YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

10 మంది మంత్రులు ఔటేనా

10 మంది మంత్రులు ఔటేనా

విజయవాడ, డిసెంబర్ 13,
వై నాట్ 175 అన్న వైసీపీ.. ఉన్న కాండిడేట్లను మార్చుకుంటూ వెళుతోంది. సోమవారం ఒకేసారి 11మంది ఇన్‌చార్జులను మార్చేసిన పార్టీ మరి కొంత మంది రెడీగా ఉండాలని సిగ్నల్ పంపేసింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. కనీసం సగం మంది మంత్రులు,   మాజీ మంత్రులకు టికెట్లు నిరాకరిస్తున్నారు. అవును ఇది నిజమే. జనంలో బాగా పాపులర్ అయిన మంత్రులను పక్కన పెట్టడమే కాదు.. కొంతమంది సీనియర్ మంత్రులను ఎంపీ   స్థానాలకు పంపిస్తున్నారు. వైసీపీ క్యాంప్  నుంచి అందుతున్న లేటెస్ట్ సమాచారం ఏంటంటే.. ?అంబటి, రోజా, ఉషశ్రీ చరణ్, గుమ్మనూరు జయరాం, నారాయణ స్వామి, చెల్లుబోయిన, జోగి రమేష్, విడదల రజని, అంజాద్ భాషా, పినిపె విశ్వరూప్  మొత్తం 10మంది మంత్రులకు టికెట్లే లేవని చెబుతున్నారు. మరి కొంతమంది ఈ లిస్టులో చేరవచ్చు కూడా. 11మంది ఇన్ చార్జులను మారుస్తూ సోమవారం బయటకొచ్చిన లిస్టు జస్ట్ శాంపిల్ మాత్రమే. గెలుపే లక్ష్యంగా అని ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి.. మంత్రుల స్థానాల మార్పునకు కూడా కారణం అదే అనుకోవాలి. ఏకంగా 65సీట్లలో మార్పులు చేర్పులు, తొలగింపులు జరుగుతుండటంతో మంత్రలు సైతం పక్కకు తొలగాల్సి వస్తోంది. అంబటి రాంబాబు వైసీపీకి పేరున్న ఫేస్. ప్రత్యర్థులపై మాటలతో దాడి చేసే ఈ మంత్రి సొంత జిల్లాలో మాత్రం వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సత్తెనపల్లిలో అనేక సందర్భాల్లో ప్రజలు నేరుగా ఎదురుతిరిగిన సంఘటనలు ఉన్నాయి. వైఎస్‌కు ముఖ్య అనుచరుడిగా ఉండటం.. మొదట్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేసి జగన్ తో నడవడం, పార్టీ పట్ల విధేయత అనేవి ఆయనకు మంత్రి పదవిని తెచ్చాయి తప్ప.. జిల్లా అంతటిని నడిపించగల సమర్థత వల్ల కాదు. మీడియాలో పాపులర్ అయిన ఆయన సొంత జనాలకు ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. ఇది గుర్తించే పక్కన పెడుతున్నారని,  ఈ విషయం ఆయనకు చెప్పేయడం.. అంబటి ఒప్పుకోవడం కూడా జరిగిందని టాక్ఎంతో కాలంగా పార్టీతో ఉన్న రోజాకు మొదటి విడతలో మంత్రిపదవి రాకపోవడంతో.. ఆమెకున్న పాపులారిటీ దృష్ట్యా రెండోసారి ఇచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయిన రోజా.. సొంత నియోజకవర్గంలో మాత్రం ప్రజలకు దూరంఅయ్యారు. స్థానిక రాజకీయాలు కూడా అందుకు కారణం. లోకల్ లీడర్లంతా ఎదురుతిరగడంతో ఆమెకు తీవ్రంగా ఎదురుగాలి ఉంది. అయితే ఈ విషయంలో రోజాను ఇంకా కన్విన్స్ చేయలేదు. వైసీపీలో మరో పాపులర్ మంత్రి విడదల రజని. అనూహ్యంగా పార్టీ టికెట్ దక్కించుకుని తొలివిడతే మంత్రి కూడా అయిపోయిన ఆమె సొంత నియోజకవర్గంలో మాత్రం సమన్వయం చేసుకోలేకపోయారు. స్థానిక నాయకులు ఎవ్వరూ ఆమెను యాక్సెప్ట్ చేయడం లేదు. దీంతో గుంటూరుకు తీసుకొచ్చినప్పటికీ అది కూడా తాత్కాలికమే అన్నమాట పార్టీ క్యాంపులో వినిపిస్తోంది. చెల్లుబోయిన శ్రీనివాస్ కు ఈసారి సుభాష్ చంద్రబోస్ నుంచి గట్టి పోటీ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తనకే టికెట్ కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాజమండ్రి ఎంపీగా చెల్లుబోయిన ను పంపాలని అనుకుంటున్నారు. ఉషశ్రీ చరణ్ తో పార్టీకి చాలా సమస్యలు వచ్చాయి. లోకల్ లీడర్లతో సయోధ్య కుదరకపోవడంతోపాటు.. భూ ఆక్రమణ ఆరోపణలు పార్టీని ఇబ్బంది పెట్టాయి. కాబట్టి ఆమెకు వీడ్కోలు చెబుతున్నారు. గుమ్మనూరు జయరాం పై వచ్చినన్ని ఆరోపణలు ఏ మంత్రిపైనా రాలేదు. చాలా తీవ్ర ఇబ్బందులున్నప్పటికీ ఆయన్ను మంత్రిగా పూర్తి కాలం కొనసాగించారు. మంత్రులను మార్చినప్పుడు కూడా జయరాం ను తప్పించలేదంటే కారణం వాల్మీకి వర్గం నుంచి మరో వ్యక్తి లేకపోవడమే. ఇప్పుడు తలారీ రంగయ్యను అసెంబ్లీకి తెచ్చి జయరాంను తప్పించేస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై వ్యతిరేకత , సానుకూలత రెండూ లేవు. ఇప్పటి స్పీడ్ రాజకీయాలకు ఆయన పనికిరాడని పక్కన పెడుతున్నారు. పెడన నుంచి ఉన్న జోగి రమేష్ ది సొంత నియోజకవర్గం కాదు. ఆయనపై వ్యతిరేకత ఉన్నప్పటికీ వైసీపీ గాలిలో గెలుచుకొచ్చారు. ఇప్పుడు అక్కడ గెలిచే అవకాశం లేకపోవడంతో ఏలూరు ఎంపీగా వెళ్లమని చెబుతున్నారు. చాలా కాలం మంత్రిగా ఉన్న పినిపె విశ్వరూప్‌ పై కూడా వ్యతిరేకత ఉంది. కొనసీమ అల్లర్ల సమయంలో అది మరింత పెరిగింది. ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా కూడా పక్కన పెట్టి.. ఆయన కుమారుడికి మరోచోట టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు.వీళ్లు కాకుండా సీనియర్ మంత్రులు ధర్మాన, బొత్స, పెద్దిరెడ్డి, బుగ్గన వంటి వారి సీట్లపై ఏ ప్రభావం లేనప్పటికీ.. పార్టీ వ్యూహాత్మకంగా కొంతమందిని ఎంపీగా పోటీ చేయాలని చెబుతోంది. ధర్మాన, బొత్సతో ఇవే మంతనాలు నడుస్తున్నాయి. అందుకేనేమో బొత్స సత్యనారాణ వేసీపీలో ఏదీ శాశ్వతం కాదన్నారు. అభ్యర్థుల మార్పుపై ఎప్పటి నుంచో కసరత్తు జరుగుతున్నప్పటికీ..  తెలంగాణ ఎన్నికల ఫలితాలు దీనిని మరింత ముందుకు నెట్టాయి తెలంగాణలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వల్లనే ఎక్కువ స్థానాల్లో ఓడిపోయామని బీఆర్‌ఎస్ విశ్లేషిస్తోంది. ఆ పార్టీ ఆ విషయాన్ని ముందే గుర్తించినప్పటికీ.. అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో మారిస్తే.. తమపై వ్యతిరేకత ఉందన్న విషయాన్ని ముందే ఒప్పుకున్నట్లు అవుతుందని.. లేకపోతే.. వాళ్లు వేరే పార్టీలోకి వెళితే ఇబ్బంది ఎదురవుతుందని కేసీఆర్ మొండిగా ముందుకెళ్లారు. కేసీఆర్‌ది ఓ రకమైన మెండితనమైతే జగన్ ది మరోరకం. ఆల్రెడీ 175 అని టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్ ఈ విషయంలో వెనక్కు తగ్గేలా లేరు. ఏది ఏమైనా సరే ఏలాంటి ఫలితం వచ్చినా సరే ముందుకే అన్నట్లుగా ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా లెక్కలు, కూర్పులు చేర్పులతో జగన్ ఎప్పుడూ పకడ్బందీగానే వెళతారు. ఆయన కాన్ఫిడెన్సు పోయిన సారి మంచి రిజల్ట్ ఇచ్చింది. ఈ మార్పు మరి రిజల్టును పాజిటివ్ చేస్తుందా.. లేక ముందే తమపై వ్యతిరేకతను చాటుతుందా అన్నది చూడాలి.

Related Posts