విజయవాడ, డిసెంబర్ 6,
జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ తెలుగు రాజకీయాల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయాలపై మంచి పట్టున్న సంగతి అందరికి తెలిసింది. 2009 ఎన్నికల సమయంలో తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రచారం కూడా నిర్వహించారాయన. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. కాకపోతే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడం.. ఆ తరువాత టీడీపీలో చోటు చేసుకున్న అంతర్గత కలహాలతో ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన కెరీర్ మీదనే దృష్టిని సారించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే సినిమాలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయనకు రాజకీయాలపై మంచి అవగాహన ఏ మాత్రం చెక్కు చెదరలేదు. జూనియర్ కి పాలిటిక్స్ పై మంచి నాలెడ్జ్ ఉందని, ప్రస్తుత రాజకీయాలను ఆయనెంతో శ్రద్ధగా గమనిస్తుంటాడని సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. అంతే కాదు గత కొంత కాలంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా అంచనా వేస్తున్నారని ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట.తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జూనియర్ ఎన్టీఆర్ ముందుగానే చెప్పారట. ఆయన చెప్పినట్టుగానే డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని చాలా రోజుల కిందటే జూనియర్ అన్నారట. ఆయన అంచనా వేసినట్టుగానే తెలంగాణలో హస్తం పార్టీ జెండా ఎగురవేయడంతో తారక్ సన్నిహితులు షాక్ అయ్యారట. అంతే కాదు ఇప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. ఎందుకంటే ఈసారి ఏపీలో టీడీపీదే అధికారమని ఇప్పటికే తన వాళ్ళతో ఎన్టీఆర్ ఎంతో నమ్మకంగా చెప్పారట. దీంతో తమిళనాడు, తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా జూనియర్ చెప్పిన ఫలితమే వస్తుందని సన్నిహితులు భావిస్తున్నారట. కాగా తారక్ అంచనా వేసినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంతో, ఆ ఆనందంలో ఆయన సన్నిహితులు ఈ విషయాన్ని వారి స్నేహితులతో పంచుకోగా, ఇది సోషల్ మీడియా ద్వారా బయటకు లీకైంది.జూనియర్ కొంతకాలంగా తెలుగుదేశానికి దూరంగా ఉంటున్నాడు. తెలుగుదేశం శ్రేణులు సైతం కొన్ని విషయాల్లో తారక్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాంటిది ఏపీలో తెలుగుదేశం పార్టీదే అధికారమని ఎన్టీఆర్ తన సన్నిహితులతో చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన మళ్ళీ తెలుగుదేశానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడా అనే అనుమానం కూడా వ్యక్తమౌతోంది. జూనియర్ ఉద్దేశం ఏదైనప్పటికీ ఏపీ విషయంలో ఆయన చెప్పిన జోస్యం నిజమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుత జగన్ సర్కార్ పై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అని ఎదురు చూస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఈసారి తెలుగుదేశమే గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత రాజకీయాలను ఎప్పటికప్పుడు దగ్గరగా గమనించే ఎన్టీఆర్ వంటి వ్యక్తి ఈమాత్రం అంచనా వేయడం పెద్ద విషయమేమీ కాదు.