నెల్లూరు, డిసెంబర్ 21,
వైసీపీ నుంచి బయటకొచ్చిన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఆల్రెడీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి.. టీడీపీలో చేరి తమ రాజకీయ కార్యకలాపాలు మొదలు పెట్టారు. కానీ ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం ఎందుకో గ్యాప్ తీసుకున్నారు. ఆయన పార్టీలో చేరలేదు, అదే సమయంలో నియోజకవర్గంలోనూ తిరగడంలేదు. ఇటీవల ఆయన రాజకీయ భవిష్యత్ పై ఊహాగానాలు బయలుదేరాయి. ఆయన యాక్టివ్ గా లేరని, టీడీపీ కూడా ఆయన విషయంలో సందేహంగానే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దశలో మళ్లీ రామనారాయణ రెడ్డి తన రాజకీయం మొదలు పెట్టారు. తన అభిమానుల్ని ఇంటికి పిలిపించుకుంటున్నారు. తాజాగా ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి చేజర్ల మండలానికి చెందిన నేతలు ఆనం రామనారాయణ రెడ్డి ఇంటికి వచ్చి ఆయనతో సమావేశమయ్యారు. తమ సమస్యలు చెప్పుకున్నారు. నాయకులెవరైనా ప్రజల్లో ఉంటేనే వారి రాజకీయాలు సజావుగా సాగినట్టు. అందులోనూ ప్రతిపక్షంలో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి, నిత్యం ప్రజల్లోనే ఉండాలి. వైసీపీనుంచి గెలిచినా, చివరకు టీడీపీ దరి చేరిన ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయాలు మాత్రం కొన్ని నెలలుగా సజావుగా సాగడంలేదు. నారా లోకేష్ యువగళం నెల్లూరుకు చేరుకున్న సమయంలో మాత్రమే ఆయన హడావిడి చేశారు. తనతోపాటు కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకొచ్చి లోకేష్ యువగళంలో ఆయన వెంట నడిచారు. తాను పోటీచేయాలనుకుంటున్న ఆత్మకూరు నియోజకవర్గంలో లోకేష్ యువగళం యాత్ర విజయవంతం అయ్యేలా కృషి చేశారు. ఆ తర్వాత మాత్రం ఆయన సైలెంట్ అయ్యారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో చురుగ్గా ఉన్నారు. టీడీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆనంతోపాటు వైసీపీనుంచి సస్పెండ్ అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి.. ఇద్దరూ ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అధికారికంగా కండువా కప్పుకున్నారు. కానీ ఆనం మాత్రం ఆ కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నారు. ఇంతకీ ఆనం మనసులో ఏముంది..? ఆయన ఎందుకు తర్జన భర్జన పడుతున్నారనేది తేలడంలేదు. ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అక్కడినుంచి తిరిగి పోటీ చేయాలనుకోవట్లేదు. పార్టీతో విభేదాలు రాగానే లగేజ్ సర్దుకుని నెల్లూరుకు వచ్చేశారు. ఒకవేళ ఆయనకు నియోజకవర్గంపై ప్రేమ ఉంటే వెంకటగిరిలోనే ఉండేవారు. పోనీ తన పాత నియోజకవర్గం ఆత్మకూరులో పోటీ చేస్తారా అంటే.. అదీ తేలడంలేదు. ఆత్మకూరులో ఆయన చురుగ్గా పర్యటిస్తారని ఆశపడ్డ అభిమానులు కూడా సైలెంట్ అయ్యారు. ఆనం దర్శనం కావాలంటే నెల్లూరుకి వెళ్లాల్సిందే. అటు పార్టీకి దగ్గర కాలేక, ఇటు ప్రజలకు దగ్గర కాలేక ఆనం సతమతమవుతున్నారు. ఎన్నికలకు టైమ్ దగ్గరపడింది. వైసీపీ ఆల్రడీ అభ్యర్థుల్ని ఖరారు చేస్తోంది. ఇటు టీడీపీ కూడా జనసేన పొత్తుతో సీట్ల ఖరారుపై కసరత్తులు చేస్తోంది. ఈ దశలో ఆనం యాక్టివ్ కాలేకపోతే రేపు మరింత కష్టం. అయితే ఇప్పుడు ఆనం మళ్లీ తెరపైకి వస్తున్నారు. తన అభిమానులతో సమావేశమవుతున్నారు. భవిష్యత్ వ్యూహాలు రచిస్తున్నారు. పనిలో పనిగా ఆ సమావేశాల వ్యవహారం మీడియాలో హైలైట్ అయ్యేలా చూస్తున్నారు. మళ్లీ ఆనం రాజకీయంగా బిజీ అవుతున్నారు. అయితే నియోజకవర్గంమే ఫైనల్ కావాల్సి ఉంది. టీడీపీ కండువా మెడలో పడాల్సిన లాంఛనం కూడా మిగిలే ఉంది.