విశాఖపట్టణం, డిసెంబర్ 13,
విశాఖను ఏపీ ప్రభుత్వం పాలన రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే విశాఖ నుంచి సీఎం జగన్ పాలన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే విశాఖలో పలు కార్యాలయాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి ప్రాంతానికి చెందిన కొందరు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో విశాఖకు రాజధానిని తరలిస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు. రోస్టర్ ప్రకారం ఈ పిటిషన్ సోమవారం హైకోర్టు బెంచ్ ముందుకు వెళ్లింది. దీంతో హైకోర్టు న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తర్వాతే రాజధాని తరలింపుపై పూర్తి స్థాయి ఆదేశాలు వెల్లడిస్తామని ప్రభుత్వ న్యాయవాదికి న్యాయమూర్తి తెలిపారు. అయితే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మధ్యంతర పిటిషన్ వేసుకోవచ్చని సూచించారు. రాజధాని వ్యవహారాలను విచారించే త్రిసభ్య ధర్మాసనం లేదా పాలనాపరంగా ఏం చేయాలనే అంశంపై ప్రభుత్వమే ఆలోచించుకోవాలని పేర్కొంది. ఒక వేళ త్రిసభ్య ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే తామే విచారిస్తామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది ఓకే తెలిపారు. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేలోపే కార్యాలయాలు తరలిస్తే పరిస్థితేంటని, అలా జరగకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు దృష్టికి పిటిషనర్ల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ తీసుకెళ్లారు. అయితే ఇందుకు ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ.. ఇప్పటికిప్పుడు కార్యాలయాల తరలింపు ఉండదని, అది సుదీర్ఘ ప్రక్రియ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇలానే చెప్పి కార్యాలయాల తరలింపునకు అంతర్గంగా ఏర్పాట్లు చేస్తోందని మురళీధర్ కోర్టుకు తెలిపారు. దీంతో రాజధాని, కార్యాలయాలు తరలించకుండా ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు.