YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పొంగులేటి..తొడకొట్టి మరీ సాధించారు

పొంగులేటి..తొడకొట్టి మరీ సాధించారు

ఖమ్మం, డిసెంబర్ 8,
పదేళ్ల రాజకీయ నేపథ్యం ఆయన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది. 2013లో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2023లో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం.ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో 1965 అక్టోబర్ 28వ తేదీన జన్మించిన పొంగులేటి అనతి కాలంలోనే జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. అంతేకాదు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరి నిరంతరం వార్తల్లో వ్యక్తిగా మారారు. టీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల గెలుపు బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఏ ఒక్క టీఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపధం చేసి నెగ్గారు కూడా..బడా కాంట్రాక్టర్ గా వివిధ రాష్ట్రాల్లో పెద్ద పెద్ద పనులు నిర్వహించే పొంగులేటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో వైఎస్ఆర్ సీపీ పార్టీలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాల నేపద్యంలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి)లో చేరారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమలరాజుకు మద్దతుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. దీంతో ఐదేళ్లపాటు ఎంతో సహనంగా టీఆర్ఎస్ లోనే కొనసాగారు. 2023లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం 2023 జూలై 2న రాహుల్ గాంధీ సమక్షంలో ఖమ్మంలో జరిగిన 'తెలంగాణ జన గర్జన' బహిరంగ సభలో కాంగ్రెస్‌లో చేరారు. పొంగులేటి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నే టార్గెట్ గా ఎంచుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై బాణాలు ఎక్కుపెట్టారు. దీంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలపై పట్టు సాధించి ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు విజయం సాధించేలా ప్రణాళికలు రచించారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం పార్టీలో చేరడంతో వీరిద్దరికీ జోడీ కుదిరింది. ఈ ఫలితంగా తాజా ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో 9 స్థానాల్లో కాంగెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అప్రయత్న పూర్వకంగానే రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో పొంగులేటికి చోటు లభించింది.        

Related Posts