YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మూడు రాష్ట్రాల్లో కొత్త సీఎంలు

మూడు రాష్ట్రాల్లో కొత్త సీఎంలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 6,
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో  మూడు చోట్ల ఘన విజయం సాధించింది బీజేపీ. కాంగ్రెస్ ఖాతాలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌నీ కైవసం చేసుకుంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్‌లోనూ మరోసారి అధికారంలోకి వచ్చింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు  జరగనున్నాయి. సరిగ్గా వీటి ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలనూ తలకిందులు చేసి బీజేపీ భారీ మెజార్టీ సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థులపైనే మేధోమథనం జరుగుతోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ  ఇప్పటికే కీలక అభ్యర్థులతో సమావేశమయ్యారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు చర్చించారు. ఈ సమావేశంలో మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి రేస్‌లో ఉన్న అభ్యర్థులతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల పార్టీ ఇన్‌ఛార్జ్‌లతోనూ సమావేశమయ్యారు అమిత్‌షా, జేపీ నడ్డా. అయితే...బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా పరిశీలకులను నియమించనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఈ పరిశీలకులు సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ తరవాత ముఖ్యమంత్రి అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మధ్యప్రదేశ్‌కి ఇప్పటి వరకూ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే..ఈ సారి ఆయనకు పోటీగా పలువురు కేంద్రమంత్రులు ఈ రేస్‌లో ఉన్నారు. ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్‌తో పాటు కైలాశ్ విజయ్‌వర్గియ కూడా పోటీ పడుతున్నారు. ఇక రాజస్థాన్‌లోనూ ముఖ్యమంత్రి రేస్‌లో చాలా మందే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్‌ బీజేపీ ప్రెసిడెంట్ సీపీ జోషి, దియా కుమారి, మహంత్ బాలాకాంత్ రేసులో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా కనిపిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ సావో, ప్రతిపక్ష నేత ధరమలాల్ కౌశిక్, మాజీ IAS అధికారి ఓపీ చౌదరి కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే..హైకమాండ్ మాత్రం ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. మరికొద్ది రోజుల్లో ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశముంది.

Related Posts