హైదరాబాద్, డిసెంబర్ 13
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన రీతిలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై సీఎస్ వివిధ శాఖల అధికారులతో బుధవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. శీతాకాల విడిది లో భాగంగా రాష్ట్రపతి ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నారు. ఐదు రోజుల విడిది అనంతరం ఆమె ఈ నెల 23న తిరుగు ప్రయాణమవుతారు. ఈ సందర్భంగా తగిన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సీఎస్ శాంతికుమారి సూచించారు. ఆరోగ్య, రోడ్లు భవనాలు, మున్సిపల్, విద్యుత్, సంబంధిత శాఖలు కూడా బ్లూ బుక్ ప్రకారం ఫూల్‌ప్రూఫ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డీజీపీ రవి గుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సీనియర్ పోలీసు అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.