపక్ష నేతగా ఉంటే, రేవంత్ రెడ్డి స్పీడుకు అడ్డుపడుతుందన్న భావన వ్యక్తమవుతోంది.పార్టీలో  కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు కాకపోతే మరెవరికి ఈ ఛాన్స్ దక్కవచ్చని బీఆర్ఎస్ నేతలు లెక్కలు వేస్తున్నారు. గతంలోను  దళిత వర్గానికి చెందిన విజయరామారావుకు, ఆ తర్వాత బీసీ నేత ఈటల రాజేందర్ కు ఎల్పీ లీడర్ గా అవకాశం ఇచ్చిన కేసీఆర్ డిప్యూటీ ఎల్పీలీడర్ గా హరీశ్ రావును ఎంపిక చేశారు. ఈ దఫా అలానే  బీసీ లేదా దళిత, మహిళా ఎమ్మెల్యేలకు ఆ  అవకాశం ఇస్తారా అన్నది వేచి చూడాలి. అయితే ప్రతిపక్ష నేతగా ఉండే వ్యక్తి కచ్చితంగా పార్టీని అసెంబ్లీలో నడపాల్సి ఉంటుంది కాబట్టి ఆ కీలకమైన పదవిని సమర్థతను బట్టే దక్కవచ్చని గులాబీ నేతలు చెబుతున్నారు.

Related Posts