భోపాల్ డిసెంబర్ 5
తప్పక గెలుస్తామనుకున్న మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నది. సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, అధికార మార్పు తప్పదని ఆ పార్టీ తొలి నుంచి చెబుతూ వచ్చింది. తిరుగులేని మెజార్టీతో తాము ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోనున్నామని స్పష్టం చేసింది. ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వచ్చాయి. తీరా చూస్తే బీజేపీకి వచ్చిన సీట్లలో సగం కూడా హస్తం పార్టీకి రాకపోవడంతో ఆశలు అడియాశలయ్యాయి. దీంతో ఈసారి మనదే అధికారమని, బీజేపీ సర్కార్‌పై జనాల్లో తీవ్ర అసంతృప్తి ఉందని నమ్మిస్తూ వస్తున్న మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆయన వల్లే పార్టీకి కోలుకోలేనివిధంగా దెబ్బ తగిలిందని నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని పార్టీ అధిష్ఠానం ఆయనను కోరినట్లు వార్తలు వస్తున్నాయి.సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై ప్రజా వ్యతిరేకతకుతోడు తమ ప్రభుత్వాన్ని కూలదోశారనే సానుభూతి తోడవుతుందనే నమ్మకంతో ప్రచారం కూడా సరిగా నిర్వహించలేదని పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ నిర్వహించినన్ని సభలు కూడా ఏర్పాటు చేయలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కలుపుకుపోకుండా కమల్‌నాథ్ ఏకపక్షంగా వ్యవహరించారని, దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడటంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. బీజేపీ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపలేకపోయారని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కూడా చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆయన కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని చెబుతున్నారు.ఇక గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో పార్టీ పగ్గాలు కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ వద్దే ఉన్నాయని.. వారిద్దరు 70 ఏండ్ల వయస్సు దాటిపోయారని, ఇప్పటికైనా వారిని నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో వలే యువ నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని అప్పుడే పార్టీకి పూర్వవైభవం వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం కమల్‌నాథ్‌ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని కోరినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈనేపథ్యంలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కమల్‌నాథ్ కలువనున్నారని తెలుస్తున్నది. ఇండియా కూటమి సమావేశం సందర్భంగా ఖర్గేతో ఆయన సమావేశమవుతారని వార్తలు వస్తున్నాయి.ఈ నెల 3న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని 230 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ 66 చోట్ల మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో అధికారం వస్తుందని అనుకున్నచోట మరోసారి ప్రతిపక్షానికి పరిమితమైంది.