దేశవ్యాప్తంగా వచ్చే సాధారణ ఎన్నికలకు మరో ఏడాది కూడా గడువు లేకుండానే చాలా రాష్ట్రాల్లో లోక్‌సభ నియోజకవర్గాల ఉప ఎన్నికల హడావిడి ఎక్కువుగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న రాజస్థాన్, యూపీ, బిహార్‌లో పలు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇక ఇప్పుడు కర్ణాటకలో ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలవడంతో అక్కడ కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఏపీ మీద పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో విపక్ష వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వైసీపీ ఎంపీలు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు అయితే చేశారు కాని వాటిని ఆమోదింపజేసుకునేలా సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారా ? లేదా ? అన్నదానిపై రకరకాల చర్చలు, విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నెల 29న రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలను ఢిల్లీకి లో స్పీకర్ ను కలిశారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన లోక్‌సభ సీట్ల విషయానికి వస్తే మిథున్‌రెడ్డి (రాజంపేట), అవినాష్‌రెడ్డి (కడప), మేకపాటి రాజమోహన్‌రెడ్డి (నెల్లూరు), వైవి.సుబ్బారెడ్డి(ఒంగోలు), వరప్రసాద్ (తిరుపతి) ఉన్నారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ఎన్నికలు వస్తే గెలవడం టీడీపీకి పెద్ద సవాల్ లాంటిదే. ఇవన్నీ వైసీపీకి కంచుకోటల్లాంటి ప్రాంతాలే.ఈ క్రమంలోనే ఇక్కడ పార్టీ తరపున బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు సీఎం చంద్రబాబు అప్పుడే కసరత్తులు ప్రారంభించడంతో పాటు ఓ నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలుస్తోంది.వైసీపీ అధినేత జగన్‌కు కంచుకోట… గతంలో ఆయన ఎంపీగా పనిచేసిన కడప సీటు కోసం మంత్రి ఆదినారాయణరెడ్డితో పాటు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలలో ఎవరో ఒకరు రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. అలాగే కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులరెడ్డి పేరు కూడా లైన్లో ఉంది. అదే జిల్లా రాజంపేట విషయానికి వస్తే అక్కడ ఇటీవల పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి లేదా ఆయన తనయుడు పోటీ చేయడం పక్కా. ఇక సీఎం చంద్రబాబు సొంత జిల్లా తిరుపతి సీటు గెలుపు విషయంలో టీడీపీ లెక్క ఎప్పుడూ తప్పుతూ వస్తోంది. 2009లో ఇక్కడ నుంచి వర్ల రామయ్య పోటీ చేసి ఓడిపోగా గత ఎన్నికల్లో టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వగా ఆ రాంగ్ స్టెప్‌తోనే టీడీపీ ఇక్కడ ఓడింది. ఇక ఇప్పుడు ఎన్నికలు వస్తే వర్ల రామయ్య అయితేనే బలమైన అభ్యర్థి అవుతారని బాబు భావిస్తున్నారు.ఇక వైసీపీకి బలంగా ఉన్న జిల్లాలైన ఒంగోలు, నెల్లూరు ఎంపీ సీట్లలో టీడీపీ అభ్యర్థుల విషయంలో కూడా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఒంగోలుకు మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు మరో ఎమ్మెల్సీ కరణం బలరాం పేర్లు పరిశీలిస్తున్నారు. అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి వర్సెస్ కరణం గొడవను కరణంకు ఎంపీ సీటు ఇచ్చి సెటిల్ చేయాలని కూడా బాబు ప్లాన్ చేస్తున్నారు. కరణం గతంలో ఇక్కడ ఎంపీగా గెలిచారు. బాబు దృష్టిలో ఇద్దరూ ఉన్నా ఆయన మొగ్గు ఎలా ఉంటుందో ? చూడాలి.ఇక నెల్లూరు విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఇక్కడ ఆదాలా ప్రభాకర్‌రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఆయనే బలమైన అభ్యర్థి అవుతారు. అయితే ఆనం కుటుంబం నుంచి కూడా ఎవరో ఒకరిని పోటీకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదేమైనా చంద్రబాబు ఇక్కడ ఉప ఎన్నికలు వస్తే వైసీపీ సిట్టింగులకు పోటీగా గట్టి అభ్యర్థులనే బరిలోకి దింపే కసరత్తులు అప్పుడే స్టార్ట్ చేసేశాడు.