YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎంత కష్టం... ఎంత నష్టం...

ఎంత కష్టం... ఎంత నష్టం...

రాజమండ్రి, డిసెంబర్ 9,
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలకు  మిచౌంగ్‌ తుపాను  తీరని నష్టం చేసింది.  మూడు రోజుల పాటు కోస్తా జిల్లాలతో పాటు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నష్టం కలిగించింది. కోతకొచ్చి పంట నీట మునిగిన దృశ్యాలు కోస్తా జిల్లాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.బాపట్ల వద్ద మంగళవారం తీరం దాటే క్రమంలో గంటకు 100 నుండి 120 కి.మీ వేగంతో వీచిన ప్రచండ గాలులతో అనేక చోట్ల చెట్లు, విద్యుత్‌ స్థంబాలు నేలకూలాయి. గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయి. ఈ లెక్కలన్నీ తేలితే కానీ, వాస్తవంగా జరిగిన నష్టం ఎంతన్నది స్పష్టం కాదు.లక్షలాది ఎకరాల వరిపంట నీట మునిగింది. కొన్ని చోట్ల కోసి పొలాల్లో వేసిన ఓదేలు నీళ్లలో తేలుతూ కనపడుతున్నాయి. కళ్లాల్లో పోసిన ధాన్యం కూడా తడిసిముద్దయింది. తుపాన్‌ తీరం దాటిన బాపట్ల జిల్లాలోనే దాదాపు 2 లక్షల ఎకరాల దాకా వరిపంట నీటమునిగినట్టు ప్రాధమిక సమాచారం. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా కొంచెం అటుఇటుగా ఆ స్థాయిలోనే నష్టం జరిగినట్టు చెబుతున్నారు. నెల్లూరు,తిరుపతి జిల్లాలతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా కూడా వరిపంట నీట మునిగింది. వేల రూపాయల పెట్టబడితో పాటు, ఆరుగాలం పడ్డ కష్టం నీళ్ల పాలు కావడం రైతాంగం గుండెలు బాదుకుంటోంది. మిర్చి, పొగాకు, వేరుశనగ, పసుపు తదితర పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో నానా కష్టాలు పడి పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  తుపాను రాష్ట్రం వైపు దూసుకు వస్తుందని వారం రోజుల కింద నుంచే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్న చర్యలపై స్పష్టత లేదు. కానీ తుపాను వస్తుందని తెలిసినా.. నాగార్జున సాగర్ డ్యామ్ ను వివాదాస్పద రీతిలో అధీనంలోకి తీసుకుని నీటిని విడుదల చేసుకున్నారు. కానీ ఆ నీరు పొలాల్లోకి చేరే సరికి తుపాను వచ్చింది. ఆ నీరు వల్ల ఉపయోగం లేకపోయింది. అసలు సాగర్ డ్యామ్ పై డ్రామా విషయంలో రాజకీయం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే.. తుపాను సూచనలు వారం ముందు తెలిసినా.. రైతులు కనీసం  ధాన్యాన్ని జాగ్రత్త చేసుకునే సౌకర్యాలు కూడా కల్పించలేదన్న విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు చాలా నింపాదిగా వ్యవహరిస్తారు. మూడేళ్ల క్రితం కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఆయన చాలా ఆలస్యంగా అక్కడ పర్యటించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి  విచిత్రమైన వాదన వినపించారు. తాను అక్కడికి వెళ్తే.. పనులకు ఆటంకం అవుతుందని అధికారులు అందరూ తనతో ఉంటే.. పనులు ఎవరు చేస్తారని అన్నారు. ఈ వాదన విన్న వారికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారంటే అధికారులు మరింత గట్టిగా పని చేస్తారు.  కానీ సీఎం జగన్ మాత్రం అలా అనుకోవడం లేదు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని.. సీఎం అక్కడకు వెళ్తే అధికారులంతా ఆయన వెంటే ఉంటారని ఇక సహాయ చర్యలు ఎవరు చేస్తారని  చాలా సార్లు ప్రశఅనించారు. ఆ తర్వాత పలుమార్లు విపత్తులు వచ్చాయి కానీ సీఎం జగన్ అంత వేగంగా స్పందించలేదు. ఇప్పుడు మించౌంగ్ తుపాను విషయంలోనూ అంతే. ఓ వైపు తుపాను బీభత్సం సృష్టిస్తూంటే.. ఆయన ఓ పార్టీ నాయకుని కుటుంబంలో పెళ్లికి వెళ్లారు. కనకదుర్గ ఆలయంలో గతంలో చేసిన శంకుస్థాపనలకే మళ్లీ శంకుస్థాపనలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు  పర్యటన ఖరారైన రోజునే ఆయన కూడా ఒక్క రోజు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణియంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాన్లు కొత్త కాదు. ప్రతి సంవత్సరం దాదాపుగా ఈ విపత్తుల బారిన పడుతూనే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 1970 నుండి ఇప్పటి వరకు దాదాపు 60కి పైగా తుపాన్లు రాష్ట్రంపై ప్రభావం చూపాయి. వీటిలో తీవ్ర, అతితీవ్ర తుపాన్లు 35కు పైనే ఉన్నాయి. ఏడు తీవ్ర, అతి తీవ్ర తుపాన్లు రాష్ట్రంలోనే తీరం దాటాయి. తీర ప్రాంత జిల్లాల్లో దాదాపుగా 3.50కోట్ల జనాభా రాష్ట్రంలో నివసిస్తున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రానున్న సంవత్సరాల్లో ప్రకృతి వైపరీత్యాల ముప్పు మరింతగా పెరగనుంది. కోస్తా జిల్లాలో ముఖ్యంగా కృష్ణా, గోదావరి డెల్టాలో తొందరగా ఖరీఫ్‌ వరినాట్లు వేసేలా నీటియాజమాన్య చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. ఇందులో రాజకీయ ప్రయోజనాలు, లేదా వ్యక్తిగత ప్రతిష్టలకు పోవడం గాకుండా రైతు ప్రయాజనాలను పరమావధిగా ప్రభుత్వం భావించాలి. కానీ విపత్తులు వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందన్నట్లుగా ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీఎం  జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విపత్తులు వస్తే వెంటనే స్పందించేవారు. మునిగిపోయిన పొల్లాల్లోకి దిగి.. ఎకరాలకు పాతిక వేల వరకూ పరిహార ఇవ్వాలని  డిమాండ్ చేసేవారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు  బాధితులను పరామర్శించడం లేదు. ఎలాంటి విపత్తులు వచ్చినా ఏరియల్ సర్వే చేస్తున్నారు. నష్టపోయిన వారికి పరిహారం విషయంలోనూ ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నామని చెబుతున్నారు కానీ.. ప్రత్యేకంగా ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదు. దీంతో రైతులు కుదేలవుతున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

Related Posts