YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్.. దారెటు...

కేసీఆర్.. దారెటు...

హైదరాబాద్, డిసెంబర్ 5,
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందడుగు వేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగువేసిన తరువాత కేసీఆర్ వెంటనే ఫాం హౌస్ కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆయన గత పదేళ్లుగా ప్రగతి భవన్ వేదికగా ప్రజా పాలన నిర్వహించారు. టీఆర్ఎస్ గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ గా మారిందని, ఇప్పుడిక దేశ రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని బాగు చేద్దామని గతంలో పలుసార్లు చెప్పారు. కానీ తెలంగాణలో అధికారం రాకపోయేసరికి ఇప్పుడిక కేసీఆర్ ఏం చేస్తాడు? ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు? అని తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఓటమెరుగని కేసీఆర్ మొదటిసారి కామారెడ్డిలో ఓడిపోయారు. దీంతో కేసీఆర్ గురించి సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడుతామనుకొని కనీస సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. అయితే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో కాకుండా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. అందుకు ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు తెలుపుతున్నారు. దేశ రాజకీయాల్లో ప్రవేశించడానికి టీఆర్ఎస్ గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడికి వెళ్లినపపుడు పలువురు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇంతలో తెలంగాణలో ఎన్నికలు రావడంతో ఇక్కడ గెలిచిన తరువాత రాష్ట్ర బాధ్యతలను కుమారుడు కేటీఆర్ కు అప్పజెప్పనున్నట్లు అప్పట్లోప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అధికారం చేజారినా బీఆర్ఎస్ రాష్ట్ర బాధ్యతలు కేటీఆర్ కు ఇస్తారని అంటున్నారు. ఆయననే సీఎల్ పీ నేతగా ఎన్నుకొని శాసనసభకు పంపనున్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఆ తరువాత పార్లమెంట్ లో అడుగుపెట్టి అక్కడి నుంచే రాజకీయాలను శాసించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు జాతీయ నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకున్న ఆయన ఇప్పుడు ప్రత్యేకంగా దేశ రాజకీయాలపైనే దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తెచ్చుకొని 2024లో ఏర్పడే ప్రభుత్వంలో కీలక ఉండేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు. గతంలో వీలైనన్ని ఎంపీ సీట్లు తెచ్చుకుకొని ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ప్రధాని పదవి కోరనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నో సార్లు దేశంలో కూడా అధికారంలో ఉండి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంట గెలవలేదు గానీ...
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అప్పుడే సమాజంలో గౌరవం, అనుకున్నది సాధించగలుగుతాము. ఈ విషయం తెలిసిన వారే సక్సెస్ అవుతారు. ఏ రంగంలో ఉన్న విజయం పొందగలుగుతారు. అయితే తాజాగా కెసిఆర్ విషయంలో ఇదే తరహా చర్చ నడుస్తోంది. ఆయన జాతీయ రాజకీయ ప్రకటనల విషయంలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితిని  ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. తనకు సెంటిమెంట్ గా కలిసి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని కేసీఆర్ భావించారు. తెలంగాణలో 16 సీట్లు… మహారాష్ట్రలో పాతిక సీట్లు సాధిస్తే 40 సీట్లు వస్తాయని.. ఏకంగా ఢిల్లీలో చక్రం తిప్పవచ్చని భావించారు. దేశం మొత్తం తిరిగి హడావిడి చేశారు. కానీ ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయారు. ఇంట గెలవలేకపోయారు. మరి రచ్చ ఎలా గెలుస్తారో అన్నది ఆయనకే ఎరుక. కెసిఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే అదో చరిత్రే. జాతీయస్థాయిలో కేసీఆర్ పేరు మార్మోగిపోయేది. జాతీయ రాజకీయాలు ఆయనను సాదరంగా ఆహ్వానించేవి. దేశవ్యాప్తంగా ఒక క్రేజ్ తెచ్చి పెట్టేవి. భారత రాష్ట్ర సమితిలో చేరికలు కూడా పెరిగేవి. ఉత్తరాది రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరించి ఉండేది. కానీ ఈ చర్యలను తెలంగాణలో ఓటమి బ్రేక్ చేసింది. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ ప్రవేశం కంటే.. ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడమే కేసిఆర్ ముందున్న కర్తవ్యం. సభా నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉంటే.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరించి అవకాశాలు చాలా తక్కువ. ఈ సమయంలో కెసిఆర్ జాతీయ రాజకీయాలు చేయాలంటే సాహసంతో కూడుకున్న పని. ఇప్పుడున్న కూటమిలు జాతీయ పార్టీల నేతృత్వంలోనే నడుస్తున్నాయి. ఈ లెక్కన కాంగ్రెస్, బిజెపి కింద పని చేయాల్సి ఉంటుంది. అలాగని కెసిఆర్ ప్రత్యేక కూటమి తయారు చేసే అవకాశమే లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ఒక ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి.. పార్లమెంటులో అడుగుపెట్టడమే కేసీఆర్ ముందున్న ఏకైక మార్గం. రాష్ట్రంలో కుమారుడు కేటీఆర్ కు ప్రతిపక్ష నేత పదవి ఇచ్చి.. తాను కేంద్రం బాట పట్టడమే ఏకైక మార్గం. అంతకుమించి జాతీయ రాజకీయాలు చేయడం అంటే ఆత్మహత్య సదృశ్యమే. ఇక తేల్చుకోవాల్సింది కేసీఆరే.

Related Posts