విజయవాడ, డిసెంబర్ 7,
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, ఉమ్మడి కార్యాచరణపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై నవంబర్ 4న చంద్రబాబు, పవన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టోపై ఇరుపార్టీలు కసరత్తు చేస్తున్నాయి. తరచూ భేటీ అయి పొత్తును ముందుకు తీసుకెళ్లేలా ఇరువురు నేతల గతంలో నిర్ణయించారు. ఈ నేపథంలో ఇవాళ మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై విడుదలైనప్పుడు పవన్ కల్యాణ్...వరుణ్ తేజ్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లారు. దీంతో అప్పట్లో పవన్ చంద్రబాబును కలవలేకపోయారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఆయనతో భేటీ అయిన పవన్... పొత్తుపై సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబు బెయిల్ పై విడుదలైన తర్వాత నవంబర్ 4న కలిసి పరామర్శించారు పవన్. తాజాగా ఇప్పుడు మరోసారి భేటీ అయిన పవన్, చంద్రబాబు...ఏపీ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే మార్చిలోనే సాధారణ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న సమాచారం.. టీడీపీ, జనసేన కూటమి చేపట్టాల్సిన ఉమ్మడి కార్యాచరణ, సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభలో పవన్ పాల్గొనే విషయంలో ఈ భేటీ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల తక్కువ సమయం ఉండడంతో... టీడీపీ, జనసేన ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యాచరణపై చంద్రబాబు, పవన్ చర్చించినట్లు తెలుస్తోంది